YCP: వైసీపీ పాపం...ఇప్పుడయ్యింది శాపం !
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:52 AM
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పేర్లతో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేసి వినియోగదారుల నడ్డ్డి విరిచింది. ఇప్పుడూ అప్పటి పాపం వినియోగదారులను వెంటాడుతోంది.
మూడు రకాల అదనపు వడ్డనలతో రూ.145 కోట్ల భారం
ఇప్పుడూ తప్పని ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం
ఈ నెల నుంచి 15నెలలు మోయాల్సిందే
చిత్తూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పేర్లతో అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేసి వినియోగదారుల నడ్డ్డి విరిచింది. ఇప్పుడూ అప్పటి పాపం వినియోగదారులను వెంటాడుతోంది. 2022-23లో అధిక ధరకు బహిరంగ మార్కెట్‌లో ఎడాపెడా విద్యుత్తు కొనడంతో రూ.6,072 కోట్ల అదనపు ఛార్జీల భారాన్ని జనం మోయక తప్పడం లేదు. ఇంధన సర్దుబాటు ఛార్జీల (ఎఫ్‌పీపీసీఏ) కింద ఆ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఈ మొత్తాన్ని నవంబరులో వినియోగదారులు వాడిన విద్యుత్తుకు జారీ చేసే బిల్లు మొదలుకుని 15 నెలలు వసూలు చేయాలని డిస్కమ్‌లను ఆదేశించింది. ఈ ప్రకారం 2026 జనవరి వరకు ఈ భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తోంది.రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించిన వీటీపీఎస్, కృష్ణపట్నం మూడో యూనిట్ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయాల్సివచ్చింది.
ప్రజలపై రూ.427 కోట్ల భారం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని రకాల విద్యుత్తు వినియోగదారుల మీద ఇంధన సర్దుబాటు ఛార్జీలతో నెలకు రూ.28 కోట్ల భారం పడనుంది. నవంబరు నుంచి 2026 జనవరి వరకు వసూలు చేయనున్న మొత్తం రూ.427 కోట్లుగా కానుంది. ఈ నెల నుంచి వినియోగదారులు వాడే ప్రతి యూనిట్ మీదా రూ.1.21 మేర అదనంగా వసూలు చేయనున్నారు. అంటే సగటున వంద యూనిట్ల విద్యుత్తును వాడే వినియోగదారులు ఇక నుంచి ప్రతి నెలా రూ.121 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. 200 యూనిట్లు వాడేవారు రూ.242 అదనంగా చెల్లించక తప్పదు.
మూడు రకాలుగా అదనపు వసూళ్లు చేసిన వైసీపీ
వైసీపీ ప్రభుత్వం గతంలో మూడు రకాల కొత్త ఛార్జీలను వసూలు చేసేది.అప్పటిదాకా ఫిక్స్‌డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఎలక్ర్టిసిటీ డ్యూటీలను వసూలు చేస్తుండగా.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మూడింటితో పాటు అదనంగా ఎఫ్‌పీపీసీఏ (2021), ఎఫ్‌పీపీసీఏ (2023), ట్రూఅప్ ఛార్జె్‌సను వసూలు చేసేది. అంటే మనం వాడే కరెంటుకు అదనంగా ఈ ఆరు రకాల ఛార్జీలను చెల్లించే పరిస్థితి ఉండేది. 2022 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు, మొత్తం మూడేళ్ల పాటు ఈ ట్రూఅప్ ఛార్జెస్ బాదుడును ప్రజలు భరించక తప్పదు. ఇటీవల ఎఫ్‌పీపీసీఏ (2021) ఛార్జీల వసూలు పూర్తయింది. మళ్లీ ఇప్పుడు కొత్త బాదుడు ప్రారంభమైంది.
వైసీపీ హయాంలో ఏడాదికి రూ.145 కోట్ల భారం
వైసీపీ ప్రభుత్వ హయాంలో అదనంగా వసూలు చేసిన మూడు ఛార్జీలతో ఏడాదికి జిల్లా ప్రజల మీద రూ.145 కోట్ల భారం పడేది. ఇప్పటికీ ఆ భారం అటుఇటుగా కొనసాగుతూనే ఉంది. ట్రూఅప్ ఛార్జెస్ ద్వారా మాత్రమే ఏడాదికి రూ.25 కోట్లు చొప్పున, మొత్తం మూడేళ్లలో రూ.75 కోట్ల భారం పడింది. అలాగే, ఎఫ్‌పీపీసీఏ (2021) ద్వారా ఏడాదికి రూ.20 కోట్లు, ఎఫ్‌పీపీసీఏ (2023) ద్వారా ఏడాదికి సుమారు రూ.వంద కోట్లు అదనంగా భారం పడింది. మొత్తంగా ఒక్క ఏడాదికి ఉమ్మడి జిల్లా ప్రజల నెత్తిన రూ.145 కోట్ల భారం పడింది.ఇటీవల ఎఫ్‌పీపీసీఏ (2021) ఛార్జీల వసూలు పూర్తయిన విషయం తెలిసిందే.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో
గృహ సర్వీసులు: 13,73,346
వాణిజ్య: 1,61,215
ఎల్‌టీ: 19,22,041
పరిశ్రమలు: 21,117
వ్యవసాయ: 3,17,709
ప్రభుత్వ సర్వీసులు: 46,690
హెచ్‌టీ: 1906
Updated Date - Nov 02 , 2024 | 01:52 AM