ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘స్టెల్లా’ సీజ్‌కు చిక్కుముడులెన్నో..!

ABN, Publish Date - Dec 01 , 2024 | 03:53 AM

సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్‌ చేయాలంటే ఈ కేసును అడ్మిరాల్టీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోని హైకోర్టు పరిధిలోకి వస్తుంది.

  • కాకినాడలో రేషన్‌ బియ్యం నౌకపై చర్యలకు అధికారులకు అడ్డంకులు

  • కస్టమ్స్‌కు మాత్రమే సీజ్‌ చేసే అధికారం

  • నౌకలో స్మగ్లింగ్‌ వస్తువులు ఉంటేనే కేసుకు అవకాశం

  • స్మగ్లింగ్‌ చట్టం కిందకు రేషన్‌ బియ్యం రావంటున్న పోర్టు అధికారులు

  • నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తాత్కాలికంగా షిప్‌ను ఆపాలని నిర్ణయం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కాకినాడ పోర్టుకు వచ్చిన పశ్చిమాఫ్రికా నౌక స్టెల్లా ఎల్‌ పనామాను సీజ్‌ చేసే విషయంలో అధికారులకు పలు చిక్కుముడులు ఎదురవుతున్నాయి. నౌకలో రేషన్‌ బియ్యం ఉన్నందున దానిని సీజ్‌ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడీ వ్యవహారంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకదేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చిన నౌకను నిబంధనల ప్రకారం సీజ్‌ చేసే అధికారం ఒక్క కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు మాత్రమే ఉంటుంది. అది కూడా ఆ నౌకలో స్మగ్లింగ్‌ వస్తువులు గుర్తిస్తే కేసు నమోదు చేసి కొన్ని రోజులు నిలిపివేస్తారు. అయితే కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు వచ్చిన నౌకలో లోడ్‌ అయిన రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ కిందకు రాదని పోర్టు అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్‌ చట్టం ప్రకారం రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ జాబితాలో లేదంటున్నారు.

  • అడ్మిరాల్టీ కేసుతో ఆపగలరా?

సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్‌ చేయాలంటే ఈ కేసును అడ్మిరాల్టీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోని హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అడ్మిరాల్టీ న్యాయస్థానం నౌకలు, వాటి బిల్లుల చెల్లింపుల్లో వివాదాల కేసులను మాత్రమే పర్యవేక్షిస్తుంది. కానీ రేషన్‌ బియ్యం ఎగుమతి చేస్తుందనే ఫిర్యాదును స్వీకరిస్తుందా? లేదా? ఏ కారణాలు చెబితే కేసు ముందుకు వెళ్తుందనేది అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. పైగా బియ్యం స్మగ్లింగ్‌పై ఇంతవరకు దేశంలో ఏ అడ్మిరాల్టీ న్యాయస్థానంలోను కేసు నమోదవలేదు. అయితే బియ్యం వ్యవహారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పరిధిలోది కాబట్టి ఆ శాఖ మాత్రమే నౌకను సీజ్‌ చేసేందుకు అడ్మిరాల్టీ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది.


దీనికంటే ముందు నౌకను సీజ్‌ చేయాలంటూ కస్టమ్స్‌, పోర్టు అధికారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కేసు స్మగ్లింగ్‌లోకి రాదు కాబట్టి దీనిని కస్టమ్స్‌ తిరస్కరించవచ్చని చెబుతున్నారు.

  • నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఉంటే..

నౌకను తాత్కాలికంగా ఆపగలిగే అవకాశం ఉన్న ‘నో డ్యూ సర్టిఫికెట్‌’ ఇవ్వకుండా చూడాలని కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అధికారులు భావిస్తున్నారు. పోర్టుకు నౌక వచ్చినందుకు తమకు చార్జీలు చెల్లించేశారని, బాకీలు లేవని పేర్కొంటూ పోర్టు అధికారులు సంబంధిత నౌకకు నిబంధనల ప్రకారం నో డ్యూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. దీన్ని షిప్పింగ్‌ ఏజెంట్లు కస్టమ్స్‌ అధికారులకు పంపితే అన్నీ పరిశీలించి నౌక కదలడానికి ఆదేశాలు జారీచేస్తారు. అయితే నౌకకు సంబంధించి షిప్పింగ్‌ ఏజెంట్లు పోర్టుకు చార్జీలు చెల్లించేస్తే నో డ్యూ సర్టిఫికెట్‌ ఆపకుండా ఉండడం సాధ్యం కాదని చెబుతున్నారు. అయినా తాత్కాలికంగా ఈ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఆపాలని అధికారులు నిర్ణయించారు.

  • తుఫానుతో బియ్యం లోడింగ్‌కు విరామం

మరోపక్క స్టెల్లా నౌకలో 52 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతికిగాను 38 వేల మెట్రిక్‌ టన్నులు లోడ్‌ అయింది. ఈలోగా తుఫాను రావడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పోర్టులో బియ్యం ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈలోపు రేషన్‌ బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సముద్రంలో ఈదురు గాలులు, అలల తీవ్రత అధికంగా ఉండడంతో మరికొన్ని రోజులు బియ్యం లోడింగ్‌ జరిగే అవకాశం లేదు. ఆ తర్వాత జరిగినా మిగిలిన భాగం బియ్యం నౌకలో లోడింగ్‌ చేయడానికి వారం పడుతుంది. ఆలోగా ఏంచేయాలనేది పౌరసరఫరాలశాఖ ఆదేశాలను బట్టి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. నౌకలో లోడ్‌ అయిన రేషన్‌బియ్యం బస్తాలన్నీ వెనక్కి తీసుకుని నౌకను పంపించడమా.. లేదంటే రేషన్‌బియ్యం కాని బియ్యం బస్తాలతో లోడింగ్‌ చేయడమా అనేది కూడా తేల్చాల్సి ఉంది.

Updated Date - Dec 01 , 2024 | 03:53 AM