Share News

‘తేమ’ పరీక్షలో పత్తి రైతు చిత్తు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:03 AM

పత్తి అమ్మకాల్లో రైతులు చిత్తవుతున్నారు. తేమ శాతం, పింజ పొడవు, సర్వర్‌ సమస్యలతో సీసీఐ కేంద్రాలు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. సీసీఐ నిబంధనలతో మద్దతు ధర దక్కక..

‘తేమ’ పరీక్షలో పత్తి రైతు చిత్తు

  • యంత్రాల్లో తేడాతో పెరిగిపోతున్న తేమ శాతం

  • సర్వర్‌ సమస్యలతో రోజంతా రైతుల పడిగాపులు

  • తిరస్కరిస్తే వెనక్కి తీసుకెళ్లడం అదనపు భారం

  • సీసీఐ నిబంధనలతో దక్కని మద్దతు ధర

  • అధికారులు, పరిశ్రమల కుమ్మక్కుతోనే సమస్య?

కర్నూలు, గుంటూరు సిటీ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పత్తి అమ్మకాల్లో రైతులు చిత్తవుతున్నారు. తేమ శాతం, పింజ పొడవు, సర్వర్‌ సమస్యలతో సీసీఐ కేంద్రాలు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. సీసీఐ నిబంధనలతో మద్దతు ధర దక్కక.. ప్రైవేటు పరిశ్రమలకు తీసుకెళ్లి వచ్చిన ధరకు రైతులు పత్తిని అమ్ముకుంటున్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు చిత్రవిచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పత్తిని తీసుకెళ్తే సీసీఐ తేమ పరీక్షలో నెగ్గుతోంది. సాయంత్రం తీసుకువస్తున్న పత్తి లాట్లలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో తిరస్కరిస్తున్నారు.

  • యంత్రాల్లో తేడా...

సీసీఐ కేంద్రాల్లో తేమ శాతం చూసేందుకు బయ్యర్లు రెండు రకాల యంత్రాలను వినియోగిస్తున్నారు. ఒక్కో దానిలో ఒక్కోవిధంగా తేమ శాతం కనిపిస్తోంది. చిన్న ముల్లు ఉన్న యంత్రం 12 శాతం తేమ చూపిస్తే.. పెద్ద ముల్లు ఉన్న యంత్రంలో 15 శాతం కనిపిస్తోంది. జిన్నింగ్‌ మిల్లుల యజమానులు వినియోగిస్తున్న యంత్రాలకు, సీసీఐ బయ్యర్లు వినియోగిస్తున్న యంత్రాలకు తేడా ఉంటోంది. ప్లాస్టిక్‌ గోతాల్లో పత్తి తీసుకువస్తే సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విడిగానే పత్తిని లోడ్‌ చేసి తీసుకువస్తున్నారు. మినీ ఆటోల్లో పత్తిని ఎక్కువ మొత్తంలో తొక్కడం వల్ల లోపల వేడి పెరిగి తేమ శాతం పెరిగిపోతున్నదని రైతులు చెబుతున్నారు. ఒకే లాట్‌లోని పత్తిలో ఐదు రకాలుగా తేమ శాతం నమోదవుతోంది.


  • సీసీఐ కేంద్రాల్లో దక్కని మద్దతు!

పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,521 రైతులకు దక్కడం లేదు. మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌కు 5,480 క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తే.. క్వింటా ధర కనిష్ఠంగా రూ.4,211.. గరిష్ఠంగా రూ.7,014.. మధ్యస్థంగా రూ.6,869 ధర పలికింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, పింజ పొడవని సాకులు చెప్పి అధికారులు ధర తగ్గించేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదోని పత్తి మార్కెట్‌కు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ నుంచి రైతులు వస్తున్నారు. తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే వెనక్కి పంపుతున్నారు. ఈ సమస్యలతో కొందరు రైతులు మార్కెట్‌కు వస్తే.. ఎక్కువ మంది ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు.

  • రోజంతా పడిగాపులే!

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో బిల్లింగ్‌ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆదోనిలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిన రైతులు రాత్రి 8-10 గంటల వరకు ఉండాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టరు, లారీ యజమానులు అదనపు బాడుగ వసూలు చేస్తున్నారు. దీనివల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. పత్తి జిన్నింగ్‌ పరిశ్రమల యాజమాన్యంతో సీసీఐ అధికారులు కుమ్మక్కై తేమ, సర్వర్‌ స్లో అని సాకులు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

  • తేమ శాతం పెంచాలి

ఈ ఏడాది విపరీతంగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం చలి కాలం వచ్చేసింది. గాలిలో తేమ శాతం పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పత్తి ఆరటం చాలా కష్టం. సీసీఐ అధికారులు తేమ శాతం పెంచి పత్తిని కొనుగోలు చేయాలి.

- మలిపెద్ది లక్ష్మీ నారాయణ,

కొర్రపాడు, మేడికొండూరు మండలం


  • ధర తగ్గించైనా కొనండి

సీసీఐ కేంద్రానికి తెచ్చిన పత్తిని తిరిగి తీసుకువెళ్లడం తలకు మించిన భారం. తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తగ్గించి కొనుగోలు చేయాలి. ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.

- జుటూరి వెంకయ్య,

చౌడవరం, గుంటూరు మండలం

  • డబుల్‌ బాడుగ పడుతోంది

రెండెకరాల్లో పత్తి సాగు చేశా. దిగుబడి బాగా వచ్చింది. ఽసీజన్‌ ప్రారంభంలో క్వింటా రూ.10 వేలు పలికితే.. ఇప్పుడు 6-7 వేలకు పడిపోయింది. ఉదయం 6 గంటలకు 10 క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చా. తేమ శాతం ఎక్కువుందని కొనలేదు. అధికారులు జాప్యంతో డబుల్‌ బాడుగ ఇవ్వాల్సి వచ్చింది.

చిన్నబాబు, గూడూరు, కర్నూలు జిల్లా

  • పేరుకే మద్దతు ధర

సీసీఐ కేంద్రాల్లో ఎకరాకు 6 క్వింటాళ్లే తీసుకుంటాం అంటున్నారు. అంతకంటే ఎక్కువ వస్తే వ్యాపారికో.. పరిశ్రమకో అమ్ముకోవాలి. పేరుకే మద్దతు ధర. తేమ శాతం ఎక్కువగా చూపి ధర తగ్గించేస్తున్నారు. కేంద్రం వద్ద 12 గంటలకుపైగా ఉన్నా బిల్లింగ్‌ కాలేదు.

- మిన్నల్లా, పత్తి రైతు, గూడూరు, కర్నూలు

Updated Date - Nov 20 , 2024 | 04:06 AM