Ram gopal Varma: ఇక నాపై కేసులు నమోదు చేయొద్దు!
ABN, Publish Date - Nov 29 , 2024 | 05:41 AM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టుకు రాంగోపాల్ వర్మ.. విచారణ వాయిదా
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమాయాజి స్పందిస్తూ... ఈ కేసులో అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపిస్తారన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టి.రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ... ఒకే పోస్టుకు సంబంధించి పిటిషనర్‌పై వివిధ పోలీసుస్టేషన్లలో వరుస కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.
పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరుతున్నారన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును ప్రధాన కేసుగా భావించి, తర్వాత నమోదైన కేసులను వాంగ్మూలాలుగా తీసుకోవాలని అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి .. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Updated Date - Nov 29 , 2024 | 05:42 AM