Share News

CM Chandrababu : సోషల్‌ సైకోలకు చెక్‌

ABN , Publish Date - Nov 07 , 2024 | 05:40 AM

మెతక ప్రభుత్వం అనే అపవాదు చెరిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది..

CM Chandrababu : సోషల్‌ సైకోలకు చెక్‌

పైశాచిక పోస్టులపై గట్టిగానే కొరడా

నిర్లక్ష్య ఖాకీల దుమ్ము దులుపుడే

కడప ఎస్పీ హర్షవర్ధన్‌పై తొలి వేటు

దూకుడు పెంచిన కూటమి సర్కారు

అరాచక పోస్టులు పెట్టిన వర్రాకు కడప పోలీసుల వత్తాసు

నోటీసులు ఇచ్చి వదిలేసిన వైనం

ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌

అప్పటికప్పుడే కడప ఎస్పీ బదిలీ

వర్రాను తప్పించిన వ్యవహారంలో చిన్నచౌక్‌ సీఐ తేజమూర్తి సస్పెన్షన్‌

అమరావతి, కడప, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మెతక ప్రభుత్వం అనే అపవాదు చెరిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.. సోషల్‌ మీడియాలో పైశాచిక పోస్టులు పెడుతున్న సైకోలకు చుక్కలు చూపించడం మొదలైంది. జిల్లాల్లో అక్కడక్కడ జరుగుతున్న అరాచకాలను ఉపేక్షిస్తున్న పోలీసులపై కొరడా ఝళిపించింది. అదే సమయంలో సైకోల్లా రెచ్చిపోయేవారికి ఖాకీ మార్కు కౌన్సెలింగ్‌ తప్పదని స్పష్టం చేస్తోంది.. అత్యంత దారుణమైన వ్యాఖ్యానాలతో సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టే వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిపైనే నీచమైన పోస్టులు పెట్టిన పులివెందుల వ్యక్తి, వైఎస్‌ భారతి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డిని సింపుల్‌గా వదిలేశారన్న కారణంగా ఏకంగా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసు ఇచ్చి వదిలేసిన చిన్నచౌక్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్‌ చేసి, గట్టి సంకేతాలు పంపింది. తనతోపాటు జీవిత భాగస్వామిని, కుమార్తెలను, ఆఖరికి కన్నతల్లిని కూడా అనడంతో తట్టుకోలేని పవన్‌ కల్యాణ్‌, రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఉలిక్కిపడ్డ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించి పోలీసింగ్‌లో వేగాన్ని పెంచే ప్రయ త్నం చేశారు. ఏకంగా ఎస్పీనే బదిలీపై పంపించారు.

fg.jpg


అసలేం జరిగింది?

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల మండలం కొండ్రెడ్డిగారిపల్లెకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి ఓ జులాయి. 2011లో జగన్‌ వైసీపీని స్థాపించిన తరువాత పులివెందులలో కీలకంగా ఎదిగాడు. ఎంపీ అవినాశ్‌ అనుచరుడిగా ఉంటూ జగన్‌ భార్య భారతికి పీఏగా ఉండేవాడు. వేముల పోలీసుస్టేషన్‌లో ఆయనపై రౌడీషీట్‌ ఓపెన్‌ అయింది. జగన్‌ సీఎం అయిన తరువాత రవీంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు లేకుండాపోయింది. సోషల్‌మీడియా వేదికగా రెచ్చిపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కుటుంబసభ్యులు, హోంమంత్రి అనితతో పాటు జగన్‌ సోదరి షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి, మరో చెల్లి సునీతపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టేవాడు. అతనిపై కడప, మంగళగిరి, హైదరాబాద్‌, రాజంపేట, ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వర్రాపై గతంలోనే వైఎస్‌ సునీత హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక మరింత రెచ్చిపోయాడు. ఆడవారే లక్ష్యంగా ఘోరంగా పోస్టులు పెట్టేవాడు. వర్రాపై ఇటీవల ఐపీసీ 509, 505, 66ఇ, 67ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ నమోదైంది. అరాచక పోస్టులపై రెండు రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం దరిమిలా పోలీసు యంత్రాంగం కదిలింది. కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు కడప చిన్నచౌక్‌ సీఐ తేజమూర్తి ఆధ్వర్యంలో వర్రాను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని కడప పోలీసుస్టేషన్‌ తీసుకువచ్చారు. అయితే, ఆ వెంటనే 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. అదుపులోకి తీసుకున్న సమయంలో వర్రా వెంట కడపకు చెందిన ఓ వైసీపీ అనుకూల అడ్వకేట్‌ మహేశ్వర్‌రెడ్డి వచ్చారు. వర్రాపై అన్నమయ్య జిల్లాలోని రాజంపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడంతో.. ఆ జిల్లా పోలీసులు కడపకు చేరుకున్నారు. ఇక్కడ నోటీసులు ఇచ్చిన తరువాత రాజంపేట పోలీసులకు అప్పజెప్పాల్సి ఉంది. అయితే.. 41ఏ నోటీసులు ఇచ్చి వర్రాను తేజమూర్తి వదిలేశారు. దీనివెనుక పెద్ద గూడుపుఠాణినే ఉందంటారు. 41ఏ నోటీసు ఇచ్చి పంపిస్తామని వైసీపీ ముఖ్యనేత సోదరుడికి ముందే పోలీసులు హామీ ఇచ్చారని, ఆ మేరకు తప్పించారని ప్రచారం ఉంది.


కడప ఎస్పీపై బదిలీ వేటు

రాష్ట్రంలో కొందరు పోలీసులు సోషల్‌ సైకోలపై చట్టపరమైన చర్యలు తీసుకొంటుంటే, అందుకు భిన్నంగా వ్యవహరించిన కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌పై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. వర్రా రవీందర్‌ రెడ్డిని మంగళవారం పులివెందులలో అదుపులోకి తీసుకున్న చిన్నచౌక్‌ (కడప టౌన్‌) పోలీసులు నిందితుడిని వదిలిపెట్టారు. సీఎం చంద్రబాబు ఈ విషయం తెలిసిన వెంటనే కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ను హుటాహుటిన కడపకు పంపారు. పోలీసుల నిర్లిప్తత ఉందని తేలడంతో వెంటనే ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ వీవీ సాగర్‌ నాయుడుకు కడప జిల్లా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు చిన్న చౌక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను డీఐజీ కోయ ప్రవీణ్‌ సస్పెండ్‌ చేశారు.

ఇంత బరితెగింపా!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన సైకో సోషల్‌ మూక రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదేపంథా కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఐటీ మంత్రి లోకేశ్‌పై పత్రికల్లో రాయలేని దారుణమైన భాషలో దూషిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ తన చెల్లెల్ని ఎత్తుకున్న ఫోటో పెట్టి చేసిన కామెంట్‌ చదివితే ఎవరికైనా రక్తం మరుగుతుంది. లోకేశ్‌ పుట్టుక నుంచి బాడీ షేమింగ్‌ వరకూ దేన్నీ వదలట్లేదు. హోంమంత్రిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వర్రా రవీందర్‌ రెడ్డి గతంలో జగన్‌ సోదరి షర్మిలపైనా అత్యంత హేయమైన కామెంట్లు పోస్టు చేశాడు. వివేకా కుమార్తె సునీతను కూడా వదల్లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌ అయిందంటూ పులివెందులలో పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాలాడాడు. వీరి వికృత చేష్టలను జగన్‌ రోత పత్రిక భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ సమర్ధించడం హేయమైన చర్యగా కొందరు పోలీసులు అభివర్ణిస్తున్నారు.

Updated Date - Nov 07 , 2024 | 05:42 AM