Pavan Kalyan : ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:03 AM
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి
నవంబరు 8న ఎస్‌ఈ, ఈఈలతో వర్క్‌షాపు
కేంద్రం నిధులను దుర్వినియోగం చేసిన వైసీపీ ప్రభుత్వం: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
అమరావతి, అక్టోబరు 30(ఆంధజ్యోతి): ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, జల్‌జీవన్ మిషన్ ద్వారా కేంద్రం అందించే నిధులను ఇందుకోసం సద్వినియోగం చేసుకుందామని స్పష్టం చేశారు. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో జల్‌జీవన్ మిషన్‌లో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించామన్నారు.
గత ప్రభుత్వ తప్పిదం
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌మిషన్ ద్వారా రాష్ట్రానికి పంపిన నిధులను గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదన్నారు. పైప్‌లైన్లు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేయలేదని సమీక్షల ద్వారా తేలిందన్నారు. పలుచోట్ల అసలు పనులే మొదలు కాలేదని, వాటిని సరిదిద్దుతూ పనులు వేగవంతం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. జల్‌జీవన్ మిషన్ పనులు సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని ఇవ్వగలమన్నారు. ప్రభుత్వ ప్రణాళికలను తెలియజేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు, ఈఈలతో వర్క్‌షాపు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎస్‌ఈలు, ఈఈలతో వర్క్‌షాపును వచ్చే నెల 8న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..
మరిన్ని ఏపీ వార్తల కోసం
Updated Date - Oct 31 , 2024 | 08:03 AM