నాదెండ్ల తనిఖీలతో హడల్!
ABN, Publish Date - Oct 10 , 2024 | 01:47 AM
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు మండలం కాపవరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తొలి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం విజయవాడ కారులో బయలుదేరుతూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించేశారు.
మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు
నల్లజర్లలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
దేవరపల్లి, నల్లజర్లలోని రైస్‌మిల్లుల్లో దాడులు
50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్
కేసులు నమోదు చేస్తాం : మంత్రి మనోహర్
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కొవ్వూరు మండలం కాపవరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తొలి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం విజయవాడ కారులో బయలుదేరుతూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించేశారు. రాత్రి వేళ మొదలైన ఈ ఆకస్మిక దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఊహించని విధంగా జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలతో అధికారులంతా పరుగులు పెట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్న రైస్ మిల్లుల లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. ఇందులో భాగంగా తొలుత నల్లజర్ల మండలంలో రెండు రైస్ మిల్లుల్లోనూ, తర్వాత దేవరపల్లిలో మరో రైస్‌మిల్లులోనూ తనిఖీలు చేశారు. మళ్లీ నల్లజర్ల సమీపంలో రహదారిలో లారీలను సైతం ఆపి తనిఖీలు చేశారు. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులను సీజ్ చేయించి విజయవాడ తిరిగి వెళ్లారు.
నల్లజర్ల, ఆక్టోబరు 9 : పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి భారీస్థాయిలో రేషన్ బియ్యం సీజ్ చేయించారు. బుధవారం కొవ్వూరు మండలం కాపవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి తిరిగి విజయవాడ వెళుతున్న మంత్రి మనోహర్ నల్లజర్లలోని శ్రీ వెంకట సత్య రైస్‌మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు. పౌర సరఫరాల అధికారులు, పోలీసులు వెంట వచ్చి రేషన్ బియ్యం పరిశీలించి అక్రమంగా విదేశాలు తరలించేందుకు సిద్ధంచేసిన రేషన్ బియ్యంగా గుర్తించారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నులు ఉంటుందని, ఈ సరుకు కాకినాడ వెళ్లి అక్కడ నుంచి ఆఫ్రికా దేశాలు వెళుతున్నట్టు మంత్రి మనో హర్ చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ప్రభుత్వం కిలో రూ.43.40కు కొనుగొలుచేసి ఉచితంగా అందిస్తోందని, కొందరు వ్యాపారులు ప్రజల వద్ద కిలో రూ.10కు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ దందాలకు పాల్పడి అక్రమంగా కోట్లు సంపాదించారని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ రేషన్ బియ్యం కొనుగోలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ వ్యాపారుల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బియ్యం అక్రమ రవాణా నివారించే మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అనంతరం అనంతపల్లిలో వెంకట సత్యనారాయ ణ రైస్‌మిల్లుకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ రికార్డులు లేవని, విచారించాలని అధికారులకు సూచించారు. అక్కడ నుంచి దేవరపల్లిలో వెంకటేశ్వరా, వరలక్ష్మి రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. వెంకటేశ్వరా రైస్‌మిల్లులో గతంలో వేరొకచోట సీజ్ చేసి తెచ్చిన 60 బస్తాలు ఉండడంతో యాజమానిని ప్రశ్నించారు. సివిల్ సప్లై అధికారులకు తీసుకుని వెళ్ల మని చెప్పినా పట్టించుకోలేదని యజమాని చెప్పడంతో అధికారులకు చివాట్లు పెట్టారు. వరలక్ష్మి రైస్‌మిల్లులో సీజ్ చేసిన బియ్యం 270 కిలోలు లేకపోవడంతో కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత రాత్రి 11 గంటల సమయంలో మంత్రి మనోహర్ అనంతపల్లి టోల్‌ప్లాజా వద్ద సరుకుతో వెళుతున్న లారీలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అక్రమ రేషన్ బియ్యం లారీలో తరలిపోతుందనే అనుమానంతో రైస్‌మిల్లులతోపాటు వాహనాలను ఆయన తనిఖీ చేశారు. ఉదయం పది గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాపవరం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన మంత్రి రాత్రి 11 గంటల వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రైస్‌మిల్లులు, వాహనాల తనిఖీలో సమయం అంతా గడిపారు. మంత్రి ఏ గ్రామం వెళ్లి నా జనసైకులతోపాటు టీడీపీ నాయకులు అంతా ఆయనతో సెల్ఫీల కోసం క్యూ కట్టారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మనోహర్
కొవ్వూరు, అక్టోబరు9: రైతులకు భరోసా కల్పించి అండగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుఖాతాకు సొమ్ము జమచేసి చూపిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మనోహర్‌తో పాటు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రైతుసేవా కేంద్రం పరిసరాల్లో మొక్కలు నాటారు. తొలుత కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి తప్పులు జరగకుండా రైతు సం ఘం నుంచి ఒకరు, మిల్లర్ల నుంచి ఒకరు కలిసి క్షేత్రస్థాయి కమిటీలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. 17 శాతం నుంచి 22 శాతం వరకు తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 220 రైతు సేవా కేంద్రాల ద్వారా 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామని, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తోపాటు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, దిసభ్య కమిటీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Oct 10 , 2024 | 06:36 AM