AP Education : టెన్త్ సర్టిఫికెట్లన్నీ ఆన్‌లైన్
ABN, Publish Date - Dec 17 , 2024 | 04:12 AM
పదో తరగతి ధ్రువీకరణ పత్రాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం పదో తరగతి చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి సులభంగా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కలగనుంది.
1969 నుంచి 1990 వరకు డిజిటైజేషన్
అనుమతిచ్చిన పాఠశాల విద్యాశాఖ
ఆ తర్వాత 1991 నుంచి 2003 వరకు
2004 నుంచి సర్టిఫికెట్లు ఇప్పటికే డిజిలాకర్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ధ్రువీకరణ పత్రాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం పదో తరగతి చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి సులభంగా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇప్పటికే 2004 నుంచి ఇప్పటివరకూ టెన్త్ సర్టిఫికెట్లు డిజిటైజేషన్ చేశారు. తాజాగా 1969 నుంచి 1990 వరకు సర్టిఫికెట్లను డిజిటైజేషన్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎ్‌స)కు ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం రూ.1.68 కోట్లు కేటాయించింది. డిజిటైజేషన్ అనంతరం ఆ డేటాను డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేస్తారు. దాని నుంచి పూర్వ విద్యార్థులు వారి వివరాలు సమర్పించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా పొరపాట్లు ఉంటే రెండేళ్లపాటు ఉచితంగా సవరణలు చేసుకోవచ్చు. రెండో దశలో 1991 నుంచి 2003 వరకు సర్టిఫికెట్లను డిజిటైజేషన్ చేస్తారు. కాగా.. గత మూడేళ్ల నుంచి సర్టిఫికెట్లన్నీ డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు పోతే డూప్లికేట్ సర్టిఫికెట్లు పొందేవరకు దరఖాస్తులు, అడ్మిషన్ల కోసం వేచిచూడాల్సి వచ్చేది. డిజిలాకర్ విధానం వచ్చాక వాటిని చూపించి కూడా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయి జిరాక్స్‌లు కూడా లేనివారు డిజిలాకర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని తద్వారా డూప్లికేట్ సర్టిఫికెట్లు పొందవచ్చు.
ఇంటర్ బోర్డు పునర్‌వ్యవస్థీకరణ
ఇంటర్ బోర్డును పునర్‌వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బోర్డు చైర్మన్‌గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, వైస్ చైర్మన్‌గా పాఠశాల విద్య కార్యదర్శి ఉంటారని తెలిపింది. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా విద్యాశాఖలోని పలు విభాగాల అధికారులు, నామినేటెడ్ సభ్యులుగా ఆంధ్రా, నాగార్జున, ఎన్టీఆర్ వైద్య, పద్మావతి మహిళా యూనివర్సిటీల వీసీలు ఉన్నారు. కాలేజీల విభాగంలో ఆరుగురు ప్రిన్సిపాళ్లను ఎంపిక చేశారు. ఈ బోర్డు కాలవ్యవధి మూడేళ్లు.
Updated Date - Dec 17 , 2024 | 04:12 AM