Revanth Reddy: 2029లో వైఎస్ షర్మిల సీఎం అవుతారు.. ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 08 , 2024 | 08:21 PM
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వైఎస్ షర్మిల తండ్రి లాగే 2029 లో సీఎంగా అవుతారని వ్యాఖ్యానంచారు. 2029లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా, రాష్ట్రంలో షర్మిల సీఎంగా పని చేస్తారని జోస్యం చెప్పారు. తండ్రి ఆశయాలను మోసే వాళ్లనే వారసులుగా గుర్తించాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేదే వైయస్ ఆలోచన అని రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు, వైయస్ ఆశయాలను సాధించేలా సహకరించాలంటూ ఏపీ కాంగ్రెస్ శ్రేణులను ఆయన కోరారు.
‘‘ వైయస్ పేరు మీద వ్యాపారం చేసే వాళ్లు వారసులా.. ప్రజలారా ఆలోచన చేయండి. వైయస్ ఆశయ సాధన కోసమే షర్మిల నేడు బాధ్యత తీసుకున్నారు. గాంధీ కుటుంబం ఇచ్చే ఆదేశాలు పాటించేవాడిగా, తెలంగాణా సీఎంగా చెబుతున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తం కోసం మేమంతా అండగా ఉంటాం. మేమంతా మీకు ఉంటామనే భరోసా ఇచ్చేందుకే మా మంత్రి వర్గం మొత్తం ఇక్కడకు వచ్చా’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అదే జరిగితే కడపలో ఊరూరా తిరుగుతా: రేవంత్ రెడ్డి
కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నిక రావచ్చని పేపర్లో చూస్తున్నానని, నిజంగా ఉపఎన్నిక వస్తే ఊరూరా తిరిగే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రజల కోసం కాంగ్రెస్ జెండా పట్టుకుని వీధివిధి తిరుగుతానని ఆయన చెప్పారు. ఏ కపడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో.. ఆ గడ్డ మీదే కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తామని అన్నారు.
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్
ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదని, అందరూ మోదీ పక్షమేనని వ్యాఖ్యానించారు. అందరూ పాలక పక్షమే అయితే.. ప్రతిపక్ష పాత్ర పోషించేవారు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాన నిలబడే నాయకురాలు వైయస్ షర్మిల అని, ఏపీ ప్రజల పక్షాన అండగా నిలబడి మాట్లాడతారని అన్నారు. షర్మిల నాయకత్వంలో అందరూ కలిసి పని చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు ఆయన సూచించారు.
వైఎస్ నుంచి తాను నేర్చుకున్నది అదే: రేవంత్ రెడ్డి
ఇక వైఎస్సార్ 75వ జయంతి వేడుకలకు రాహుల్ గాంధీ రావాలనుకున్నారని, అయితే మణిపూర్ పర్యటనలో బిజీగా ఉండడంతో రాలేకపోయారని చెప్పారు. 2023లో వైఎస్ స్ఫూర్తితో రాహుల్ పాదయాత్ర చేశారని, రాహుల్ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలతో మమేకమైన నేత వైఎస్ అని సీఎం రేవంత్ కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది వైఎస్ అభిమానులు ఉన్నారని, 2007లో మండలిలో వైఎస్ ముందు ఎమ్మెల్సీగా వాదన వినిపించానని ఆయన గుర్తుచేసుకున్నారు. కొత్త ఎమ్మెల్యేలను ప్రోత్సహించాలని వైఎస్ చెబుతుండేవారని, కొత్త సభ్యుల వాదనలు వినాలనేవారని, వైఎస్ నుంచి తాను ఇదే నేర్చుకున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్‌ను తాను కుటుంబసభ్యుడిలా భావిస్తానని పేర్కొన్నారు.
Updated Date - Jul 08 , 2024 | 08:42 PM