AP NEWS: ఏలూరులో టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి.. కారణమిదే..?
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:24 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ(YSRCP) కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ(TDP) నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తోంది. అధికారంలో ఉన్నామని తాము ఏం చేసినా చెల్లుతుందని జగన్ పార్టీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు.
ఏలూరు: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ(YSRCP) కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ(TDP) నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తోంది. అధికారంలో ఉన్నామని తాము ఏం చేసినా చెల్లుతుందని జగన్ పార్టీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. మరోసారి ఏలూరులో టీడీపీ నేతలపై వైసీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. నిన్న(ఆదివారం) రాత్రి పెదవేగి మండలం కొప్పాకలో వైసీపీ మూకలు టీడీపీ నేత కాటేపల్లి సురేష్‌పై దాడి చేశాయి. అవినీతిని ప్రశ్నించడమే అతను చేసిన తప్పన్నట్లు విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో టీడీపీ నేత తీవ్రంగా గాయపడ్డారు. కాగా అతడిని టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు(సోమవారం) అక్కడ కూడా వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు మరోసారి పాల్పడ్డారు. దాంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కాగా.. టీడీపీకి చెందిన క్షతగాత్రులను పరామర్శించటానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు గేట్-1 ద్వారా ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయంలో గేట్-2 ద్వారా ఆస్పత్రికి దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు కూడా వచ్చారు. పరామర్శ అనంతరం మీడియాతో చింతమనేని మాట్లాడుతుండగా.. గేట్-1 వద్దకు జెడ్పీ చైర్మన్ భర్త ఘంటా ప్రసాదరావు చేరుకున్నారు.
టీడీపీ శ్రేణులను రెచ్చ గొడుతూ వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో హాస్పిటల్ లోపలికి ఘంటా ప్రసాదరావు వెళ్లారు. అయితే ఆయన వెళ్తున్న సమయంలో అక్కడున్న టీడీపీ నేతలను ఘంటా ప్రసాదరావు దుర్భాషలాడారు. గేట్లు తీసుకుని బయటకు వస్తే తమ తడాఖా చూపిస్తాం అంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పోలీసులు సకాలంలో స్పందించి ఇరు వర్గాలను అదుపు చేశారు. హుటాహుటినా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు చేరుకున్నారు. అదనపు పోలీసుల రాకతో ఈ వివాదం సద్దుమణిగింది.
Updated Date - Feb 12 , 2024 | 04:20 PM