High Court Public Prosecutor : గౌతంరెడ్డి సహకరించడం లేదు
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:51 AM
వైసీపీ నేత గౌతంరెడ్డి దర్యాప్తునకు సహకరించడంలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలియజేశారు. దర్యాప్తు అధికారి చెప్పిన సమయానికి విచారణకు హాజరుకావడంలేదని..
ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు
హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదన
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత గౌతంరెడ్డి దర్యాప్తునకు సహకరించడంలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలియజేశారు. దర్యాప్తు అధికారి చెప్పిన సమయానికి విచారణకు హాజరుకావడంలేదని.. విచారణాధికారి లేని సమయంలో స్టేషన్‌కు వచ్చి వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన గండూరి ఉమామహేశ్వరశాస్త్రిని చంపేందుకు మనుషులను పురమాయించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో గౌతంరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 11న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ శుక్రవారం ప్రకటించారు.
ఫోర్జరీ పత్రాలతో తన భూమిని ఆక్రమించడమే కాకుండా, తనను చంపేందుకు ప్రయత్నించారంటూ గౌతంరెడ్డిపై విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేయడం, ముందస్తు బెయిల్ కోరుతూ గౌతంరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శుక్రవారం వ్యాజ్యం విచారణకు రాగా గౌతంరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. హత్యకు ప్రణాళిక రచించాల్సిన అవసరం గౌతంరెడ్డికి లేదని.. దర్యాప్తునకు ఆయన సహకరిస్తున్నారని తెలిపారు. కోర్టు విధించే షరతులకు కట్టబడి ఉంటారని.. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించేందుకు కూడా సిద్ధమని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. హత్యాయత్నంలో పిటిషనర్ ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అన్న అంశానికే పరిమితమైతే సరిపోతుందన్నారు. 11న నిర్ణయం వెల్లడిస్తామన్నారు.
Updated Date - Dec 07 , 2024 | 04:51 AM