ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:15 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా వదలకుండా 11 స్థానాలూ తెలుగుదేశానివే! అక్కడి నుంచి గెలిచిన వాళ్లలో ఇద్దరు మంత్రులూ ఉన్నారు! మహామహా నాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ...

  • మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ బాబాయ్‌ రూప్‌ దందా

  • కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న వైనం

  • జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఆయనదే హవా

  • సాధారణ నాయకుడికి అసాధారణ ప్రాధాన్యం

  • ఎవరి అండతో రెచ్చిపోతున్నారనే చర్చ

  • రూ.ఐదు వేల కోట్ల క్వార్ట్జ్‌ సంపదపై కన్ను

  • ఖనిజం తమకే విక్రయించాలని బెదిరింపులు

  • రూప్‌ ఆధీనంలోని గనుల్లో తవ్వకాలకు ఓకే

  • తేడా కొడుతోందని గుర్తించి తెల్లారేసరికి రద్దు

అప్పుడు అబ్బాయ్‌... అనిల్‌ కుమార్‌ యాదవ్‌! ఇప్పుడు బాబాయ్‌ రూప్‌ కుమార్‌! సర్కారు మారింది కానీ... నెల్లూరులో ‘ఫ్యామిలీ’ పొలిటికల్‌ దందా మాత్రం మారలేదు! వైసీపీ ప్రభుత్వంలో అనిల్‌ హవా కొనసాగితే.. కూటమి ప్రభుత్వంలో రూప్‌ కుమార్‌ హడావుడి చేస్తున్నారు. క్వార్ట్జ్‌ తవ్వకాల్లో కాలూవేలూ పెడుతున్నారు. జిల్లాకు చెందిన బడా నేతలే సైలెంట్‌గా ఉండిపోగా... రూప్‌ కుమార్‌ రెచ్చిపోతుండటం గమనార్హం. ఒక సాధారణ నాయకుడికి... ఇంతటి అసాధారణ ప్రాధాన్యం ఏమిటి? ఏం చూసుకుని ఇలా చెలరేగిపోతున్నారు? ఇదీ ఇప్పుడు చర్చ!

(నెల్లూరు - ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా వదలకుండా 11 స్థానాలూ తెలుగుదేశానివే! అక్కడి నుంచి గెలిచిన వాళ్లలో ఇద్దరు మంత్రులూ ఉన్నారు! మహామహా నాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ... కేవలం ఎన్నికలకు నెలరోజుల ముందు పార్టీ కండువా కప్పుకొన్న రూప్‌కుమార్‌ జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. అవీఇవీ ఎందుకు... రాయికాదు, రత్నం అనే పేరు పొందిన క్వార్ట్జ్‌లో కాలుమోపారు. డిప్యూటీ మేయర్‌ హోదాలో, ద్వితీయ శ్రేణి హోదా నాయకుడు మాత్రమే అయిన రూప్‌ కుమార్‌కు ఇంత ప్రాధాన్యం ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎవరి అండతో ఇలా రెచ్చిపోతున్నారనే చర్చ నెల్లూరులో తీవ్రంగా జరుగుతోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో క్వార్ట్జ్‌కు కొంతకాలంగా మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో నెల్లూరు జిల్లాలో విస్తృతంగా లభించే ఈ ఖనిజ నిక్షేపాలకు డిమాండ్‌ పెరిగింది. ఈ జిల్లాలోని సైదాపురం మండలంలో క్వార్డ్జ్‌ గనులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో, ప్రైవేటు భూములు కలిపి మొత్తం 200లకు పైగా గనులు ఉన్నాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం నెల్లూరు క్వార్డ్జ్‌కు చైనాలో విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. దీంతో ధర అమాంతం పెరిగింది. ఒకప్పుడు పిచ్చిరాయిగా పిలుచుకునేది కాస్తా రత్నమై పోయింది. టన్ను ధర కనిష్ఠంగా రూ.75వేల నుంచి 2 లక్షల వరకు పలుకుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి అనిల్‌ కుమార్‌ కొన్ని నెలలపాటు ఈ గనులను శాసించారు. ఇప్పుడు... ఆయన బాబాయ్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ ఏకంగా వచ్చే ఐదేళ్ల కాలానికి స్కెచ్‌ వేశారు.

  • ఎవరీ రూప్‌ కుమార్‌?

