ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : ఇదేమి ‘కాల మహిమ’!

ABN, Publish Date - Jun 29 , 2024 | 03:50 AM

ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే సూపర్‌ సోనిక్‌ విమానాలున్నాయి!కానీ... కాలంకంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేసే కలెక్టర్లు ఉన్నారంటే నమ్ముతారా? న

  • రేపు తనిఖీ చేసి.. ఈరోజే నివేదిక

  • ఐఏఎస్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఘనత

  • ఎన్జీటీ కళ్లకు ‘ఇసుక’ గంతలు

  • సంయుక్త కమిటీ నివేదికను మార్చి

  • ‘అంతా ఓకే’ అంటూ సొంత రిపోర్టు

  • ఫిబ్రవరి 14న తనిఖీ చేసినట్లు

  • 13వ తేదీనే నివేదిక ఇచ్చిన ఐఏఎస్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే సూపర్‌ సోనిక్‌ విమానాలున్నాయి!కానీ... కాలంకంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేసే కలెక్టర్లు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే! జగన్‌ జమానాలో ఏదైనా సాధ్యమే! గుంటూరు జిల్లా కలెక్టర్‌ హోదాలో, జగన్‌కు వీరభక్తుడిగా పని చేసిన వేణుగోపాల్‌ రెడ్డి ఈ ఘనత సాధించారు. రేపటి రోజు ‘చేసిన’ తనిఖీ నివేదికను ఈ రోజే ఇచ్చేశారు. ఈ ‘కాల మహిమ’ తాజాగా బయటపడింది.

గోపాల... గోపాల...

ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగడం లేదని చెప్పండి... అంటూ నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అప్పట్లో కలెక్టర్లకు ‘ప్రొఫార్మా’ పంపిన సంగతి తెలిసిందే. ఇదే ఒక చిత్రమైతే.. నాడు గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌ రెడ్డి ‘అతని కంటే ఘనుడు’ అన్నట్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న తనిఖీలు చేసినట్లుగా చెబుతూ... 13వ తేదీనే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదిక సమర్పించారు. ఇది ‘క్లరికల్‌ మిస్టేక్‌’ కాదు! నిండా నిర్లక్ష్యం! ఉత్తుత్తి తనిఖీలు చేసి, ఉత్తుత్తి రిపోర్టులు ఇచ్చే క్రమంలో ‘దొర్లిన’ దారుణం! ఇసుక అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్జీటీ బృందం అంతకుముందు తనిఖీ చేసి నిర్ధారించగా... ‘అబ్బే, అదేం లేదు!’ అని వేణుగోపాల్‌ రెడ్డి నివేదిక ఇచ్చేశారు.

అడ్డంగా దొరికిపోయేలా...

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరుకు చెందిన దండా నాగేంద్ర ఎన్జీటీలో కేసు వేశారు. కానీ... అసలు అక్రమాలే జరగడంలేదంటూ గనుల శాఖ అఫిడవిట్‌ వేసింది. నాగేంద్ర పలు ఆధారాలను సమర్పించడంతో... కలెక్టర్‌ల నేతృత్వంలో సంయుక్త విచారణ కమిటీలు ఏర్పాటుచేసి నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఆదేశించింది. 14న తదుపరి విచారణ ఉంటుందని, అప్పటిలోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే... నాటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి ఓ సంయుక్త విచారణ కమిటీ (జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ)ని ఏర్పాటు చే శారు.


ఎన్జీటీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 12వ తేదీన తాడేపల్లి మండలం గుండిమెడ, కొల్లిపర మండలం మున్నంగి రీచ్‌లను తనిఖీ చేసినట్లుగా సంయుక్త కమిటీ నివేదిక ఇచ్చింది. అధికారులు గుండిమెడ రీచ్‌కు వెళ్లినప్పుడు అక్కడభారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. లారీలూ అక్కడే ఉన్నాయి. జీసీకేసీ సంస్థ ఈ రీచ్‌ పరిధిలో 9 వేల టన్నుల ఇసుకను నిల్వచేసింది. ఈ రీచ్‌కు పర్యావరణ అనుమతులు ఉన్నా, కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చే సీటీఈ (కన్సెంట్‌ ఆఫ్‌ ఎష్టాబ్లి్‌షమెంట్‌), సీటీఓ(క న్సెంట్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌) అనుమతులు లేవు. దీంతో అక్రమ తవ్వకాలు చేస్తున్న యంత్రాలను అక్కడికక్కడే సీజ్‌ చేశారు. మున్నంగి రీచ్‌దీ అదే పరిస్థితి. పర్యావరణ అనుమతులున్నా... సీటీఈ, సీటీవో అనుమతులు లేవు. అయినా... అక్రమంగా అప్రోచ్‌ రోడ్డు వేశారు. అధికారులు అక్కడికెళ్లే సమయానికి ఇసుక తవ్వకాలు జరగడంలేదు. తనిఖీల సంగతి తెలిసింది కాబోలు... నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. సంయుక్త కమిటీలోని అధికారులు ఇవే విషయాలను కలెక్టర్‌కు నివేదించారు.

కలెక్టర్‌ కిరికిరి..

సంయుక్త కమిటీ నివేదికకు వేణుగోపాల్‌ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేశారు. గుండిమెడ రీచ్‌ గురించి కాకుండా... మున్నంగి గురించే తన నివేదికలో ప్రస్తావించారు. ‘‘నేను మున్నంగి రీచ్‌ను సందర్శించాను. ఆ సమయంలో ఇసుక తవ్వకాలు జరగడం లేదు. గతంలో ఇసుక తవ్వకాలు జరిగిన ఆనవాళ్లే లేవు’’ అని సర్టిఫికెట్‌ ఇచ్చారు. అప్రోచ్‌రోడ్డు గురించి, పీసీబీ అనుమతులు లేని విషయాన్ని ప్రస్తావించలేదు. గుండిమెడ రీచ్‌ గురించి ఎన్జీటీకి అస్సలు చెప్పలేదు. తనిఖీ తేదీలతోనూ చిత్రాలు చేశారు. ఫిబ్రవరి 12న రెండు ఇసుక రీచ్‌లను తనిఖీ చేశామని సంయుక్త కమిటీ రిపోర్టులో ఉంది. కానీ... తాము ఫిబ్రవరి 14న రీచ్‌ను తనిఖీ చేసినట్లు ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో కలెక్టర్‌ పేర్కొన్నారు. చిత్రమేమిటంటే... ఆ నివేదికను ఫిబ్రవరి 13నే ఇచ్చేశారు. అంటే... చేయబోయే తనిఖీలో ‘గుర్తించబోయే విషయాలను’ ముందే నివేదికలో రాసేశారా?

కోర్టును మోసం చేయడం కాదా?

ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సంయుక్త విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. దానిపై సభ్యులందరి సంతకాలున్నాయి. అదే నివేదికను కలెక్టర్‌కు, గనుల శాఖ డైరెక్టర్‌కు, గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదికి కూడా పంపించారు. కానీ... వేణుగోపాల్‌ రెడ్డి మాత్రం ఎన్జీటీకి తప్పుడు నివేదిక ఇచ్చారు. ‘అంతా బాగుంది’ అని క్లీన్‌ చిట్‌ ఇచ్చేశారు. ఇది ఎన్జీటీని మోసం చేయడం కాదా? కలెక్టర్‌ స్థాయి అధికారికి ఇది తగునా.?

Updated Date - Jun 29 , 2024 | 03:51 AM

Advertising
Advertising