CM Chandrababu: ప్రత్యేక సాయంతో ఆదుకోండి
ABN, Publish Date - Dec 26 , 2024 | 04:26 AM
స్వర్ణాంధ్ర విజన్-2047ను సాకారం చేసేందుకు అన్ని విధాలా సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
ప్రధానితో భేటీ ఫలవంతం
ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేశాను. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాల నిధులు దారిమళ్లించడాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను. వీటిని మళ్లీ ప్రారంభించడానికి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాను. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను, కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశాను. రాష్ట్ర పర్యటనకు రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాను.
-‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు ట్వీట్
స్వర్ణాంధ్రకు చేయూతనివ్వండి
మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ విజన్ డాక్యుమెంట్ ప్రధానికి అందజేత
ఐదేళ్ల రెవెన్యూ లోటు గ్రాంటును
జగన్ సర్కారు మూడేళ్లలోనే వాడేసింది
94 కేంద్ర పథకాల నిధులు దారి మళ్లించారు
మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ముడి ఖనిజం ఇవ్వండి
సీఎం విన్నపాలు.. పోలవరం, అమరావతికి
నిధులిచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు
వచ్చే నెలలో మోదీ రాష్ట్ర పర్యటనపై చర్చ
అమిత్‌షా, నిర్మల, నడ్డా, కుమారస్వామి, అశ్వినీ వైష్ణవ్‌తో వేర్వేరుగా భేటీ
న్యూఢిల్లీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర విజన్-2047ను సాకారం చేసేందుకు అన్ని విధాలా సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు. ఐదేళ్లలో రావలసిన రెవెన్యూ లోటు గ్రాంటును మూడేళ్లలోనే వాడేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా... తమ వంతుగా రాష్ట్రప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను, వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను, ఆలోచనలను ప్రధానికివివరించారు. వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాలు ఇది సాగింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇటీవల విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రధానికి అందజేశారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పనులు వేగంగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీకి కీలకమైన రెండు ప్రాజెక్టులను గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిన విషయాన్ని.. దానివల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 74 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించిన సీఎం.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. దీంతో పాటు ఈ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖలకు సంబంధించి అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని. అందుకు సహకరించాలని అభ్యర్థించారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వాటిని గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర నిధుల విడుదలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పట్టుకుని ప్రత్యేక సాయం చేయాలని కోరారు.
పలువురు మంత్రులతో సమావేశం..
ప్రధానితో భేటీకి ముందు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో తన అధికారిక నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ రైల్వే జోన్ పనుల శంకుస్థాపన, రాష్ట్రంలో చేపట్టిన, చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే అంశంపై చర్చించారు. అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఉదయం మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన చంద్రబాబు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీయే పక్షాల భేటీలో పాల్గొన్నారు. సమావేశనంతరం అమిత్‌షా, నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడే కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, తదుపరి కార్యచరణపై చర్చించారు. సీఎం పర్యటనలో ఆయన వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీభరత్ ఉన్నారు.
కీలక ప్రాజెక్టులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ అభివృద్థికి కేంద్రం అందించాల్సిన అత్యవసర సహకారం, రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై ప్రధానితో సీఎం చర్చించినట్లు పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రైల్వేజోన్ స్థాపన, వాల్తేర్ రైల్వే డివిజన్ పురోగతి, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీ, అభివృద్థిని పెంచే లక్ష్యంతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వంటి కార్యక్రమాలపై రైల్వే మంత్రితో చర్చించారని తెలిపారు.
నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు
చంద్రబాబు గురువారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తారు. అక్కడ కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం అమరావతికి తిరిగివస్తారు.
వాజపేయికి సీఎం ఘననివాళి
న్యూఢిల్లీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): భారతజాతి గర్వించదగిన నేత వాజపేయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. వాజపేయి శత జయంతి సందర్భంగా బుధవారం ఉదయం వాజపేయి సమాధి ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే వాజపేయితో కలిసి పనిచేసిన అనుభూతి తనకు చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. దేశం గురించి వాజ్‌పేయి ఆలోచించే తీరు విలక్షణమైనదని, దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని తాను సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరును ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు. వాజపేయితో తాను దిగిన ఫొటోను చంద్రబాబు పంచుకున్నారు.
Updated Date - Dec 26 , 2024 | 04:26 AM