రాయి తగిలితే ప్రాణం పోతుందా?
ABN, Publish Date - Nov 25 , 2024 | 04:46 AM
‘రాయి తగిలినంత మాత్రాన ప్రాణం పోతుందా? హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్ ఎలా చేర్చుతారు..? ఇంతకుముందు నమోదు చేసిన ఐపీసీ 120(బీ) సరైనది కదా?’ అని నందిగామ సీనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి పోలీసులను ప్రశ్నించారు.
‘నందిగామ’ కేసులో పోలీసులకు న్యాయాధికారి ప్రశ్న
రాళ్ల దాడి నిందితులకు సొంత పూచీకత్తుతో బెయిల్
జిల్లా కోర్టులో అప్పీలుకు పోలీసుల నిర్ణయం
విజయవాడ/నందిగామ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘రాయి తగిలినంత మాత్రాన ప్రాణం పోతుందా? హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్ ఎలా చేర్చుతారు..? ఇంతకుముందు నమోదు చేసిన ఐపీసీ 120(బీ) సరైనది కదా?’ అని నందిగామ సీనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి పోలీసులను ప్రశ్నించారు. నందిగామలో 2022 నవంబరు 4న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి వెళ్లిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లతో దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం రాత్రి ఆయన ఎదుట హాజరు పరిచారు. నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, కంచికచర్ల ఏఎంసీ మాజీ చైర్మన్ మార్త శ్రీనివాసరావు పథకం ప్రకారం దాడి చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రబాబు నందిగామ రావడానికి గంట ముందు వైసీపీ కార్యాలయంలో దాడికి వ్యూహరచన జరిగిందని రాశారు. నిందితులు బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ ఒక జెండా స్తంభానికి వెనుక వైపు నిలబడి చీకట్లో రాళ్లతో దాడి చేశారని, చంద్రబాబు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారని, ఈ రాళ్లు తగలరాని చోట తగిలితే ప్రాణం పోయేవని పేర్కొన్నారు. నిందితులకు రిమాండ్ విధించాలని అభ్యర్థించారు.
రిమాండ్ రిపోర్టును చదివిన న్యాయాధికారి.. వారికి పై ప్రశ్నలు సంధించారు. ‘రాయి తగిలితే ప్రాణం పోతుందా..? నిందితులు విసిరిన రాయి చూశారా..? ఘటన జరిగిన తర్వాత పోలీసులు 120(బీ) సెక్షన్ కంద కింద కేసు నమోదు చేయడం సబబే కదా.. కొత్తగా ఇప్పుడు సెక్షన్ 307 ఎలా చేరుస్తారు..’ అని అడిగారు. 2022 నవంబరు 4న ఏం జరిగింది, ఆ తర్వాత పరిణామాలు ఎలా తిరిగాయనే విషయాలను పోలీసులు వివరించడంతో నిందితులను రిమాండ్‌ను పంపేందుకు అంగీకరించారు. అయితే వెంటనే సొంత పూచీకత్తుపై వారికి బెయిల్ మంజూరుచేశారు. 2-3 రోజుల్లో పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై మచిలీపట్నంలోని జిల్లా కోరు ్టలో అప్పీలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. సోమవారమే అప్పీలుకు వెళ్లనున్నారు.
Updated Date - Nov 25 , 2024 | 04:46 AM