Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:06 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ అయ్యారు. ఇంతకాలం ముందస్తు బెయిల్‌పై ఆయన మరింత కాలం పొడగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్‌లో అరెస్ట్ చేసిన ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు.
కాగా ఏపీ అసెంబ్లీ పోలింగ్ మరుసటి రోజు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు హత్యాయత్నం కేసులున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎం ధ్వంసం ఘటన ప్రధానంగా ఉంది.
పరారీలోనే పిన్నెల్లి సోదరుడు వెంకట రామిరెడ్డి
కాగా ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకట రామిరెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు అతడిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని టీడీపీ ప్రశ్నిస్తోంది. పోలీసు శాఖలో కొంతమంది దిగువ స్థాయి అధికారులు ఇస్తున్న లీకులతోనే వెంకట రామిరెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని కూటమి పక్షాలు చెబుతున్నాయి.
ఈవీఎంలను ధ్వంసం సందర్భంగా టీడీపీ ఏజెంట్‌పై దాడి ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదయింది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదయింది. ఇవి కాకుండా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదయింది. మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఉన్నాయి.
హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది.
Updated Date - Jun 26 , 2024 | 04:53 PM