AP Elections 2024: ఇక మంచి రోజులు!
ABN, Publish Date - Apr 11 , 2024 | 10:09 AM
Andhra Pradesh Elections 2024: ‘నాకు అనుభవం ఉంది. పవన్‌కు పవర్ ఉంది. ప్రధాని మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్ అనే అహంకారాన్ని బూడిద చేస్తుంది. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా.. సైకిల్ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్ జోరుకు ఎదురులేదు.. కమల వికాసానికి అడ్డే లేదు.. మా కాంబినేషన్ సూపర్...
నా అనుభవం.. పవన్ పవర్.. మోదీ సంకల్పం
మా కాంబినేషన్ సూపర్.. వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు
జగన్ సింగిల్‌గా కాదు.. శవాలతో వస్తున్నాడు!
ఆయన దుర్మార్గంతో వెంటిలేటర్‌పై రాష్ట్రం..
విధ్వంసకర పాలన కావాలా?.. అభివృద్ధి చేసే పాలన కావాలా?
యువత భవిత కోసం ఎన్డీయేను గెలిపించండి: చంద్రబాబు
బాబు గుండె ధైర్యం ఉన్న నేత.. అభివృద్ధి కోసం పరితపిస్తారు
సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ తేవాలని చంద్రబాబును కోరుతున్నా
ఐదుగురి గుప్పెట్లో 5 కోట్ల మంది.. ప్రశ్నించేవాడు లేకపోతే
బెదిరించేవాడిదే రాజ్యం.. అందుకే బాబు, నేను నిలబడ్డాం: పవన్
వైసీపీ వైరస్‌ను తరిమికొట్టాలి: పురందేశ్వరి
తణుకు, నిడదవోలులో ఉమ్మడి గర్జన
(భీమవరం/తణుకు/రాజమహేంద్రవరం–ఆంధ్రజ్యోతి) :
‘నాకు అనుభవం ఉంది. పవన్‌కు పవర్ ఉంది. ప్రధాని మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్ అనే అహంకారాన్ని బూడిద చేస్తుంది. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా.. సైకిల్ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్ జోరుకు ఎదురులేదు.. కమల వికాసానికి అడ్డే లేదు.. మా కాంబినేషన్ సూపర్. పవన్‌కల్యాణ్ కోట్లాది రూపాయల ఆదాయాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని మీకోసం వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే. యువత భవిష్యత్‌కు, రాష్ట్రాభివృద్ధికి తిరుగుండదు. ఎన్నికల తర్వాత జగన్‌కు చిప్పే గతి. పవన్, నేను కలిసి ఆయన్ను ఎక్కడకు పంపుతామో చూడండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు గుండె ధైర్యం ఉన్న నాయకుడు. అనుభవం ఉన్న వ్యక్తి. అభివృద్ధి కోసం పరితపించే మనిషి. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై చంద్రబాబుకు చెబితే 24 గంటల్లోనే నిపుణులతో సంప్రదించి పరిష్కార మార్గాన్ని చూపారు. అటువంటి పట్టుదల, నైపుణ్యం, అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరం’ అని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడవవోలు బహిరంగ సభల్లో వీరిద్దరూ ప్రసంగించారు. భారీ రోడ్‌షోలు నిర్వహించారు. వారికి అశేష జనవాహిని స్వాగతం పలికింది. నిడదవోలు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కూడా హాజరయ్యారు. ముగ్గురూ జగన్ అవినీతి, అక్రమాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గాలి మారింది.. స్వరమూ మారుతోంది!
అప్పులా.. అభివృద్ధా?
జగన్ ఐదేళ్ల పాలనలో బాదుడే బాదుడు. విధ్వంసకర పాలన కావాలా.. అభివృద్ధి చేసే పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా.. సంక్షోభ పాలన కావాలా? ఉద్యోగాలు లభించే పాలన కావాలా.. ఉన్మాద పాలన కావాలా? దారుణమైన రహదారులు కావాలా.. రహదారి భద్రత కావాలా? అప్పులు కావాలా.. సంపద సృష్టించే ప్రభుత్వం కావాలా? రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మే 13న ఆలోచించి ఓటేయండి.. కూటమిని గెలిపించండి..
వలంటీర్లకు పది వేలు..
