Caste Discrimination : కేఆర్ నారాయణన్ కూడా కులవివక్ష బాధితుడే!
ABN, Publish Date - Dec 16 , 2024 | 06:00 AM
మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా కులవివక్ష బాధితుడేనని సామాజిక విశ్లేషకుడు, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఎస్‌ఎన్ సాహు పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి ఓఎస్డీ, సామాజిక విశ్లేషకుడు ఎస్‌ఎన్ సాహు వెల్లడి
దేశంలో కులగణన అవసరం ఉందని వ్యాఖ్య
ముగిసిన మానవ హక్కుల వేదిక మహాసభలు
అనంతపురం కల్చరల్, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా కులవివక్ష బాధితుడేనని సామాజిక విశ్లేషకుడు, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఎస్‌ఎన్ సాహు పేర్కొన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగురాష్ట్రాల మానవ హక్కుల వేదిక 10వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ మహాసభల్లో ఎస్‌ఎన్ సాహు మాట్లాడుతూ సమాజంలో కులవివక్ష తీవ్రస్థాయిలో ఉందన్నారు. ప్రభుత్వంలో పైస్థాయిలో ఉన్నవారిలోనూ కులవివక్ష బాధితులున్నారని, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా ఇటువంటి వివక్ష బాధితుడేనని చెప్పారు. కుల వ్యవస్థ అనేది ఒక వ్యాధి అనీ, ఇది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోడానికి కులగణన అవసరమని పేర్కొన్నారు. ‘ప్రతి ప్రభుత్వం పశుగణన చేస్తోంది. అలాంటపుడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన చేపట్టలేరా? ఈ మాత్రం అడిగే హక్కు కూడా లేదా?’ అని ప్రశ్నించారు. అనంతరం మానవహక్కుల వేదిక ప్రచురణలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక ఏపీ అధ్యక్షుడు జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శి రాజేశ్, తెలంగాణ అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, రచయిత కొప్పర్తి వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 06:01 AM