ప్రభుత్వం మాది.. నీ అంతు చూస్తా
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:30 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ సాగించిన మరో దందా తాజాగా వెలుగులోకి వచ్చింది.
గతంలో పాస్టర్‌ను బెదిరించిన బోరుగడ్డ అనిల్
ఎస్పీకి ఫిర్యాదు చేసిన పాస్టర్ మరియదాసు
వెలుగులోకి వస్తున్న మరిన్ని దందాలు
గుంటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ సాగించిన మరో దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. చర్చి నిర్మాణానికి విదేశీ నిధులు ఇప్పిస్తానని పాస్టర్ నల్లపు మరియదాసు వద్ద రూ. 5 లక్షలు తీసుకొని మోసగించాడు. డబ్బు తిరిగివ్వాలని అడిగితే.. ‘‘ప్రభుత్వం మాది డబ్బులు అడిగావంటే నీ అంతు చూస్తాను’’ అంటూ బోరుగడ్డ బెదిరించాడు. బాధిత పాస్టర్ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన నల్లపు మరియదాసు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పాస్టర్‌గా పని చేస్తున్నారు. బోరుగడ్డ అనిల్ బంధువులు చిలకలూరిపేటలోని చర్చికి వచ్చి వెళుతుంటారు. వారిచ్చిన సమాచారం మేరకు చర్చి నిర్మాణానికి విదేశీ విరాళాలు ఇప్పిస్తాడని తాను 2020 మేలో అనిల్‌ను కలిశానన్నారు. విదేశీ విరాళాలు కావాలంటే రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడని, రూ. 5 లక్షలు అప్పుగా తెచ్చి అనిల్‌కు ఇచ్చానని తెలిపారు.
ఫోన్ చేసి
నెలలు గడుస్తున్నా విదేశీ నిధులు రాకపోవడంతో తానిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగానన్నారు. ఈ క్రమంలో తనను అనిల్ బెదిరించాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసి డబ్బు ఇచ్చేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరాడన్నారు. ఆ తర్వాత ఆయన ఫోను స్విచ్ ఆఫ్ అయిందన్నారు. ఇదే తరహాలో అనేకమంది పాస్టర్లను బోరుగడ్డ మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఫిర్యాదు చేేసందుకు నేటికి భయపడుతుండడం గమనార్హం. మరోపక్క విశాఖలో రూ. కోట్ల విలువైన 15 ఎకరాల భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి విజయవాడకు చెందిన ఓ బాధితుడి నుంచి కారు తీసుకుని వెనక్కి ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా, బాధితుడిని బెదిరించినట్లు తెలిసింది.
ఇదీ.. అంతర్రాష్ట్ర రహదారి దుస్థితి!
ఇది ఏపీలోని పార్వతీపురం, ఒరిసాలోని రాయగడలను కలిపే అంతర్రాష్ట్ర రహదారి. ఈ రోడ్డుపై భారీ గోతులు ఏర్పడి తరచూ వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. సోమవారం భద్రగిరి వైద్యశాల నుంచి పార్వతీపురానికి వెళ్లేందుకు కొమరాడ నుంచి బయల్దేరిన 108 వాహనం గుమడ గ్రామ సమీపంలోని గోతిలో దిగబడిపోయింది. స్థానికుల సాయంతో వాహనం ముందుకు కదిలింది. కాసేపటికి అదే గోతిలో ఇసుక లారీ దిగబడిపోయింది. సుమారు పది గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది.
- ఆంధ్రజ్యోతి, పార్వతీపురం
సిరులు కురిపించిన చీరమీను
యానాం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): యానాం, గోదావరి జిల్లావాసులు ఎంతో ఇష్టంగా తీనే చీరమీను.. మత్స్యకారులకు సిరుల వర్షం కురిపించింది. యానాంలోని రాజీవ్ బీచ్, పుష్కర్‌ఘాట్ ప్రాంతాల్లో రెండు రోజులుగా కనివినీ ఎరుగని రీతిలో చీరమీను ఒక తెట్టులాగా కనిపించింది. మత్స్యకారులు ప్రత్యేక వలలతో వాటిని ఒడ్డుకు చేర్చి విక్రయాలు చేశారు. సూమరు 600కిపైగా బకెట్లు, బిందెల్లో (బకెట్ ఒకటి 10 లీటర్లు) చీరమీను లభ్యమైందని అంచనా. సేరు (1లీటరు) రూ.3 వేలకు అమ్మారు. పులస తర్వాత ఆ రేటు పలికే చిరుచేపలివే!
ఇది కూడా చదవండి:
సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు
Updated Date - Oct 29 , 2024 | 07:39 AM