CM Chandrababu : ఎనర్జీ హబ్‌గా ఏపీ
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:48 AM
విద్యుత్తు రంగం చాలా శక్తివంతమైనదని .. కరెంటు లేకపోతే ప్రగతి ఆగిపోతుందని .. జన జీవనం స్తంభించిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్‌గా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇంటికి కరెంటు పాత మాట ..
ఇప్పుడు ఇల్లే కరెంటు ఉత్పత్తి సంస్థ
గ్రీన్ కారిడార్‌లను తయారుచేయాలి
సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ లాంటి న్యూఎనర్జీ విధానాలు అమలు
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నిర్దేశం
అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగం చాలా శక్తివంతమైనదని .. కరెంటు లేకపోతే ప్రగతి ఆగిపోతుందని .. జన జీవనం స్తంభించిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్‌గా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకప్పుడు ఇంటికి కరెంటు అనేది పాతమాటని .. ఇప్పుడు ప్రతి ఇల్లూ సోలార్ కరెంటు ఉత్పత్తి సంస్థగా మారుతోందని వ్యాఖ్యానించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీలాంటి న్యూఎనర్జీ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో గురువారం కలెక్టర్ల సదస్సు రెండోరోజున ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాల్సిన అసవరం ఉందన్నారు. కొత్త పాలసీ ప్రకారం చార్జింగ్ స్టేషన్లను పెట్టబోతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. సూర్యఘర్ కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్‌ను బిగించి కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలని, ఈ పథకంలో సబ్సిడీ కూడా వస్తుందని చంద్రబాబు చెప్పారు. వాడుకోగా మిగిలిన కరెంటును గ్రిడ్‌కు పంపి అమ్ముకునే వీలుందని, ఇప్పటికే కుప్పంలో ఒక మోడల్‌ను అమలు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైనా సోలార్ ప్యానళ్లను బిగించి విద్యుదుత్పత్తిని చేస్తామన్నారు. గ్రీన్, సోలార్ ఎనర్జీ వినియోగంలో రైతులను భాగస్వాములను చేస్తామన్నారు.
యూనిట్ ఆదా 2 యూనిట్ల ఉత్పత్తితో సమానం
ఎనర్జీ తయారీ, వినియోగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఒక యూనిట్ కరెంటును ఆదా చేస్తే ..రెండు యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేసినట్లుగా గ్రహించాలని చెప్పారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎ్‌సఎల్) చేపడుతున్న పొదుపు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యుత్తు ప్రమాదాలను నివారించాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్తు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖకు సలహా ఇచ్చారు. కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించాలని కోరారు. విద్యుదుత్పత్తి ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని .. ఇందుకు గ్రీన్ ఎనర్జీ ఉపయోగపడుతుందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం అమలు చేస్తోన్న పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివరించారు. రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల పరిధిలో 6.39 లక్షల రైతులు సూర్యఘర్ పథకం కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో 77,009 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 65000 మంది ఇళ్లలో బిగించడం పూర్తయిందని, ఈ పథకం కింద కేంద్రం ఒక కిలోవాట్‌కు రూ.30,000, రెండు కిలోవాట్‌లను రూ.60,000, మూడు కిలోవాట్‌లకు రూ.78,000 చొప్పున సబ్సిడీ ఇస్తుందని విజయానంద్ వివరించారు. ఈ పథకంకింద డిస్కమ్‌లు రూ.25.27 కోట్లను సబ్సిడీ కింద విడుదల చేశాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,17,947 మంది ఎస్సీ,ఎస్టీ విద్యుత్తు వినియోగదారులు పీఎం సూర్యఘర్ కింద దరఖాస్తులు చేసుకున్నారని విజయానంద్ వివరించారు.
సీఎం కుసుమ్ పథకం కింద రైతులకు 3725 మెగావాట్ల సామర్థ్యంతో వ్యవసాయ ఫీడర్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. 0.5 నుంచి ఐదు మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్తుప్లాంట్లను ఏర్పాటు చేసే కార్యాచరణకు సిద్ధమయ్యామన్నారు. ఒక మెగావాట్‌కు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పమీకరిస్తున్నామని విజయానంద్ వెల్లడించారు. జిల్లా ఎలక్ర్టిసిటీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఏపీ ఇంటిగ్రేటెట్ క్లీనర్ ఎనర్జీ పాలసీలో భాగంగా బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సోలార్ పార్కులను ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయానంద్ తెలిపారు. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ విధానంలో భాగంగా 1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 1500 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని విజయానంద్ చెప్పారు.
Updated Date - Dec 13 , 2024 | 04:48 AM