Cit: సిట్ సిద్ధం
ABN, Publish Date - Nov 23 , 2024 | 12:31 AM
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందానికి సంబంధించిన సిబ్బంది శుక్రవారం తిరుపతి చేరుకున్నారు.
భూదేవి కాంప్లెక్స్‌లో కార్యాలయం
కల్తీ నెయ్యిపై నిగ్గు తేల్చనున్న దర్యాప్తు
తిరుపతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందానికి సంబంధించిన సిబ్బంది శుక్రవారం తిరుపతి చేరుకున్నారు. వారికి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్సులో కార్యాలయం కేటాయించారు. అక్కడ అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటయ్యాక సిట్‌ను నడిపే కీలక అధికారులు రానున్నారు. ఆపై టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చనున్నారు. సిట్ విచారణకు వివిధ అంశాల్లో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 31 మంది సిబ్బందిని నియమించింది. ఆ సిబ్బంది శుక్రవారం తిరుపతి చేరుకుని పరిపాలనా విభాగం అదనపు ఎస్పీ ఎదుట రిపోర్టు చేసుకున్నారు. అనంతరం సిట్‌కు కార్యాలయం కేటాయించిన భూదేవి కాంప్లెక్సులోని పాత ఎస్వీబీసీ భవనానికి చేరుకున్నారు. అందులో సిట్ బృందానికి అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటవుతున్నాయి. వారం పది రోజుల్లో అవన్నీ పూర్తయ్యాక సిట్ కీలక అధికారులు ఐదుగురు తిరుపతికి రానున్నట్టు సమాచారం. తిరుపతి కేంద్రంగా సిట్ చేపట్టే దర్యాప్తులో సహకరించేందుకు వచ్చిన సహాయక సిబ్బందిలో మదనపల్లె, కర్నూలు, తిరుపతి, ఒంగోలు ప్రాంతాలకు చెందిన నలుగురు డీఎస్పీలు, రాయలసీమ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది సీఐలు, ఏఎ్‌సఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటెండర్లు వంటి సిబ్బంది 19 మంది ఉన్నారు.
వారం పది రోజుల్లో రానున్న కీలక సభ్యులు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ అనే సంస్థ కల్తీ చేసి సరఫరా చేసిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులను తీవ్ర మనోవేదనకు గురిచేసిన సంగతి తెలిసిందే. లడ్డూ నాణ్యత, రుచి, సువాసన వంటి వాటిపై తరచూ భక్తుల నుంచీ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు చొరవ తీసుకుని నెయ్యి నమూనాలను పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ అనుబంధ ల్యాబ్‌కు పంపడం, ఆ పరీక్షల్లో నెయ్యి నాణ్యత దారుణంగా ఉందని, అందులో జంతు కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు కల్తీ చేశారని ల్యాబ్ అనుమానం వ్యక్తం చేయడం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.
విచారణలో ఏఆర్ డెయిరీ తమిళనాడులోని దిండిగల్ నుంచీ కాకుండా తిరుపతికి చేరువలోనే ఉన్న వైష్ణవి డెయిరీ నుంచీ నెయ్యి సేకరించి దాన్నే టీటీడీకి సరఫరా చేసినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు గత అక్టోబరు 4వ తేదీన సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీసు నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నుంచి ఒకరు చొప్పున మొత్తం ఐదుగురు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించింది. అప్పటి నుంచి సిట్ విచారణ ఎప్పుడు మొదలవుతుందా? ఆ విచారణలో ఏమి తేలుతుందా? అని దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సిట్ సహాయక సిబ్బంది తిరుపతి చేరుకోగా వారం పది రోజుల్లో సిట్ కీలక సభ్యులు రానున్నారు. మొత్తం మీద సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించిన నెలన్నర తర్వాత ఆ దిశగా కదలిక మొదలైంది. కీలక సభ్యులు వచ్చి విచారణ ప్రారంభిస్తే నెల రోజుల్లోనే ముగించి సుప్రీం కోర్టుకు నివేదిక అందజేసే అవకాశముందని సమాచారం.
Updated Date - Nov 23 , 2024 | 12:31 AM