Girl's Father : కూతుర్ని వేధించాడని.. కువైత్ నుంచి వచ్చి చంపేశాడు
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:39 AM
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలానికి చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం తన భార్యతో సహా కొంతకాలం క్రితం కువైత్‌కు వెళ్లాడు. తన 12 ఏళ్ల కూతురు బాగోగులు చూడమని తన భార్య సోదరికి అప్పగించాడు.
అన్నమయ్య జిల్లాలో ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
భార్యతో కలిసి బతుకుతెరువు కోసం కువైత్ వెళ్లిన తండ్రి
కుమార్తె బాగోగులు చూడాలని మరదలికి అప్పగింత
బాలికపై కన్నేసిన మరదలి మామ
అసభ్యంగా ప్రవర్తన.. తండ్రికి చెప్పిన బాలిక
పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వేదన
రాయచోటి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలానికి చెందిన ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం తన భార్యతో సహా కొంతకాలం క్రితం కువైత్‌కు వెళ్లాడు. తన 12 ఏళ్ల కూతురు బాగోగులు చూడమని తన భార్య సోదరికి అప్పగించాడు. ఆ మరదలి ఇంట్లో ఆమె మామ కూడా ఉంటున్నాడు. బాలిక హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు పిన్ని ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చిన బాలిక పట్ల వరుసకు తాత అయిన పిన్ని మామ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాలిక ఫోన్‌లో తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆందోళన చెందిన తల్లి తన సోదరికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆమె సరిగా స్పందించకపోవడంతో కువైత్ నుంచి వచ్చి ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు పిలిపించి మందలించి పంపేశారు. తర్వాత బాలిక తల్లి తిరిగి కువైత్ వెళ్లిపోయి భర్తకు జరిగిన విషయం చెప్పింది. పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని భావించిన ఆ తండ్రి కువైత్ నుంచి ఈనెల 6వ తేదీన స్వగ్రామానికి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి వద్ద నిద్రిస్తున్న మరదలి మామను ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. వెంటనే కువైత్‌కు వెళ్లిపోయాడు. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేయడం మొదలుపెట్టారు.
దీంతో బాలిక తండ్రి బుధవారం ఈ హత్యకు గల కారణాలను వివరిస్తూ ఓవీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ హత్యతో ఇతరులకు సంబంధం లేదని తాను పోలీసులకు లొంగిపోతానని పేర్కొన్నాడు. ఈ వీడియో తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు యూట్యూబర్ అని, అతనికి లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు తెలిసింది. వివిధ రకాల అంశాలపై అతను వీడియోలు చేస్తూ.. యుట్యూబ్‌లో పోస్టు చేస్తాడు. ప్రస్తుతం నిందితుడు కువైత్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్య ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు.
తండ్రి ఆరోపణల్లో నిజం లేదు: ఎస్పీ
పోలీసులు చర్యలు తీసుకోనందునే తాను హత్య చేసినట్లు నిందితుడు చేసిన ఆరోపణలో నిజం లేదని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆంధ్రజ్యోతికి తెలిపారు. చెల్లి మామగారిపై కేసు నమోదు చేయాలని బాలిక తల్లి తమను కోరలేదని, అతడిని పిలిపించి హెచ్చరించాలనే చెప్పిందని తెలిపారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నా.. ఆమె చేయలేదన్నారు. సోషల్ మీడియాలో నిందితుడు వీడియో పోస్టు చేసి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడన్నారు. మృతుడు బాలికను తాకి అసభ్యకరంగా ప్రవర్తించిన మాట వాస్తవమని, అయితే అతను వికలాంగుడని, పూర్తిగా నిలబడలేడన్నారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
Updated Date - Dec 13 , 2024 | 05:39 AM