ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఇక సూటిగా.. సుత్తిలేకుండా!

ABN, Publish Date - Dec 15 , 2024 | 03:52 AM

జిల్లా కలెక్టర్ల సదస్సు నమూనాను వచ్చే సమావేశం నాటికి మార్చివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పద్ధతిలో సమయం కొంత వృథా అవుతోందని గుర్తించామని..

  • కలెక్టర్ల సదస్సు నమూనా మార్చేస్తాం

  • ప్రశ్నలు-సమాధానాల పద్ధతిలో నిర్వహణ

  • కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే ఎజెండా: సీఎం

  • జమిలి ఎన్నికలు 2029లోనే: బాబు

  • సుదీర్ఘ సమీక్షలు ఉండవు.. ప్రజెంటేషన్లు తగ్గిస్తాం

  • సమస్యలు, పరిష్కారాలు తెలుసుకుంటాం

  • స్వర్ణాంధ్ర డాక్యుమెంట్‌పై విస్తృతంగా చర్చిస్తాం

అమరావతి/మచిలీపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ల సదస్సు నమూనాను వచ్చే సమావేశం నాటికి మార్చివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పద్ధతిలో సమయం కొంత వృథా అవుతోందని గుర్తించామని, సుదీర్ఘ సమీక్షలు కాకుండా ప్రశ్నలు-సమాధానాల పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ‘చర్చించాల్సిన అంశాలు, వాటి ఎజెండాను ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు పంపిస్తాం. ఏవైనా అంశాలు ఉంటే సమాచారంతో రావాలని కోరుతాం. ప్రజెంటేషన్లు తగ్గించి ప్రశ్నలు-సమాధానాలతో సమావేశం నిర్వహిస్తాం. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. సమస్యలు ఏమిటో, వాటికి పరిష్కారం ఏమిటో కూడా తెలిసిపోతుంది. మంత్రులు, అధికారుల మధ్య చర్చ పెరుగుతుంది’ అని అన్నారు. అసెంబ్లీలు, పార్లమెంటుకు కలిపి దేశమంతా జమిలి ఎన్నికలు ఒకేసారి జరిపినా అవి 2029లోనే వస్తాయని వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు పెడితే 2029 కంటే ముందే వస్తాయని కొందరు వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించినపుడు.. ఆ పార్టీ నేతలకు అవగాహన లేక ఏవేవో మాట్లాడుతున్నారని, వారి మాటలకు ప్రజల్లో విశ్వసనీయత పోయిందని అన్నారు. ఎన్నికలు ముందుగా వస్తాయంటే వారి పార్టీ నేతలు ఇళ్లలో నుంచి బయటకు వస్తారని ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకొంటున్నారని వ్యాఖ్యానించారు. ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానానికి తమ పార్టీ మద్దతు ఇస్తోందని, ఈ విషయం గతంలోనే ప్రకటించామని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై ధర్నాలంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తే పట్టించుకొన్న నాఽథుడు లేడని, తాము పని చేస్తుంటే వాళ్లు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.


  • ప్రజల్లోకి ‘స్వర్ణాంధ్ర’ విజన్‌

‘స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో ప్రతి చోటా దీనిపై చర్చిస్తాం. గతంలో విజన్‌-2020 ప్రణాళిక రూపొందించి అమలు చేశాం. అది ఎలా సాకారమైందో నేటి తరం తెలుసుకోవాలి. 1996 నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న విజన్‌ ప్రణాళిక వల్ల 2047 నాటికి మనం అనుకొన్న అభివృద్ధి రావడం ఖాయం. విజన్‌-2047 డాక్యుమెంట్‌ ఒక రోజు కార్యక్రమం పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్‌ తరాల బాగు కోసం ఇందులో అనుకొన్న లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని మేం పట్టుదలగా ఉన్నాం. ఇందులో అందరి భాగస్వామ్యం కావాలి. రాష్ట్రంలో పదిహేను శాతం ప్రజలు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు. పది శాతం ఉన్నత స్థాయిలో ఉన్నారు. పైనున్న వారు కింద ఉన్నవారికి తోడ్పాటు ఇచ్చి పైకి రావడానికి సహకరిస్తే కొంత కాలానికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పోతుంది. ఇటువంటి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని మేం అనుకొంటున్నాం. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్‌ ప్రణాళిక రూపొందించాం’ అని చంద్రబాబు వివరించారు. ఈ నెలలో నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తున్నామని, ఆ తర్వాత సహకార సంఘాలకు పాలక మండళ్లను నామినేట్‌ చేస్తామని తెలిపారు. వీటి వల్ల కింది స్థాయిలో అనేకమంది పార్టీ నేతలకు అవకాశాలు లభిస్తాయన్నారు.


