Jogi Ramesh : అగ్రి గోల్డ్ భూములతో దందా!
ABN, Publish Date - Jun 18 , 2024 | 04:40 AM
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం అగ్రి గోల్డ్ భూములను చెరబట్టింది. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి అప్పనంగా రూ.5కోట్ల పైచిలుకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నం.69/2, రీసర్వే నం.87లో అగ్రిగోల్డ్‌కు చెందిన సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది.
మాజీ మంత్రి జోగి కుటుంబం నిర్వాకం
సీఐడీ జప్తులో ఉన్న భూములపైనే కన్ను
జోగి బాబాయ్, తనయుడి పేరిట పత్రాలు
సర్వే నంబర్ల డ్రామాతో స్వీయ సవరణలు
అనంతరం ప్లాట్లుగా మార్చేసి విక్రయాలు
అప్పనంగా రూ.5 కోట్లకు పైగా జేబులోకి
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం అగ్రి గోల్డ్ భూములను చెరబట్టింది. సీఐడీ స్వాధీనంలో ఉన్న భూములను దర్జాగా కబ్జా చేసి అప్పనంగా రూ.5కోట్ల పైచిలుకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నం.69/2, రీసర్వే నం.87లో అగ్రిగోల్డ్‌కు చెందిన సుమారు 2,300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకుంది. అగ్రి గోల్డ్ భూములు వివాదంలో ఉండటాన్ని సాకుగా తీసుకున్న జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేశ్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలసి చెరో 1,086, 1,074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టి అంటకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
అంబాపురంలో ఆర్ఎస్ నం.88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమకు ఉన్న భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్‌కు అమ్మారు. ఆయన మహాలక్ష్మీ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్టెమెంట్స్‌కు చెందిన అడుసుమిల్లి మోహన రామదాసుకు 3,800 గజాలు విక్రయించారు. ఈ మోహన రామదాసు నుంచి 2022లో జోగి వెంటేశ్వరరావు, జోగి రాజీవ్‌లు 2,160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి ఏడుగురు వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
ఇక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించింది. సర్వే నం.88లో కొనుగోలు చేసినట్లుగా చూపిన భూమి దస్తావేజుల్లో తప్పు దొర్లిందని పేర్కొంటూ 2023లో స్వీయ సవరణ చేయించారు. ఆ సమయంలో అగ్రి గోల్డ్ భూములున్న సర్వే నం.87ను అసలుదిగా పేర్కొన్నారు. అంటే సర్వే నం.87లోని భూమి కొనుగోలు అంతా ఉత్తుత్తి డ్రామా అని వీరి ఎత్తుగడ అగ్రి గోల్డ్ భూమిని కాజేయడమేనని అర్థమవుతోంది. వీరు కొనుగోలుదారులకు విక్రయించినది కూడా అగ్రి గోల్డ్‌కు చెందిన భూమి కావడం గమనార్హం. అసలు విషయం తెలియక కొనుగోలుదారులు సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి మునిగిపోయారు. విక్రయించగా మిగిలిన 800గజాల్లో జోగి కుటుంబం ప్రహరీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రి గోల్డ్‌కు చెందిన అవ్వా వెంకట శేషు నారాయణరావు విజయవాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు అనంతరం విజయవాడ రూరల్ తహశీల్దార్ నివేదిక మేరకు వివాదా స్పద అగ్రిగోల్డ్ భూముల్ని జోగి కుటుంబం విక్రయించినట్లు స్పష్టమవుతోంది.
Updated Date - Jun 18 , 2024 | 04:40 AM