Balineni Srinivas : ‘సెకీ’ ఒప్పందంపై
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:09 AM
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)’తో చేసుకున్న ఒప్పందంపై నాటి విద్యుత్ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి సంతకం చేయలేదా! వాస్తవానికి విద్యుత్ మంత్రే సంతకం చేయాలి. అయితే తాను సంతకం పెట్టలేదని ఆయన తాజాగా బాంబు పేల్చారు.
నేను సంతకం పెట్టలేదు
నా డిజిటల్ సంతకం వాళ్లే పెట్టేశారేమో
‘విద్యుత్’ బాంబు పేల్చిన బాలినేని
ఆ ఒప్పందంతో నాకు సంబంధమే లేదు
మంత్రినైన నాతో జగన్ ఎప్పుడూ చర్చించలేదు
నాడు విద్యుత్ శాఖను నడిపింది సీఎంవోనే
ఎన్నికలకు ముందే వైసీపీని వీడుదామనుకున్నా
చంద్రబాబుతోనూ మాట్లాడా.. రమ్మన్నారు
నా రాత బాగోక అప్పుడు పార్టీ మారలేదు
‘ఆంధ్రజ్యోతి’తో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)’తో చేసుకున్న ఒప్పందంపై నాటి విద్యుత్ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి సంతకం చేయలేదా! వాస్తవానికి విద్యుత్ మంత్రే సంతకం చేయాలి. అయితే తాను సంతకం పెట్టలేదని ఆయన తాజాగా బాంబు పేల్చారు. తన డిజిటల్ సంతకాన్ని వాళ్లే పెట్టేశారేమోనని వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తానన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తన నివాసంలో బాలినేని ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. అసలు సెకీతో సౌర విద్యుత్ సరఫరా ఒప్పందం గురించే తనకు తెలియదని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. అసలు సెకీ విషయంలో జగన్ తన తో ఎప్పుడూ చర్చించలేదన్నారు. ఆ శాఖ కార్యదర్శి వచ్చి ఒప్పందం జరుగుతుందని చెప్పారు తప్పితే.. ఎప్పుడూ తనతో చర్చించలేదని తెలిపారు. సీఎం కార్యాలయం అర్ధరాత్రి ఫైలు పంపి సంతకం పెట్టాలంటే.. పెట్టలేదన్నారు.
తర్వాతి రోజు సంతకంతో కేబినెట్‌కు ఫైలు వెళ్లిందని, దానిపై మంత్రివర్గంలోనే చర్చించామన్నారు. కానీ ఒప్పందంతో తనకు సంబంధం లేదని.. అసలు సెకీ వాళ్లు వచ్చినప్పుడు తనను సమావేశానికి పిలువలేదని చెప్పారు. తాను సంతకం పెట్టింది సెకీతో ఒప్పందం ఫైలుపై కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న అధికారిని అడిగితే అన్ని విషయాలూ తెలుస్తాయని చెప్పారు.
ఈ వ్యవహారంలో జగన్ ముడుపులు తీసుకున్నారో లేదో తనకెలా తెలుస్తుందన్నారు. నిజంగా అలా తీసుకుని ఉంటే విచారణలో తేలుతుందని, తప్పని రుజువైతే.. ప్రజలకు అన్యాయం చేసినట్లేనని స్పష్టం చేశారు. సెకీ విషయంలో తనకు అణువంత కూడా తెలియదని, వాళ్లు పంపిన ఫైలుపై సంతకం పెట్టి పంపానని.. తనకు అంతవరకే తెలుసని పునరుద్ఘాటించారు. విద్యుత్ శాఖను నడిపిందంతా సీఎంవోయేనని చెప్పారు. సీఎండీలను నియమించిన ఫైలు కూడా తన వద్దకు రాలేదని, సంబంధిత శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే నియమించారని తెలిపారు. సీఎంవోతో పాటు ఒక కాంట్రాక్టరు సీఎండీలను కూడా ప్రభావితం చేసేవారని.. ఇంకా ఇలాంటి విషయాలు చాలానే ఉన్నాయని, అవన్నీ త్వరలోనే చెబుతానని తెలిపారు. ఏం తప్పుచేశానని తనను మంత్రివర్గం నుంచి పక్కనపెట్టారని జగన్‌ను ప్రశ్నించారు. మంత్రి పదవి ముఖ్యం కాదని, గౌరవం చాలా ముఖ్యమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గనుల మంత్రిగా నాలుగేళ్లు పనిచేసిన తనకు వైసీపీలో గౌరవం దక్కలేదని వాపోయారు.
ఆ విషయం పవన్‌కు చెప్పా..
తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని.. జనసేనలో చేరే సమయంలో పవన్ కల్యాణ్‌తో ఇది చెప్పానని బాలినేని అన్నారు. వైఎస్ కుమారుడిగా జగన్ వైసీపీ ఏర్పాటుచేయగానే.. అప్పటివరకు ఉన్న పదవులను వదులుకుని ఆ పార్టీలోకి వెళ్లి పనిచేశానని చెప్పారు. తాను జగన్‌తో ఉన్నప్పుడు అసలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఎక్కుడున్నాడని నిలదీశారు. అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడే స్థాయికి వచ్చాడా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు, పవన్ మెప్పు కోసమే తాను మాట్లాడుతున్నానని ఆయన అంటున్నారని.. అంటే సెకీ ఒప్పందంలో తనకు సంబంధం లేకపోయినా ఉందని ఒప్పుకోవాలనేది వారి ఉద్దేశమా అని ప్రశ్నించారు. జగన్ మెప్పు కోసం చెవిరెడ్డిలాగా ఎవరి కాళ్లూచేతులు తాను పట్టుకోలేదని, భజన కూడా చేయలేదన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి.. చంద్రబాబును తిట్టలేదనే.. ఆ టికెట్ చెవిరెడ్డికి ఇచ్చారన్నారు. అదే మాగుంట టీడీపీలో ఉన్న సమయంలో జగన్‌ను తిట్టలేదని గుర్తుచేశారు.
గ్రానైట్లు, పోర్టుల్లో దోచుకునేందుకే చెవిరెడ్డి వచ్చారు
‘వైసీపీ ఓడిపోయాక నన్ను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని జగన్ చెప్పారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. రాజకీయంగా, ఆర్థికంగా నష్టం, అన్యాయం జరిగాక ఇంకా ఎలా అధ్యక్షుడిగా ఉంటానని చెప్పగానే.. మీరు ఉండనంటే.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తామన్నారు. ఎక్కడో చిత్తూరు జిల్లా వ్యక్తిని ప్రకాశం జిల్లాకు అధ్యక్షుడిగా ఎలా పెడతారని అడిగా. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో మరే పార్టీలో ఉండదు. ప్రకాశం జిల్లాకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా మిథున్‌రెడ్డి నియామకాన్ని కూడా చెవిరెడ్డి అడ్డుకున్నారు. సంతనూతలపాడులో గ్రానైట్లు, కందుకూరులో పోర్టులను దోచుకునేందుకే ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన వచ్చే సమయంలోనే ఆర్టీసీ స్థలాలు తీసుకున్నారు.
ఇది నేను అడగ్గానే రద్దు చేసుకుంటానని చెప్పారు. నిజాయితీగా తీసుకుని ఉంటే ఎందుకు రద్దు చేసుకోవాలి’ అని బాలినేని ప్రశ్నించారు. పార్టీ నుంచి తాను ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో.. అసలు ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో బహిరంగంగా చర్చించేందుకు దమ్ముంటే రావాలని చెవిరెడ్డికి సవాల్ విసిరారు. తన జోలికి రావొద్దని.. వస్తే వాళ్ల వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే చరిత్ర చాలా ఉందన్నారు. నిజంగానే వైఎ్‌సపై ప్రేమ ఉంటే.. షర్మిల, విజయమ్మలపై ఇష్టారీతిన ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారని, పెట్టిన వారిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. జగన్, షర్మిల విషయం కుటుంబ వ్యవహారం కాబట్టి అందులోకి తాము వెళ్లలేదన్నారు. దీనిని పరిష్కారం చేయాల్సింది, చూపాల్సింది విజయమ్మేనని చెప్పిన వ్యక్తిని కూడా తానొక్కడినేనని తెలిపారు.
చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానన్నారు..
ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి బయటకు వెళ్దామనుకున్నానని, ఇదే విషయంపై చంద్రబాబుతో కూడా మాట్లాడానని బాలినేని తెలిపారు. ఆయన కూడా టీడీపీలోకి ఆహ్వానించడంతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామన్నారని చెప్పారు. ‘నా రాత బాగోలేక అప్పుడు పార్టీ వీడలేదు. ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు. జగన్‌తో రాజకీయ ప్రయాణం వల్ల చివరకు మొత్తం ఆస్తిని అమ్ముకోవలసిన పరిస్థితికి తీసుకొచ్చారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం జనసేనలోకి చేరలేదని, ఎలాంటి పదవీ ఇవ్వకపోయినా కలిసి ప్రయాణం చేస్తానని, తనవల్ల కూటమిలో ఎలాంటి ఇబ్బందీ రాదని, వైసీపీలో ఇబ్బంది పడి.. అక్కడ ఉండలేక వస్తున్నానని పార్టీలో చేరే సమయంలోనే పవన్‌తో చెప్పానన్నారు. ఆయన కూడా అదే స్థాయిలో తనకు గౌరవం ఇచ్చారని చెప్పారు.
Updated Date - Nov 26 , 2024 | 03:09 AM