కోట్లకు పడగలెత్తిన సింహాచలం
ABN, Publish Date - Nov 27 , 2024 | 04:38 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జోన్-2 కమిషనర్ పొందూరు సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సింహాచలం గతంలో జీవీఎంసీ పరిధిలోని పలు జోన్లలో కమిషనర్‌గా పనిచేశారు.
జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలు.. విలువ రూ.25 కోట్లపైనే!
అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలింపు
విశాఖపట్నం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జోన్-2 కమిషనర్ పొందూరు సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సింహాచలం గతంలో జీవీఎంసీ పరిధిలోని పలు జోన్లలో కమిషనర్‌గా పనిచేశారు. ఎన్నికల ముందు వేరొక జిల్లాకు బదిలీపై వెళ్లారు. రెండు నెలల కిందట తిరిగి జీవీఎంసీకి బదిలీపై వచ్చి జోన్-2 కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సింహాచలం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతో విశాఖ ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం దాడులు చేశారు. మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆయన నివాసం, జోన్-2 కార్యాలయం, ఆయన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటలోని తల్లిదండ్రుల ఇల్లు, కింతలిలోని అత్తవారి ఇల్లు, కొత్తపేటలోని వియ్యంకుడి నివాసంతోపాటు హైదరాబాద్‌లోని కుమార్తె ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సింహాచలం పేరుతో మధురవాడలో 270, పరదేశిపాలెంలో 400, కాపులుప్పాడలో 200, మేనల్లుడి పేరుతో కాపులుప్పాడలో 750 గజాల స్థలాలు, మద్దిలపాలెంలో అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్, విజయవాడలో ఇంటి స్థలం, శ్రీకాకుళం జిల్లాలో 13 ఇళ్ల స్థలాలు, శ్రీకాకుళం జిల్లా కింతలిలో 4.6 ఎకరాల భూమి, ఒక మారుతి బ్రెజ్జా కారు, 500 గ్రాముల బంగారం, ఆరు బ్యాంకు అకౌంట్లలో రూ.ఐదు లక్షల నగదు ఉన్నట్టు గుర్తించారు. వీటి డాక్యుమెంట్ విలువ రూ.రెండు కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.25 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ అధికారుల అంచనా. దీంతో సింహాచలాన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఏసీబీ అదనపు ఎస్పీ ఎన్.విష్ణు, డీఎస్పీలు బీవీఎస్ నాగేశ్వరరావు, రమ్య తెలిపారు.
Updated Date - Nov 27 , 2024 | 04:39 AM