Amaravati: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలే: మంత్రి నాదెండ్ల..
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:49 PM
కాకినాడ పోర్టు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు.
అమరావతి: కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుపడిన ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. తమ పారా బాయిల్డ్ రైస్‌ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తమ బియ్యాన్ని నౌకలో లోడు చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ ఎక్స్‌పోర్టు, పద్మశ్రీ రైస్ మిల్, సూర్యశ్రీ రైస్ మిల్ యజమానులు భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, విశ్వనాథరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
మంత్రి ఆగ్రహం..
మరోవైపు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు. వీటి మెుత్తాన్ని పంచనామా చేశామని, ఆ సమయంలో వీడియో రికార్డింగ్ సైతం చేసినట్లు నాదెండ్ల చెప్పారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ కావాల్సిందేనని మంత్రి అన్నారు. పేద ప్రజలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని కొందరు దారి మళ్లిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుని దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో అనవసరంగా ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండవని నాదెండ్ల చెప్పారు. ఘటనపై క్షేత్రస్థాయిలో నిజాలు వెలుగులోకి రావాలని మంత్రి చెప్పుకొచ్చారు. ఎవరూ ఏం చేయలేరని ధీమాతోనే కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నూటికి నూరు శాతం ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అంతిమంగా ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని మంత్రి నాదెండ్ల చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rain Alert: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం..
Nellore: నెల్లూరుకు మహర్దశ.. మంత్రి నారాయణ ఏం చెప్పారంటే..
Updated Date - Dec 17 , 2024 | 06:12 PM