వలంటీర్లూ.. రాజీనామాలు చేయొద్దు.. జగన్ మాయలో పడొద్దు.. కేవలం 2% మంది వలంటీర్లు రాజీనామా చేస్తే అందరూ చేశారని చెబుతున్నాడు. మేం వచ్చాక మీకు రూ.10 వేలు పారితోషికంగా ఇస్తాం. ఏటా లక్ష సంపాదించేలా వనరులు సమకూరుస్తాం. వచ్చే ఐదేళ్లలో యు వతకు 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారం లోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. వృద్ధులకు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్‌ను ఇంటికే అందజేస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తా. జగన్ సింగిల్‌గా కాదు.. శవాలతో వస్తున్నాడు. 2014లో తండ్రిలేని బిడ్డ అని వచ్చావు. 2019లో తన బాబాయిని చంపివేసి ఎవరో చంపేశారని వచ్చావు. నిన్న పింఛన్లు ఇవ్వకుండా ముసలివారిని చంపేశారు. శవ రాజకీయం చేస్తున్నాడు. ఆయన్ను చూసి ఎమ్మెల్యేలే పారిపోతున్నారు. టికెట్లు ఇస్తానంటే ఎంపీలూ పారిపోతున్నారు. ఎమ్మెల్సీలు కూడా నాలుగేళ్లు పదవి ఉన్నా మీతో ఉండం అని వదిలిపెట్టి మా వద్దకు వస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రులను సర్వనాశనం చేసి బాగుపడిన ఒకే ఒక వ్యక్తి జగన్‌రెడ్డి.. కేవలం సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జలరెడ్డి, పెద్దిరెడ్డి అనే నలుగురు రెడ్లకు రాష్ట్రాన్ని అప్పగించాడు. పవన్, నేను, బీజేపీ ముందుకు వెళ్తుంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. ఆ చిచ్చులో జగన్‌రెడ్డే దగ్ధమయ్యే పరిస్థితి వస్తుంది. తణుకు రోడ్‌షో అదిరింది. నిడదవోలు దద్దరిల్లింది. మా గర్జన చూశాక జగన్ గుండె పగిలిపోవడం ఖాయం. నిద్రరాదు. నిడదవోలులో పొత్తుల వల్ల సైకిల్ సింబల్ లేదు. ఎంపీగా దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేగా కందుల దుర్గేశ్ పోటీచేస్తున్నారు. వీరిని సపోర్టు చేస్తున్నాం. ఉదయం లేవగానే హలో ఏపీ అంటూ ప్రతిఒక్కరూ సంభోదించుకోవాలి.
వైసీపీ వాళ్లను తాటతీసి కూర్చోబెడతాం!
రాష్ట్రంలో అన్ని వర్గాలను దెబ్బతీసిన వ్యక్తి జగన్. ఉద్యోగులను నిండా ముంచాడు. 73 వేల మంది పోలీసులకు సరెండర్ లీవ్‌లు, డీఏలు ఇవ్వలేదు. టీఏలు లేవు. ఉద్యోగులను మోసం చేశాడు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌పై ఆలోచించాలి. చంద్రబాబుకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. కష్టమైనా సరే ఏడాదిలోగా ఉద్యోగులకు సహకారం అందించాలి. ఓపీఎస్ అమలుకు కృషిచేస్తాం. ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. 5 కోట్ల మంది ప్రజలు కేవలం బెదిరించే ఐదుగురి గుప్పెట్లో నలిగిపోతుంటే.. ఆ బెదిరించేవాడి ఎదురుగా ఒక సమూహం వచ్చి నిలబడింది. రాష్ట్ర భవిష్యత్ కోసం కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించడం కోసం చంద్రబాబు, నేను మా సైజు తగ్గించుకుని ఉమ్మడిగా నిలబడ్డాం. ఇది మీ భవిష్యత్ కోసమే. ఉపాధి అవకాశాల కోసమే. మీకు అండదండగా ఉండడం కోసమే. ఇరిగేషన్ మంత్రిని పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నిస్తే.. అబ్బ నీ తియ్యని దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరా అబ్బ అంటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం తప్ప ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడు. ఒక్క మంత్రి కూడా ప్రజల గురించి, సమస్యల గురించి మాట్లాడరు. మేం ప్రశ్నిస్తే చంద్రబాబును, నన్ను, పురందేశ్వరిని నోటికి వచ్చినట్లు నిందిస్తున్నారు. వ్యక్తిగతంగా తిడుతున్నారు. మేమేం అడుగుతున్నాం? పోలవరం ఏమైంది.. పోలీసులకు టీఏ, డీఏలు, సరెండర్ లీవులు ఎందుకు మంజూరు చేయడం లేదు? సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పి ఎందుకు రద్దు చేయడం లేదు..? డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదంటే సమాధానం చెప్పకుండా మమ్మల్ని పచ్చిబూతులు తిట్టడమే కాక, మా కుటుంబసభ్యులను