చంద్రబాబు అరెస్టు వెనుక సీఐడీ మహాకుట్ర
ABN, Publish Date - Nov 18 , 2024 | 05:11 AM
అక్రమ కేసుల గురించి చాలాసార్లు వినుంటారు! ఏ తప్పూ చేయని వ్యక్తిని రాజకీయ కక్షసాధింపుతో అరెస్ట్ చేయడానికి ఏకంగా వాంగ్మూలాన్ని తారుమారు చేయడం గురించి విన్నారా?
తాడేపల్లి డైరెక్షన్ లో తప్పుడు స్కిల్ స్టోరీ
నాడు పీవీ రమేశ్ వాంగ్మూలం తారుమారు
2023 సెప్టెంబరు 9వ తేదీ రాత్రి నంద్యాల పర్యటనలో బస్సులో బస చేసిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును హైడ్రామా మధ్య సీఐడీ అరెస్ట్ చేసిన తీరు నేటికీ ప్రజలకు గుర్తుంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, నిధులు దారి మళ్లించారని నాడు సీఐడీ ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన రోత మీడియా కూడా ఇదే పాట పాడారు. తాజాగా బయటపడిన విషయం ఏంటంటే.. అసలు ఈ కేసే ఓ కుట్ర! తాడేపల్లి డైరెక్షన్‌లో సీఐడీ ఉన్నతాధికారులు చేసిన మహాకుట్ర!
చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం... ఏకంగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు మార్చేశారు. ఆయన చెప్పని విషయాలను సొంతంగా స్టేట్‌మెంట్‌లో చేర్చారు. చేయని తప్పునకు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో ఉంచారు.
ఇదీ వాస్తవం
ఒక పథకానికి లేదా ప్రాజెక్టుకు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు నిధుల విడుదలలో ఎలాంటి అభ్యంతరాలూ ఉండబోవు. ఏదైనా పని సత్వరం కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు చెప్పడం రివాజు.
-పీవీ రమేశ్ స్టేట్‌మెంట్
ఇదీ సీఐడీ ‘కథ’
స్కిల్ ప్రాజెక్టులో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. నేను కుదరదని అభ్యంతరం చెబితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఫోన్ చేసి, ఒత్తిడి చేసి డబ్బులు విడుదల చేయించారు.
-రమేశ్ చెప్పినట్లు కోర్టుకు సీఐడీ సమర్పించిన నివేదిక
ఈ మొత్తం వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
161 స్టేట్‌మెంట్ మార్చేసిన సీఐడీ అధికారులు
చెప్పని విషయాలతో సొంతంగా వాంగ్మూలం
అర్ధరాత్రి దాటాక అక్రమంగా చంద్రబాబు అరెస్ట్
53 రోజులపాటు రాజమండ్రి జైలులోనే
సీఐడీ, వైసీపీ నేతల అడ్డగోలు ఆరోపణలు
తాజాగా వెలుగులోకి వచ్చిన జగన్ లీలలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అక్రమ కేసుల గురించి చాలాసార్లు వినుంటారు! ఏ తప్పూ చేయని వ్యక్తిని రాజకీయ కక్షసాధింపుతో అరెస్ట్ చేయడానికి ఏకంగా వాంగ్మూలాన్ని తారుమారు చేయడం గురించి విన్నారా? అది కూడా ఓ సీనియర్ ఐఏఎస్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను! జగన్ ఈ ‘ఘనకార్యం’ కూడా చేశారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడానికి జగన్ సర్కార్ కనీవినీ ఎరుగని రీతిలో మహాకుట్రకు పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. స్కిల్ కేసులో ఎలాగైన చంద్రబాబును అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు తారుమారు చేశారు. ఆయన ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌ను మార్చేసి, తాడేపల్లి డైరెక్షన్‌లో కథ నడిపించారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని ఆనాడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కేసు పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. అసలు ఈ కేసే అక్రమమని, చంద్రబాబును కుట్రపూరితంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని తాజాగా బట్టబయలైంది.
