AP Elections: తూర్పున యుద్ధమే.. ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?
ABN, Publish Date - Apr 20 , 2024 | 08:30 AM
తూర్పులో ఈ దఫా ద్విముఖ పోటీ నెలకొంది. వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న గద్దె రామ్మోహన్ ఈ సారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తరపున రంగంలో నిలవగా.. వైఎస్‌ఆర్‌సీపీ తరపున మొదటిసారి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు.
కాకలు తీరిన రాజకీయ ఉద్ధండులు తలపడిన గడ్డ!
పార్టీలు ఏవైనా ప్రజాభిమానం చూపి, పేదల పక్షం వహించే వారిని అక్కున చేర్చుకున్న నియోజకవర్గం. విలక్షణ, విజ్ఞత కలిగిన ఓటర్లకు పెట్టింది. పేరు విజయవాడ తూర్పు నియోజకవర్గం (Vijayawada East Constituency). నాటి ఉమ్మడి విజయవాడ నియోజకవర్గం నుంచి విడివడిన తర్వాత రెండు దఫాలు విజయవాడ దక్షిణ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండి తర్వాత విజయవాడ తూర్పుగా అవతరించింది. ప్రస్తుతం పదమూడో సారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి, హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ బరిలో నిలవగా వైసీపీ తరపున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన తూర్పు నియోజకవర్గ ఓటర్లు ఈ దఫా ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరం.
ఈసారి ద్విముఖ పోరే..!
తూర్పులో ఈ దఫా ద్విముఖ పోటీ నెలకొంది. వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) ఈ సారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి తరపున రంగంలో నిలవగా.. వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) తరపున మొదటిసారి దేవినేని అవినాష్ (Devineni Avinash) బరిలో ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ గత ఎన్నికల మాదిరిగానే టీడీపీ కూటమి, వైసీపీ మధ్య ద్విముఖ పోటీయే తప్ప త్రిముఖ పోటీ లేదు. గద్దె రామ్మోహన్ పోటీ చేయటం ఇది నాలుగోసారి. 2009లో ఓటమి చెందినా 2014, 2019లో గెలుపొందారు. గత ఎన్నికల్లో జన సేన కూడా రంగంలో నిలిచింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన బత్తిన రాము గణనీయంగా 30వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఈసారి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ బరిలో ఉన్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసిన బొప్పన భవకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి గద్దెకు మద్దతు ఇస్తున్నారు.గద్దె రామ్మోహన్ తన రాజకీయ ప్రస్థానాన్ని గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. 1994లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొంది టీడీపీలో చేరారు. 1999లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో కంకిపాడు నుంచి పోటీ చేసి దేవినేని నెహ్రూపై ఓడిపోయారు. 2009లో గద్దెతో పాటు ఉద్దండుడు దేవినేని నెహ్రూ తలపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు తనయుడు యలమంచిలి రవి చాపకింద నీరులా ఇద్దరినీ ఓడించారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల బరిలో నిలిచి విజయదుందుభి మోగించారు. ఎన్నికల్లో గెలిస్తే ఆయన హ్యాట్రిక్ సాధిస్తారు. ఇకపోతే వైసీపీ తరపున దేవినేని అవినాష్ మొదటిసారిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో విజయవాడ పార్లమెంట్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత వైసీపీలో చేరారు. ఈ సారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన బత్తిన రాము వైసీపీలో చేరారు. ఆయనతో పాటు, రవి తనకు సహకరిస్తే గెలుపు సాధించగలమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఓటర్లు ఏం తీర్పును ఇస్తారో వేచి చూడాల్సిందే.
ఏ పార్టీకి ఎన్ని విజయాలు?
విజయవాడ తూర్పు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. మొత్తం 12 సార్లు జరిగిన ఎన్నికల్లో చూస్తే 1962నుంచి 2019 వరకు చూస్తే కాంగ్రె స్ పార్టీ అఽత్యధికంగా 7సార్లు గెలుపొందింది. 3సార్లు టీడీపీ, ఒకదఫా బీజేపీ, మరో దఫా ప్రజారాజ్యం గెలుపొందింది. ఈ నియోజకవర్గం 2సార్లు భౌగోళిక మార్పులను సంతరించుకుంది. విజయవాడ సెంట్రల్ ఒకసారి, పెనమలూరు ప్రాంతం విడివడటం రెండోసారి జరిగింది. ఈ మార్పుల తరువాత విజయవాడ తూర్పునియోజకవర్గం మాత్రం టీడీపీ కంచుకోటగా మారింది. 2009 లో తప్పిస్తే 2014, 2019లో టీడీపీ వరుస విజయాలను చవిచూసింది.
కాకలు తీరిన నేతలు తలపడిన నియోజకవర్గం
తూర్పు నుంచి ఎందరో కాకలు తీరిన నేతలు తలపడ్డారు. నగరానికి చెందిన తొలితరం నేత చలసాని వెంకటరత్నం పోటీ చేసి ఓటమి చెందారు. నగరానికి చెందిన దేవినేని నెహ్రూ కూడా ఓటమి చెందారు. నగరానికి చెందిన టీవీఎస్ చలపతిరావు మొదటి ఎన్నికల్లో గెలుపొందారు. టీడీపీకి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు 1978లో ఇక్కడి నుంచి పోటీ చేయగా 1985లో వంగవీటి మోహనరంగా పోటీ చేశారు. తర్వాత ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి రెండు దఫాలు గెలిచారు. ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఇక్కడి నుంచే గెలుపొందారు. అడుసుమిల్లి జయప్రకాష్, వై రాజగోపాలరావు, బీఎస్ జయరాజ్, వంగవీటి రాధాకృష్ణ, ఐలాపురం వెంక య్య, కామేశ్వరి తూర్పు నుంచి పోటీ చేశారు.
తూర్పున నెలకొన్న సమస్యలు
నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య వరద ముంపునకు ‘రక్షణ గోడ’తో పరిష్కారమైనా ఇంకా చాలా సమస్యలే ఉన్నాయి. ప్రధానంగా గుణదల ప్రాంతంలో కొండ ప్రాంతాలు ఎక్కువ. అక్కడ నివశిస్తున్న వారికి మౌలిక సదుపాయాలు లేవు. మెట్లు, రోడ్లు లేకపోవటం, మంచినీటి కష్టాలు ఎదుర్కోవటం ఇబ్బందిగా మారాయి. పటమట ప్రాంతంలో ఆక్రమణలు, ఉద్యానవనాలు ఏర్పాటు కాకపోవటం వంటివి ఉన్నాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆటోనగర్ ఇక్కడే ఉండటం సమస్యాత్మకంగా మారింది. జనావాసాలు చుట్టూ విస్తరించటం వల్ల ఆటోనగర్‌ను తరలించాలన్న డిమాండ్ ప్రజల నుంచి బలంగా వస్తోంది. షెడ్లకు వచ్చే వాహనాల రాకపోకలతో జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంఘాలు కూడా ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆటోనగర్ సమస్యకు అందరి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులోనైనా ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించే పరిస్థితులు వస్తాయి. పటమట, కష్ణలంక ప్రాంతాల్లో ఆక్రమణలు స్థానిక ప్రజలకు ఇబ్బందిగా మారాయి. దోమల సమస్యతో పాటు, డ్రెయినేజీ సమస్యలను ప్రజలు ఏకరువు పెడుతున్నారు.
– ఆంధ్రజ్యోతి, విజయవాడ
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 20 , 2024 | 08:30 AM