Sankranti Special: కోడిపందేల్లో ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారో తెలుసా..?
ABN, Publish Date - Jan 13 , 2024 | 02:24 PM
సంక్రాంతి.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని ఆసక్తి చూపిస్తుంటారు.
సంక్రాంతి.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని ఆసక్తి చూపిస్తుంటారు. పండగ దగ్గరకు రాగానే మరింత సందడి నెలకొంటుంది. స్వస్థలాలకు వెళ్లేందుకు రెండు మూడు నెలల నుంచే సన్నాహాలు ప్రారంభం అవుతాయి. పండగ రోజు బంధువులతో కలిసి ఆనందంగా గడిపే సమయాన్ని మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంటారు. కొత్త అల్లుళ్లతో తెలుగువారి లోగిళ్లు నిండుదనాన్ని సంతరించుకుంటాయి. అందుకే ఎన్ని పనులు ఉన్నా.. ఎన్ని వ్యయప్రయాసలు ఉన్నా.. డోంట్ కేర్ అంటూ పల్లె బాట పట్టేస్తారు పట్నం ప్రజలు. సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కొత్తబట్టలు, గాలిపటాలు, పిండివంటలు, కోడిపందేలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది.
ఇక సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాలలో కృష్ణా, గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలకు ఎంతో ప్రసిద్ధి. పండగకు కొన్ని నెలల ముందే కోళ్లను కోడి పందాలకు సిద్ధం చేస్తారు. వీటిలో నెమలి, తెల్లనెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కెక్కిరాయి, అబ్రాస్, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి. పందెం కోళ్లకు పెట్టే తిండి చూస్తే.. వామ్మో అనాల్సిందే. ఖర్జూర, బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు వంటివి తినిపిస్తారు. పౌష్ఠికంగా తయారు చేస్తారు. పందెంలో గెలిచేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఈ సారి సంక్రాంతి కోడిపందేలకు గోదావరి జిల్లాల్లోని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం, చింతలపూడి, ద్వారకాతిరుమల మండలాలు కేరాఫ్ గా మారనున్నాయి. పందెంరాయుళ్ల కోసం నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వారి కోసం హోటళ్లు, రెస్ట్ రూమ్ లు, గెస్ట్ హౌస్ లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కోడి పందాలు జరిగే ప్రాంతాలు ఇప్పటికే జనసందడిగా మారాయి. ఇక సంక్రాంతి ప్రారంభమైతే.. ఆ సందడి గురించి మాటల్లో వివరించలేం.
వేలల్లో కొనుగోలు..
అయితే.. పందెంలో ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారో తెలుసా.. వాటిని కూడా ఖరీదైన ఆహారంతో పౌష్ఠికంగా పెంచుతారు. గెలిచిన కోడికి, ఓడిపోయిన కోడి మధ్య వ్యత్యాసాలు ఏమీ ఉండవు. ఒక్క గెలుపోటముల విషయం తప్ప. కాబట్టి.. ఓడిపోయిన కోడిపుంజును వేలం వేస్తారు. ఓడిపోయింది కదా అని తేలిగ్గా తీసేయలేం. ఎందుకంటే దానిని దక్కించుకునేందుకూ చాలా పోటీ ఉంటుంది మరి. వేలంలో వేల రూపాయల ధర పెట్టి మరీ కొనుగోలు చేస్తారు. అనంతరం దానిని ముక్కలుగా కోసి.. శుభ్రంగా కడిగి, మసాలాలు దట్టించి.. రకరకాల వంటకాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వచ్చే ఏడాది సంక్రాంతికి తిరిగొస్తామంటూ భారంగా తిరుగుపయనమవుతారు.
Updated Date - Jan 13 , 2024 | 02:32 PM