AP News: జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు
ABN, Publish Date - May 21 , 2024 | 08:25 PM
ఎన్నికల సంఘం అనుమతితో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జవహర్ రెడ్డి సూచించారు.
అమరావతి: ఎన్నికల సంఘం అనుమతితో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులను చేపట్టాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జవహర్ రెడ్డి సూచించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించాలంటూ కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఈ మేరకు తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు ప్రస్తుతం మంచి అనువైన సీజన్ అని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. పెద్ద ఎత్తున ఉపాధి పనులు నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో లక్షకు పైగా వ్యక్తిగత మరుగు దొడ్లను మంజూరు చేశామని ప్రస్తావించారు. ఉపాధి హామీ, స్వచ్చ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోక్ పిట్లను నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధిహామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.
విద్యుత్ సరఫరా పరిస్థితులపై కూడా సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడతామంటూ సీఎస్ జవహర్ రెడ్డికి వివరణ ఇచ్చారు.
Updated Date - May 21 , 2024 | 08:25 PM