కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగి మాపై నిందలా?
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:58 AM
ఆస్తిలో వాటా ఇవ్వకుండా వైసీపీ అధినేత జగన్ తన తల్లీ, చెల్లిని రోడ్డుకు పడేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తమను నిందిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు.
తల్లి, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిపై ఎవరైనా ఆంక్షలు పెడతారా?
జగన్ లాంటి చిల్లర వ్యక్తితో రాజకీయాలు చేస్తాననుకోలేదు: చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆస్తిలో వాటా ఇవ్వకుండా వైసీపీ అధినేత జగన్ తన తల్లీ, చెల్లిని రోడ్డుకు పడేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తమను నిందిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విధ్వంసం గురించీ చర్చించుకుంటున్నారు. చీకటి జీవోలతో నాడు పాలన సాగించారు. ఆ జీవోలపై విచారణ చేయిస్తున్నాం. గత పాలకుల అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తల్లి, చెల్లితో గొడవలు పెట్టుకుని వాటిలోకి తమను లాగుతున్నారని ఆయన ఆగ్రహించారు. ‘‘తండ్రి సంపాదించిన ఆస్తిని తల్లికి రానివ్వకుండా చేస్తున్నారు. తల్లి, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిపై ఆంక్షలు పెడతారా ఎవరైనా?. 2004లో జగన్ ఆదాయం ఎంత? ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?’’ అని ప్రశ్నించారు. కేంద్రం అమరావతికి డబ్బులిస్తామంటే ఆనాడు వద్దన్నారని, ప్రజావేదిక కూల్చారని, తాను తల్చుకుంటే ఇప్పుడు కూల్చలేనా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తితో రాజకీయాలు చేస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదనీ అన్నారు.
వైసీపీలో ఉండేవారు కూడా ఆ పార్టీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేలా ఆనాడు జగన్ పాలన సాగిందన్నారు. విలువల్లేని మనుషులతో సమాజానికి చేటు అని, చెత్త టీవీ, చెత్త పేపరులో నోటికొచ్చింది రాసుకుంటున్నారని ఆగ్రహించారు. గత ఐదేళ్లు తనను బయటకు రానివ్వలేదని, కానీ తాను జగన్‌ను తిరగనిస్తున్నామన్నారు. తెనాలి బాధితురాలి కేసులో.. వైసీపీలో చేరి తన కొడుకు చెడిపోయాడని నిందితుడి తల్లే తెలిపారన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు ముందుకు సాగలేదనీ, ఏపీకి ఉండే కనెక్టివిటీపై అశ్రద్ధ చేశారని విమర్శించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబోతున్నామని చంద్రబాబు చెప్పారు.
సామాన్యులు, నిర్మాణదారులకు ఇసుక అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని, ప్రకృతి సంపదను దోచేశారని, ఇసుక సరఫరా లేకపోవడంతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 108 కొత్త ఇసుక రీచ్‌లకు అనుమతి ఇస్తున్నామని, గత ఐదేళ్లలో గాడి తప్పిన పనులను గాడిన పెడుతున్నామన్నారు. అమరావతి-అనంతపురం హైవే అలైన్‌మెంట్‌ను ఆనాడు మార్చేశారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. ‘‘ప్రస్తుతానికి అమరావతి-కడప, గిద్దలూరు-అమరావతి పనులు పూర్తి చేశాక భవిష్యత్తులో ఇంకా ఏమిచేయాలో ఆలోచిస్తాం. ఏపీ అంటే కరువు, తుఫాను అని గతంలో అనేవారు. ఆ భావనలో ఇప్పుడు మార్పువచ్చింది. అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంది’’ అని చంద్రబాబు తెలిపారు.
Updated Date - Oct 25 , 2024 | 03:58 AM