తిడుతున్నారు. త్వరలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం. వైసీపీ వాళ్లను ఒక్కొక్కరి తాటతీసి కింద కూర్చోబెడతాం జాగ్రత్త. వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసిన హంతకులను వెనకేసుకొస్తున్నారు. ఇంట్లో వారికి రక్షణ లేదు. సొంత చెల్లెళ్లకు రక్షణ లేదు. సొంత చెల్లెలినే గోడకువేసి కొట్టినోడికి మన ఆడబిడ్డలెంత? 3 వేల మంది ఆడపడుచులు అదృశ్యమైపోతే ఈనాటివరకు ఈ జగన్ ఒక్కమాట కూడా బదులు ఇవ్వలేదు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తులతో కొన్ని చోట్ల సీట్లు ఇవ్వలేకపోయాం. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నాగబాబుకు కేటాయించాం. కానీ పొత్తులో బీజేపీకి ఇచ్చాం. ఇలా ఎన్నో చోట్ల సీట్లు కేటాయించలేకపోయాం. తణుకులో విడివాడ రామచంద్రరావుకుకు సీటు ఇస్తామని గతంలో ప్రకటించినా.. రాష్ట్ర భవిష్యత్ కోసమే తగ్గాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ(టీడీపీ)ని గెలిపించాలి. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసి మెలగాలి. పొత్తుల్లో అదే చేశా.
పొత్తు మా కోసం కాదు.. మీ కోసమే: బాబు
అనుభవం ఉన్న నేను.. తపన ఉన్న పవన్, దేశాన్ని నంబర్ వన్ చేయాలన్న మోదీ చేతులు కలిపాం. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు పెట్టుకున్నాం. మా కోసం కాదు. ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం. పవన్‌పై వ్యక్తిగత దాడులు చేసినా సరే నిలబడ్డారు. నేను కష్టాల్లో ఉన్నప్పడు వచ్చి బేషరతుగా మద్దతు ప్రకటించారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. అందుకే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి వచ్చాయి. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పోతాడు. ఎన్నికల తర్వాత చేతిలో చిప్ప పట్టుకుని ఎక్కడికి పోతాడో చేసి చూపిస్తాం. పవన్, నేను ఘర్షణ పడుతున్నామంటూ సోషల్ మీడియాలో తప్పుడు సంతకాలతో పెడుతున్నారు. ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి క్షణం అభివృద్ధి కోసం పరితపించాం. రాజధాని అమరావతిని తీసుకొచ్చాం. పోవలరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. 18 కేంద్ర విద్యా సంస్థలు తీసుకొచ్చాం. పేదలకు వంద సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఐదేళ్లలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. యువతకు ఉద్యోగాలు కల్పించాం. మళ్లీ జాబు రావాలంటే కూటమి గెలవాలి. కూటమి రావాలంటే ప్రతి ఒక్కరూ 30 రోజులు పనిచేయండి. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలి.
కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని బతికించడానికి ఎన్డీయే రావాలి. పోలవరం పూర్తి కావాలి. పరిశ్రమలు రావాలి. అందుకు మోదీ సహకారం కావాలి.
ఒక అహంకారి, విధ్వంసకారుడిపై పవన్, నేను పోరాడుతున్నాం. పిల్లల భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించి ఓటేయండి.
రాజధాని లేని రాష్ట్రం: పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం అనే వైరస్ వచ్చింది. మే 13న ఎన్డీయేి ఓటేసి ఈ వైరస్‌ను తరిమికొట్టాలి. వైసీపీ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. రాజధాని లేని రాష్ట్రంగా మారింది. ఐదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం జరగడం లేదు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ డ్రైవరును హత్యచేసి డోర్‌డెలివరీ చేయడం చూసి.. రాష్ట్రంలో వైసీపీ పరిపాలనను ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు.
అంబాజీపేట, అమలాపురంలో సభలు
బాబు, పవన్ గురువారం కోనసీమలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం గడియార స్తంభం సెంటరు వరకు 6 కిలోమీటర్లు రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Updated Date - Apr 11 , 2024 | 10:09 AM