మొదట్నుంచీ కుట్ర
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కిల్‌డెవల్‌పమెంట్ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. కానీ ఎక్కడా స్కామ్ జరిగినట్టు నిరూపించలేకపోయింది. అయినప్పటికీ నాటి స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావును అరెస్టు చేసింది. అప్పట్లో డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి నానా యాగీ చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా నిరూపణ కాలేదు. అయినా బలమైన ఆధారాలు లభించాయని సీఐడీ అధికారులు హడావుడి చేశారు. చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి బృందం వెళ్లి హైడ్రామా మధ్య ఆయన్ను అరెస్టు చేసింది. చంద్రబాబు వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు 400కి.మీ. రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువచ్చారు. కోర్టులో హాజరు పరిచి, రాజమండ్రి జైలుకు తరలించారు.
అడ్డగోలు ఆరోపణలు
అప్పట్లో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేశ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. చంద్రబాబు మొత్తం నిబంధనలన్నీ తుంగలో తొక్కారని, రూ.వందల కోట్ల కుంభకోణానికి ఆయన చర్యలే కారణమని పీవీ రమేశ్ తన వాంగ్మూలంలో చెప్పినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి సుమారు రూ.3,500కోట్ల విలువైన స్కిల్ ప్రాజెక్టులో 90 శాతాన్ని సిమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు గ్రాంట్ కింద భరిస్తుండగా, 10శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇస్తుంది. అయితే సుమారు రూ.370కోట్ల ప్రభుత్వ వాటాను ఆ కంపెనీలకు అక్రమంగా చెల్లించారని, ఆ డబ్బులు తిరిగి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే వచ్చాయని అప్పట్లో సీఐడీతో పాటు జగన్ అనుకూల మీడియా ఆరోపించింది. చంద్రబాబు దిగిపోయే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 4 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, అప్పటికే 60 వేలమందికి పైగా ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో కూడా ఆ కేంద్రాలను కొనసాగించింది. సీఐడీ చెప్పినట్లు ప్రభుత్వం చెల్లించిన డబ్బంతా తిరిగి చంద్రబాబుకే ఇస్తే ఆ కంపెనీలు ఇన్ని లక్షల మందికి ఎలా శిక్షణ ఇస్తాయి? అన్న ప్రశ్న అప్పట్లోనే తలెత్తింది. ప్రభుత్వం చెల్లించిన మొత్తం కంటే మూడు రెట్లు విలువైన శిక్షణా పరికరాలను ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న శిక్షణా కేంద్రాలకు సరఫరా చేశారు. స్కిల్ ప్రాజెక్టు మొత్తం స్కామ్ అయితే శిక్షణా పరికరాలు ఎలా వచ్చాయి? అన్నది మరో ప్రశ్న. సీఐడీ మాత్రం శిక్షణ పొందిన విద్యార్థులు, ఉద్యోగాలు పొందినవారు, శిక్షణా కేంద్రాల్లో ఉన్న కోట్ల విలువైన పరికరాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎంతసేపటికి స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ద్వారా చేసిన చెల్లింపుల మీదే తన దండయాత్ర అని అడ్డగోలుగా వాదించింది.