  • పేదరికం లేని సమాజం కోసం

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై దృష్టి సారించవచ్చునని చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని శ్రీభూసమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్నికలు వస్తుండటంతో రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల కోసమే పనిచేస్తున్నారని, ప్రజల కోసం పనిచేయడంలేదని అన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థను రూపొందించడం, సంపదను అందరికీ అందుబాటులో ఉంచడం చాలా అవసరమని అన్నారు. విజన్‌-2047 లక్ష్యం ఒక్కటేనని... ప్రపంచంలోనే భారతదేశం నంబర్‌వన్‌గా నిలబడాలని, దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు కీలక స్థానాల్లో పనిచేసేలా ప్రణాళికను రూపొందించామని అన్నారు.

  • గుడ్లవల్లేరును దత్తత తీసుకున్న ‘మేఘా’

గుడ్లవల్లేరు మండలాన్ని మేఘా కృష్ణారెడ్డి, ఆయన భార్య సుధారెడ్డి దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా విధివిధానాలు మేఘా కృష్ణారెడ్డికి అందజేస్తామన్నారు. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. కృష్ణారెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. 2014లో డోకిపర్రు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభించేందుకు వెంకయ్యనాయుడుతో కలిసి ఇక్కడకు వచ్చానని, అప్పటికీ, ఇప్పటికీ ఆలయంతో పాటు ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు.


  • పనితీరు ఆధారంగానే పదవులు

పనితీరు ఆధారంగానే పార్టీ నేతలకు పదవులు వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొద్దిసేపు పార్టీ నేతలతో మాట్లాడారు. ‘ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, ఎన్నికల సమయంలో పార్టీ నేతలు ఎవరెవరు ఏ స్థాయిలో ఏ మేరకు పనిచేశారు, పార్టీకి ఎలా ఉపయోగపడ్డారనే దానిపై కచ్చితమైన సమాచారం ముందు పెట్టుకొని వెళ్తున్నాం. పార్టీకి అవసరమైనప్పుడు ఉపయోగపడకుండా, ప్రజల్లో పనిచేయకుండా 30-40 ఏళ్ల నుంచి ఉన్నామంటూ పదవులు కోరడం సరికాదు. పార్టీలో లక్షల మంది ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని సమీకరణాలు చూసుకోవాలి. ఊరికే పార్టీలో ఉన్నామంటే పదవులు రావు. కష్టపడకుండా ఏదీ రాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి’ అని అన్నారు. కొందరు నాయకులు తాము ఎమ్మెల్యేలు అయిపోయామనో, పదవులు వచ్చేశాయనో పార్టీ పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తాను గమనిస్తున్నానని, పార్టీ వల్లే తమకు ఏ పదవైనా వచ్చిందని వారు గ్రహించాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే, అదే సమయంలో పార్టీ బలోపేతం కోసం కూడా పనిచేయాలన్నారు. తాను ప్రభుత్వ పనుల్లో ఎంత ఒత్తిడితో ఉన్నా కొంత సమయం పార్టీకి కేటాయించి పనిచేస్తున్నానని పార్టీ నేతలకు చెప్పారు.

  • ఆడ్వాణీ త్వరగా కోలుకోవాలి

ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్‌ నేత ఆడ్వాణీ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయనతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆయన సహకారం మరువలేనిదని కొనియాడారు.

Updated Date - Dec 15 , 2024 | 03:52 AM