Cyclone Dana: తీరం దాటిన దానా.. పోర్టుల వద్ద హెచ్చరికలు తొలగింపు
ABN, Publish Date - Oct 25 , 2024 | 04:57 PM
దానా తుపాన్ శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో భారీగా వృక్షాలు నేలకూలాయి. ఇక ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.
విశాఖపట్నం, అక్టోబర్ 25: ఆంధ్రప్రదేశ్‌కు దానా తుపాన్ ముప్పు తప్పిందని విశాఖపట్నంలోని వాతావారణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిశా పూరి సమీపంలోని ధమ్రా, హబలి ఖాతి మధ్య తీరాన్ని దాటిందని తెలిపింది. తీవ్ర తుఫాను క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతుందని వివరించింది. అయితే ఉత్తర ఒడిశాలోని భద్రక్ సమీపంలో తుపాన్ ప్రభావం ప్రస్తుతం కొనసాగుతుందని వివరించింది. తుపాన్.. ఉత్తర వాయువ్య దిశగా కదిలి, క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండం మారనుందని పేర్కొంది. అయితే తుపాన్.. తీరం దాటిన సమయంలో సుమారు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది.
Also Read: Madhya Pradesh: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..
ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో చెదురు మదురుగా వర్షపు జల్లులు పడ్డాయని పేర్కొంది. ఇక అన్ని పోర్టులకు జారీ చేసిన హెచ్చరికలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఉత్తర కోస్తాపైన ప్రస్తుతం గాలుల ప్రభావం కొంత వరకు ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వివరించింది.
Also Read: సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
అలాగే ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతంగా ఉంటుందంది. ఉత్తర, దక్షిణ కోస్తాలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల చాలా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురువొచ్చని తెలిపింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పందిస్తూ.. హబాలి ఖాతి నేచర్ క్యాంప్, ధమ్రాకు సమీపంలో తుపాన్ 'దానా' తీరం దాటిందని తెలిపారు. గతరాత్రి 1:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల మధ్య దానా తుపాన్ తీరం దాటిందన్నారు. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మరో 2 నుంచి 3 గంటల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
ఇక ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పుర్, బాలాసోర్, కేంద్రపారాలలో బలంగా గాలులు వీచాయి. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వేలాది చెట్లు నేలకొరిగాయి. తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా పెద్దఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. తుపాన్ ప్రభావిత ప్రాంత ప్రజలను ఆయా పునరావాస కేంద్రాలకు తరలించింది.
For Andhra News And Telugu News..
Updated Date - Oct 25 , 2024 | 04:57 PM