తాడేపల్లి డైరెక్షన్‌లో తారుమారు
పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సీఐడీ అధికారులు అప్పట్లో చెప్పిన దానికి పొంతన లేకపోవడం వెనుక పెద్ద కుట్రే నడిచింది. చంద్రబాబును ఎలాగైనా ఈ కేసులో ఇరికించి అరెస్టు చేయాలన్న కుట్రతో జగన్ సర్కార్ అనేకమంది అధికారులను పిలిచి స్టేట్‌మెంట్ నమోదు చేసింది. అందులో భాగంగానే పీవీ రమేశ్ నుంచి కూడా సీఐడీ 161 స్టేట్‌మెంట్ తీసుకుంది. దానికి ముందుగా ప్రశ్నావళిని ఆయనకు పంపించి సమాధానాలు రాసి పంపించాలని అధికారులు కోరారు. సీఐడీ అధికారుల విన్నపం మేరకు ఆయన రిజిస్టర్ పోస్టు ద్వారా సమాధానాలు పంపించారు. ఆ తర్వాత సీఐడీ మళ్లీ మరికొన్ని ప్రశ్నలు లెవనెత్తింది. ఇలా మూడుసార్లు సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పీవీ రమేశ్ సమాధానాలు పంపారు. సీమెన్స్ సంస్థకు చెల్లింపుల సమయంలో తాను ఆ బాధ్యతల్లో లేనని, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జగన్‌కు ముఖ్య సలహాదారుగా పనిచేసిన అజేయ కల్లం ఆ బాధ్యతల్లో ఉన్నారని తెలిపారు. కానీ అసలు వ్యవహారం అక్కడే నడిచింది. పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ మొత్తాన్ని సీఐడీ అధికారులు మార్చేశారు. ఆయన చెప్పని విషయాలను సీఐడీ అధికారులు తాడేపల్లి డైరెక్షన్‌లో జోడించారు. దాన్నే తమ కేసులో బలంగా చూపించి చంద్రబాబును అరెస్టు చేశారు. అప్పటి సీఐడీ చీఫ్ సంజయ్, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఈ కేసుకు సంబంధించి చాలా ప్రకటనలు చేశారు. అవసరం లేకపోయినా ఊరూ వాడా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ప్రచారం చేశారు. చంద్రబాబు అధికారులను బెదిరించారని, దబాయించారని, దానికి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. కానీ సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మాయం చేసి, తమ సొంత స్టేట్‌మెంట్‌నే కోర్టులకు సమర్పించినట్టు తెలుస్తోంది.
సీఐడీ వక్రభాష్యం
స్కిల్ ప్రాజెక్టు చెల్లింపుల విషయంలో తాను అభ్యంతరం చెబితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఫోన్ చేసి, ఒత్తిడి చేసి డబ్బులు విడుదల చేయించారని పీవీ రమేశ్ చెప్పినట్లు సీఐడీ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. చంద్రబాబు అరెస్టుకు దాన్నే ప్రధాన ఆయుధంగా సీఐడీ మలుచుకుంది. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ద్వారా చంద్రబాబును అరెస్టు చేశారన్న విషయాన్ని పీవీ రమేశ్ అప్పుడే ఖండించారు. స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంలో ఆర్థిక చెల్లింపులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయలేదని, అలాంటప్పుడు తప్పు జరిగినట్లు తాను ఎలా చెబుతానని పీవీ రమేశ్ నిలదీశారు.
ఇదీ అసలు సంగతి
చంద్రబాబు అరెస్టు తర్వాత తన స్టేట్‌మెంట్‌లో తప్పేముందో, దాని ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయడం ఏమిటో అర్థంకాక పీవీ రమేశ్ ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఆయనతో మాట్లాడినప్పుడు అసలు విషయం బయటపడింది. తన పేరుతో సీఐడీ రికార్డుల్లో 161 స్టేట్‌మెంట్‌లో ఉన్న అంశాలు ఏవీ తాను చెప్పినవి కావని ఆయన కుండబద్దలు కొట్టారు. తాను పంపించిన స్టేట్‌మెంట్ కాపీ తనవద్ద ఉందని, తానిచ్చానని చెబుతున్న స్టేట్‌మెంట్ ప్రతిని పంపితే ఎక్కడ గోల్‌మాల్ జరిగిందో గుర్తించి చెప్పగలనని ఆయన సీఐడీని కోరినట్లు తెలిసింది. తప్పుడు పద్ధతుల్లో స్టేట్‌మెంట్ తారుమారు చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయించిన జగన్ లీలా విన్యాసాలు ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..
Read Latest AP News and Telugu News
Updated Date - Nov 18 , 2024 | 07:48 AM