CM Chandrababu : అమరావతి 2.0 పనులు పరుగు
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:05 AM
రాజధాని పనుల్లో కూటమి ప్రభుత్వం మరింత వేగం పెంచింది. అమరావతిలో రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కీలకమైన ఆర్థిక కేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అమరావతి విధ్వంసానికి గురైంది.
అభివృద్ధి పనులకు 11 వేల కోట్లు
కీలక ప్రాజెక్టులకు ఆర్థిక కేటాయింపులు
ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం
ట్రంక్ ఇన్‌ఫ్రా, వరదనీటి యాజమాన్యం,
గ్రీనరీ పనుల కోసం ‘పీఎంసీ’ ఏర్పాటు
నెలాఖరు నాటికి టెండర్లు : నారాయణ
విజయవాడ, అమరావతి, డి సెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజధాని పనుల్లో కూటమి ప్రభుత్వం మరింత వేగం పెంచింది. అమరావతిలో రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కీలకమైన ఆర్థిక కేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లూ అమరావతి విధ్వంసానికి గురైంది. దానిని తిరిగి ట్రాక్ మీదకు తెచ్చేందుకు ఆరు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో 41 వ అథారిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వివరాలను మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. కొంతమేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ప్రపంచబ్యాంకు, ఏడీబీ నిధులతో మిగిలిన పనులు చేపట్టేలా ఈ సమావేశంలో ఆర్థిక కేటాయింపులు జరిపారు. ఆర్థిక కేటాయింపులు ఇలా... రాజధానిలో గత ఐదేళ్లూ నిలిచిపోయిన గజిటెడ్ ఆఫీసర్స్ టైప్ - 1, టైప్ - 2, క్లాస్ - 4 ఉద్యోగుల అపార్ట్‌మెంట్స్ నిర్మాణ పనులను పూర్తి చేయటానికి రూ. 594.54 కోట్లను ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏ అథారిటీ సమ్మతి తెలిపింది. అక్కడ తాగునీటి సదుపాయం, రోడ్లు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, బిల్డింగ్ సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులను రూ.226.26 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించింది.
నాన్ గజిటెడ్ ఆఫీసర్ల భవనాలకు సంబంధించిన బ్యాలెన్స్ పనులను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు రూ. 607.50 కోట్లతో చేపట్టడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి ఎన్‌జీఓ ఆఫీసర్ల భవనాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 594.36 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదించింది. అఖిల భారత సర్వీసు అఽధికారులు, ముఖ్య కార్యదర్శులకు సంబంధించిన 111 బంగళాల పెండింగ్ పనులలను రూ. 516.6 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా పనులను రూ. 3859.66 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు సీర్‌డీఏ అథారిటి ఆమోదించింది.
హ్యాపీనెస్ట్ నష్టాలు భరించనున్న సర్కారు..
అమరావతిలో ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.984.10 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల జరిగిన ఆలస్యం కారణంగా లబ్ధిదారులు నష్టపోయిన వడ్డీ, ప్రాజెక్టు ఆలస్యం వల్ల జరిగిన నష్టం మొత్తం రూ.270.71 కోట్లను ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 1,200 ఫ్లాట్లతో కూడిన పన్నెండు జీప్లస్ 18 టవర్లను చేపట్టనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్షింగ్ ప్రాజెక్టుగా సీఆర్డీఏ ఈ టౌన్‌షిప్ ప్రాజెక్టును చేపట్టింది. అప్పట్లో 2018 - 19 అంచనాల ప్రకారం రూ. 720.5 కోట్లకు ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. పనులు చేపట్టకపోవటం వల్ల ప్రస్తుతం సవరించిన అంచనాల కారణంగా రూ. 984.10 కోట్ల వ్యయంతో చేపట్టాల్సి వస్తోంది. కాగా, ప్రపంచబ్యాంకు , ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ల నిధుల నుంచి అమరావతిలో వరద నివారణ పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్యాకేజీ -1 పనులను రూ. 580.74 కోట్లు, ప్యాకేజీ - 2 రూ.386.95 కోట్లు, ప్యాకేజీ రూ. 608.26 కోట్లను కలిపి మొత్తంగా రూ. 1585.95 కోట్ల వ్యయంతో ఖర్చు చేసేందుకు అథారిటీ ఆమోదించింది. వీటన్నింటి కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను (పీఎంసీ) ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
మూడేళ్లలో అమరావతి
నిర్మాణ పనులు పూర్తి : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ‘‘గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో పలు కమిటీలు వేసి.. వాటి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నాం. సీడ్ కేపిటల్‌లో నిర్మించే 360 కిలోమీటర్ల ట్రంక్‌రోడ్డులో రూ.2 ,498 కోట్లతో కొన్ని పనులు ప్రారంభించడానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఈ నెల 15 నాటికి డిజైన్ల టెండర్లు పూర్తవుతాయి. నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణాలకు కూడా టెండర్లు పిలుస్తాం’’ అని మంత్రి తెలిపారు.
భవన నిర్మాణ పనులు 1,931.76 కోట్లు
ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రా పనులు 3,859.66 కోట్లు
రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులు 2,498.3 కోట్లు
వరద నివారణ పనులు 1,585.95 కోట్లు
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు 984.10 కోట్లు
Updated Date - Dec 03 , 2024 | 04:05 AM