రూప్‌ కుమార్‌ నెల్లూరు నగర కార్పొరేషన్‌ నుంచి పలు సార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా పనిచేస్తున్నారు. రూప్‌కుమార్‌కు స్వయానా అన్న కొడుకే అనిల్‌ కుమార్‌. అనిల్‌ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలంలో రూప్‌కుమార్‌ షాడో మంత్రిగా వ్యవహరించారు. అప్పుడే క్వార్ట్జ్‌ తవ్వకాల్లో చక్రం తిప్పసాగారు. అనిల్‌ ‘మాజీ’ అయిన కొద్ది నెలలకే రూప్‌ కుమార్‌ పక్కకు వచ్చేశారు. వైసీపీలో కొనసాగుతూనే అనిల్‌కు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు.


  • నాడు తాడేపల్లి అండతో...

తన కంట్లో నలుసులా తయారైన బాబాయ్‌ రూప్‌ కుమార్‌ను దెబ్బతీయడం కోసం అనిల్‌ దారులు వెతికారు. ఆయన క్వార్డ్జ్‌ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ... వైసీపీలోని కీలక నాయకుడి ఆశీస్సులు ఉండటంతో అది కుదరలేదు. దీంతో... నెల్లూరు జిల్లాలో ఉన్న క్వార్డ్జ్‌ గనులు, రోజువారీ వ్యాపారం, ఆదాయం, వైసీపీ పెద్దలు రహస్యంగా పొందుతున్న ప్రయోజనాలపై నేరుగా ‘తాడేపల్లి ప్యాలె్‌స’కు అనిల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో సీన్‌ మారింది. జిల్లా పరిధిలోని క్వార్డ్జ్‌ గనులు మొత్తం అనిల్‌కు అప్పగిస్తూ తాడేపల్లి ప్యాలెస్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అధికారులు తు.చ. తప్పకుండా ఆ ఆదేశాలను పాటించారు. క్వారీలన్నీ అనిల్‌ చేతికి వచ్చాయి.


  • మళ్లీ రూప్‌ రంగ ప్రవేశం...

ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు రూప్‌ కుమార్‌ టీడీపీలో చేరారు. ఆయన ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు మాత్రమే! కానీ... అత్యంత చిత్రంగా జిల్లాలో ఆయనే చక్రం తిప్పడం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా క్వార్డ్జ్‌ క్వారీలకు ఎక్కడా అనుమతులివ్వని ప్రభుత్వం.... రూప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నడిచే నాలుగు క్వారీలకు వారం రోజుల క్రితం అనుమతులిచ్చింది. ఈ నాలుగు గత వైసీపీ ప్రభుత్వంలో కూడా రూప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నవే. వాటికి మాత్రమే అనుమతులివ్వడం, ఇతర క్వారీ లీజుదారులు ఎవరు అడిగినా రూప్‌ కుమార్‌ను కలవండి అని సంబంధిత శాఖ మంత్రుల పీఏలు, అధికారులు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు... రూప్‌ కుమార్‌ జిల్లా పరిధిలోని క్వార్డ్జ్‌ యజమానులను పిలిపించుకొని బెదిరిస్తున్నట్లు సమాచారం. ‘మీ క్వారీలు మాకు వదిలిపెట్టండి. లేదా మీరు తవ్విన రాయిని మేం చెప్పిన ధరకు మాకే విక్రయించండి. కాదంటే మీరు క్వారీలు నడుపుకోలేరు’ అని హెచ్చరిస్తున్నట్టు క్వారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూప్‌కుమార్‌ వంటి సాధారణ నాయకునికి ఇంత పలుకుబడి ఎలా వచ్చింది? వేల కోట్ల విలువ చేసే క్వార్డ్జ్‌ వ్యాపారాన్ని గంపగుత్తగా కైవసం చేసుకోవడం ఎలా సాధ్యమైంది? ఆయన ముందు, వెనుక ఎవరున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. రూప్‌ కుమార్‌ వర్గం మాత్రం మంత్రి లోకేశ్‌ పేరు వాడుకుంటూ ఈ దందా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై స్థానిక టీడీపీ సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, క్వార్డ్జ్‌ వ్యవహారాన్ని జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దగా పట్టించుకోలేదు. నిజమైన లీజుదారులు ఎమ్మెల్యేలను కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతలోనే... రూప్‌కుమార్‌ క్వారీలకు వారం రోజుల కిందట రాత్రి అనుమతి లభించింది. ఏదో తప్పు జరుగుతోందని గ్రహించి మరుసటి రోజు ఉదయానికల్లా నిలుపుదల చేసింది.

Updated Date - Dec 03 , 2024 | 04:15 AM