ఆ హత్యతో సంబంధం లేదు
ABN, Publish Date - Oct 20 , 2024 | 07:21 AM
రాజధాని అమరావతిలోని వెలగపూడి దళిత కాలనీలో జరిగిన మెండెం మరియమ్మ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు.
అప్పటి ఎమ్మెల్యే శ్రీదేవి నన్ను ఇరికించారు
మరియమ్మ హత్య కేసు విచారణలో
మాజీ ఎంపీ నందిగం సురేశ్ వెల్లడి
గుంటూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని వెలగపూడి దళిత కాలనీలో జరిగిన మెండెం మరియమ్మ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. మరియమ్మ హత్య కేసులో నందిగం నిందితునిగా ఉన్నారు. 2020, డిసెంబరు 27న దళిత కాలనీలో ఒకే సామాజిక వర్గంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాటి బాపట్ల ఎంపీ నందిగం వర్గీయులు కూడా ఈ ఘర్షణలో ఉన్నారు. వీరు చేసిన దాడిలో మరియమ్మ మృతి చెందారు.
మృతురాలి కుమారుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న నందిగం సురేశ్‌ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు.. శనివారం వైద్య పరీక్షలు అనంతరం తుళ్లూరు పోలీస్ ేస్టషన్‌కు తరలించారు. శనివారం సాయంత్రం 3 గంటల నుంచి న్యాయవాది సమక్షంలో తుళ్లూరు సీఐ గంగా వెంకటేశ్వర్లు విచారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ హత్యలో తన ప్రమేయం లేదని, హతురాలి కుమారుడు, వారి కుటుంబ సభ్యులు కూడా తన ప్రమేయం లేదని చెప్పారని నందిగం తెలిపారు.
‘‘నిందితుల్లో మీ బంధువులు గానీ, అనుచరులు గానీ ఉన్నారా’’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎవరూ లేరని సురేశ్ సమాధానం చెప్పారు. ‘‘హత్య జరిగిన రోజు నిందితులతో మీరు ఫోన్లో మాట్లాడారా’’ అని ప్రశ్నించగా తాను ఎవరితో మాట్లాడలేదని, తనకు కూడా ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ కేసులో తనను అప్పటి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇరికించారని చెప్పారు.
ఆ తర్వాత రోజు అప్పటి హోం మంత్రి సుచరితతో కలిసి తాను మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చానని చెప్పారు. మరియమ్మ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించే క్రమంలో వారు మీ ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపిస్తూ గొడవ చేశారని తెలిపారు. ఆదివారం కూడా సురేశ్‌ను విచారించనున్నారు.
Updated Date - Oct 20 , 2024 | 07:21 AM