Share News

Pawan Kalyan: వెంటనే ఫెర్రీ బకాయి వివరాలు ఇవ్వండి..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 09:28 PM

నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదృశ్యానికి ముందు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. తన బాధను, గత ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాదవాయిపాలెం రేవు లీజుకు తీసుకున్న వ్యక్తులు ఏ విధంగా తనను వేధించారో లేఖలో వివరించారు.

Pawan Kalyan: వెంటనే ఫెర్రీ బకాయి వివరాలు ఇవ్వండి..!
Deputy CM Pawan Kalyan

అమరావతి: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదృశ్యానికి ముందు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. తన బాధను, గత ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాదవాయిపాలెం రేవు లీజుకు తీసుకున్న వ్యక్తులు ఏ విధంగా తనను వేధించారో లేఖలో వివరించారు. రూ.55లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలని చినరెడ్డప్ప ధవేజీని తాను అడగ్గా.. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తనను బెదిరించాడని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రసాదరావు అండదండలతోనే వారు బకాయిలు చెల్లించడం లేదని, దీనికి తననే బాధ్యుడిని చేస్తారనే వెళ్లిపోతున్నట్లు ఎంపీడీవో ఆవేదన వ్యక్తం చేశారు. 33సంవత్సరాలపాటు నిజాయతీగా సేవలు అందించానని, బకాయి సొమ్ము వారు చెల్లించేలా చూసి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. తన పింఛన్‌ ప్రతిపాదన వచ్చేలా చేసి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.


ఎంపీడీవో లేఖపై స్పందించిన పవన్ కల్యాణ్..

ఈ సంఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదవాయిపాలెం ఫెర్రీ బకాయి వివరాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధితులే మళ్లీ బాధితులు కావడం చాలా బాధకరమని డిప్యూటీ సీఎం అన్నారు. ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై తగిన చర్యలు చేపడతామని పవన్ చెప్పారు. అలాగే బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎంపీడీవో కుటుంబసభ్యులు అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.


ఎంపీడీవో కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు..

ఈనెల 15న రాత్రి నుంచి అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ రోజు రాత్రి మచిలీపట్నంలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు చెప్పిన ఆయన అనంతరం రైలులో విజయవాడ మధురానగర్ వద్ద దిగినట్లు సీసీటీపీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ముత్యాలంపాడు వద్ద ఆగిపోవడంతో సమీపంలో ఉన్న ఏలూరు కాలువలో ఆయన దూకి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ఏలూరు కాలువలో తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - Jul 17 , 2024 | 09:40 PM