Godavari flood flow: గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం.. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ఇదీ పరిస్థితి
ABN, Publish Date - Jul 21 , 2024 | 09:10 AM
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి 10.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు.
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి 10.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. 36.10 అడుగులకు చేరింది. 6,22,233 క్యూసెక్కుల నీరు డిచార్జ్ అవుతోంది. ఇక తాలిపేరు ప్రాజెక్ట్ 25 గేట్లు ఎత్తి 55,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 52,897 క్యూసెక్కులుగా ఉంది.
పోలవరం వద్ద పెరిగిన వరద
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద మరింత పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 31.700 మీటర్లకు నీటి మట్టం చేరింది. దిగువకు 7,96,686 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు.
ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
అల్లూరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలకు వరద తాకిడి పెరిగింది. పి.గన్నవరం మండలంలో నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నాటుపడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
మరోవైపు అల్లూరి జిల్లాలోని చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెగని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శబరి, గోదావరి నదులలో నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు గ్రామాల ప్రజలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేశారు.
పెద్దవాగు ప్రాజెక్ట్‌ను పరిశీలన మంత్రి తుమ్మల
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దెబ్బతిన్న పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట గండ్లను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిశీలించనున్నారు. ఇరిగేషన్ అధికారులతో మరమ్మత్తు పనులుపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక పంట నష్టపోయిన భూములను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
Updated Date - Jul 21 , 2024 | 09:23 AM