CM Chandrababu : పర్యాటకాంధ్ర!
ABN, Publish Date - Nov 10 , 2024 | 04:22 AM
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని, వాటన్నింటిని కలిపితే ఆంధ్రప్రదేశ్..
రాష్ట్రంలో ఎన్నో దర్శనీయ ప్రదేశాలు
వాటన్నిటినీ కలిపితే ప్రపంచాన్నే ఆకర్షించవచ్చు
తిరుమలలా శ్రీశైలం అభివృద్ధి.. పర్యాటక కేంద్రంగా ‘గండికోట’
టూరిజంతోనే అత్యధిక వృద్ధి.. వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి
విజయవాడలో సీ ప్లేన్ డెమో లాంచ్‌లో చంద్రబాబు వెల్లడి
అక్కడి నుంచి సీ ప్లేన్‌లోనే శ్రీశైలానికి.. తిరిగి విజయవాడకు
నంద్యాల/విజయవాడ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని, వాటన్నింటిని కలిపితే ఆంధ్రప్రదేశ్.. దేశానికే కాకుండా ప్రపంచానికే పర్యాటక ఆకర్షక ప్రాంతంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం క్షేత్రంతో పాటు పర్యాటక అభివృద్ధికి తిరుమల తిరుపతి తరహాలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని వెల్లడించారు. శనివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సర్వీసు డెమోను ప్రారంభించిన ఆయన.. సీ ప్లేన్‌లోనే శ్రీశైలానికి చేరుకున్నారు. ఆయన వెంట పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా ఉన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో సీ ప్లేన్‌లో దిగిన సీఎంకు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా విజయవాడ కనకదుర్గమ్మవారి స్థానం నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ, శక్తిపీఠం శ్రీశైలానికి సీ ప్లేన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ‘ఇప్పటి వరకు హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణించాను. ఇవి దిగే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సీ ప్లేన్‌తో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇందులో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతినిచ్చింది. తుమ్మలబయలులో టైగర్ సఫారీకి అవకాశం ఉంది. ఇక శ్రీశైలం డ్యాం ఒక అద్భుతం. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలాగే శ్రీశైలం కూడా పచ్చని ప్రకృతితో నిండి ఉంటుంది. ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అటవీ, పర్యావరణ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, రోడ్లు-భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిలతో కమిటీ వేసి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో పాటు సంబంధిత అఽధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ తయారుచేస్తాం. రిపోర్టు ఆధారంగా పనులు చేపడతాం’ అని వెల్లడించారు. పర్యాటక వనరులను సద్వినియోగం చేసుకోగలిగితే వైట్‌కాలర్ జాబ్స్ వస్తాయన్నారు. శ్రీశైలం నుంచి తిరిగి సీ ప్లేన్‌లో విజయవాడకు చేరుకున్న ఆయన.. మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. సుందరమైన ప్రాంతాలను వీక్షించామని, ఎంతో అనుభూతి పొందానని భావోద్వేగంతో చెప్పారు. ల్యాండింగ్, టేకాఫ్ చాలా స్మూత్‌గా జరిగిందని చెప్పారు. ఆయా సందర్భాల్లో ఇంకా ఏమన్నారంటే..
గండికోటలోనూ సీప్లేన్
‘‘శ్రీశైలంలో మాదిరిగానే కడప జిల్లా గండికోటలోనూ సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. వాస్తవానికి శ్రీశైలంలో ప్రారంభించిన రోజే అక్కడా సీ ప్లేన్‌ను దింపేందుకు యత్నించాం. కానీ కుదరలేదు. గండికోటలో నీటిని నింపి, హోటళ్ల వంటివి నిర్మిస్తే దేశంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తయారవుతుంది. రూ.80 కోట్లతో కేంద్ర పర్యాటక శాఖకు ప్రతిపాదనలు పంపించాం. మార్చి నుంచి కేంద్రం సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోజూవారి సీ ప్లేన్ సర్వీసులు ఎక్కువగా మొదలుపెట్టి, టూరిజాన్ని మరింత ఎక్కువగా ప్రచారం చేస్తాం. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయింది. విధ్వంసం జరిగింది. గతంలో మూడు సార్లు సీఎంగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ ఇబ్బంది అనుభవిస్తున్నాను. జగన్ హయాంలో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారు. నిధులను పక్కదారి పట్టించారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి నాశనం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలి’ అనే నినాదంతో ముందుకొచ్చాం. ప్రజలు నమ్మి మా కూటమిని గెలిపించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావిస్తూ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో వ్యవస్థను గాడిలోపెట్టాం’’ అని చంద్రబాబు చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో నూతన అధ్యాయం మళ్లీ ప్రారంభమైందన్నారు. సీ ప్లేన్లకు మంచి అవకాశం ఉందన్నారు. అందుకే ఇక్కడే డెమో మొదలుపెట్టామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నిత్యపున్నమిగా వెలుగుతోందని చెప్పారు.
మల్లన్న సన్నిధిలో ముఖ్యమంత్రి
శ్రీశైలం, నవంబరు 9: శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను చంద్రబాబు దర్శించుకున్నారు. ఆయనకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనరు ఎస్. సత్యనారాయణ సాదరంగా స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామివారికి చంద్రబాబు అభిషేకం చేశాక.. భ్రమరాంబికాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక అర్చన నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రిని అధికారులు స్వామివారి శేష వష్ట్రంతో సత్కరించారు. అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
10 ప్రాంతాలకు సీప్లేన్ సర్వీసులు!
విజయవాడ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీప్లేన్‌లను నడపటానికి అనువైన పది ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. విజయవాడ, శ్రీశైలంతో పాటు గండికోట, లంబసింగి, అరకు వ్యాలీ, రుషికొండ, ధవళేశ్వరం, కోనసీమ, కాకినాడ , తిరుపతికి సీప్లేన్లు నడపటానికి అత్యంత అనువైన ప్రాంతాలుగా నిర్ధారించింది. విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో త్వరలోనే ప్రకటన వెలువడనుంది. ఈ సర్వీసులను విజయవంతం చేసే అంశాలపై కూడా విజయవాడలో నిర్వహించిన సభలో చర్చించారు. ప్రధానంగా సీప్లేన్‌లకు భారీ పెట్టుబడి లేకుండానే విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టుల్లా.. పరిపాలనా భవనాలు, రన్‌వేలు, టెర్మినల్స్ తదితరాలు సీప్లేన్స్‌కు అవసరం లేదు. అయితే వీటిలో ప్రయాణించాలంటే సాధారణ విమానాల కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సాధారణ విమానాల చార్జీకి తీసుకురాగలిగితే వీటికి డిమాండ్ తీసుకురావచ్చని భావిస్తున్నారు. కాగా, ఏపీ, తెలంగాణ మధ్య సీప్లేన్‌లు నడపటానికి స్పైస్‌జెట్ ఆసక్తిగా ఉంది. వచ్చే మార్చిలో రెండు సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ సీఎండీ అజయ్‌సింగ్ చెప్పారు.
తిరుపతి, శ్రీశైలం, గండికోట, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, కోనసీమ, అరకు లోయలో బొర్రా గుహలు, కటిక వాటర్ ఫాల్స్, ట్రైబల్ మ్యూజియం, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటినీ కలపగలిగితే మన రాష్ట్రం ప్రపంచానికే టూరిజం స్పాట్‌లా మారుతుంది.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
Updated Date - Nov 10 , 2024 | 04:23 AM