CM Chandrababu : భారత్ నెట్-2లో ఫైబర్‌గ్రిడ్
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:09 AM
భారత్ నెట్-2లో భాగంగా కేంద్రం నిధులతో ఫైబర్ గ్రిడ్ సేవలను రాష్ట్రంలో విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మౌలిక సదుపాయల కల్పనపై సమీక్షించారు.
కేంద్ర నిధులతో సేవల విస్తరణ.. భూగర్భ వైరింగ్ విధానమే మేలు
మౌలిక సదుపాయాల సమీక్షలో చంద్రబాబు
సీప్లేన్లకు 10 ప్రాంతాల గుర్తింపు
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): భారత్ నెట్-2లో భాగంగా కేంద్రం నిధులతో ఫైబర్ గ్రిడ్ సేవలను రాష్ట్రంలో విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మౌలిక సదుపాయల కల్పనపై సమీక్షించారు. డ్రోన్, మారిటైమ్, పోర్టులు, ఫైబర్‌నెట్ విభాగాలపై పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారత్ నెట్-2 కింద భూగర్భ ఫైబర్ గ్రిడ్‌కు కేంద్రం నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని వివరించారు. విద్యుత్తు స్తంభాలకు ఫైబర్ నెట్ కేబుళ్లను ఏర్పాటు చేసినందున సముఖత వ్యక్తం చేయలేదని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఫైబర్ గ్రిడ్ విస్తరణకు భూగర్భ కేబుల్ విధానమే శాశ్వతమన్నారు. దీనివల్ల ఫైబర్ వైర్లు 50ఏళ్ల దాకా భద్రంగా ఉంటాయని చెప్పారు. డ్రోన్, మారిటైమ్‌పైనా చంద్రబాబు సమీక్షించారు. డ్రోన్ తయారీపై పలు వర్సిటీలతో సంప్రదింపులు జరుపుతున్నామని సురేశ్‌కుమార్ చెప్పారు. అమరావతి తరహాలోనే పోర్టుల కోసం భూసేకరణలో రైతులను కీలక భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. పోర్టుల నిర్మాణంకోసం భూములను సేకరించాలని కలెక్టర్లను కోరారు. పోర్టులు గ్రోత్ ఇంజన్‌గా మారుతాయని వెల్లడించారు. డ్రోన్ శిక్షణ కోసం ఔత్సాహికులను గుర్తించాలన్నారు. వాటర్ డ్రోన్, సీప్లేన్లు ఏర్పాటు చేయడానికి పది ప్రాంతాలను గుర్తించామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, అరకు, లంబసింగి, రుషికొండ కోనసీమ, కాకినాడ, తిరుపతి, గండికోట, నరసాపురంలో సీప్లేన్‌లను ఎగురవేసేందుకు అనువైన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. దగదర్తిలో నైట్ ల్యాండింగ్ ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
Updated Date - Dec 13 , 2024 | 05:09 AM