ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: హెల్మెట్‌ లేకపోతే ఉపేక్షించొద్దు

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:00 AM

రాష్ట్రంలో మోటార్‌ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Biker with Helmet

హారన్లతో నరకం చూపుతున్నారు

విజయవాడ నగరంలో వాహనదారులకు క్రమశిక్షణ లేదు. ప్రపంచానికి ఇదే చివరి రోజు అన్నట్లుగా అనవసరంగా హారన్లు మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. పోలీసులు కూడా వారిని నియంత్రించేందుకు ప్రయత్నించట్లేదు. నగరంలో ఎక్కడా నో హారన్‌ జోన్లు, సైన్‌బోర్డులు లేవు. స్పీడ్‌ గన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

- హైకోర్టు ధర్మాసనం

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలి

రోడ్లపైనే తనిఖీలు చేసి అక్కడికక్కడే చలాన్లు వేయాలి

విజయవాడలోని వాహనదారుల్లో క్రమశిక్షణ లేదు

చలాన్లు చెల్లించని వాహనాలను సీజ్‌ చేయాలి

వాహనదారుల లైసెన్సులు ఎందుకు రద్దు చేయడంలేదు?

చట్టం అమలుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు?

అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మోటార్‌ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలు అమలుచేయడంలో పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నొక్కిచెప్పింది. హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదని పోలీసులను ప్రశ్నించింది. నిబంధనల అమలు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని వాహనదారుల్లోకి బలంగా పంపించాలని, పోలీసులు రోడ్ల మీదకు వచ్చి వాహన రికార్డులు తనిఖీ చేసినప్పుడే అది సాధ్యపడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీసీ కెమెరాలపై ఆధారపడి చలాన్లు విధించడాన్ని తగ్గించి, పోలీసులు రోడ్లపై నిలబడి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చలాన్లు విధించి అక్కడికక్కడే వసూలు చేస్తే రెండునెలల్లో గణనీయమైన మార్పు వస్తుందని అభిప్రాయపడింది. పోలీసులు రోడ్లపై ఉంటే క్రిమినల్‌ చర్యలు కూడా తగ్గుతాయని పేర్కొంది.


99 శాతం మందికి హెల్మెట్లు లేవు

హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 99 శాతం మంది హెల్మెట్‌ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారని పేర్కొంది. వాహనాన్ని నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. మోటార్‌ వెహికిల్‌ చట్టంలోని సెక్షన్‌ 167 ప్రకారం నిర్ధిష్ఠ గడువులోగా చలాన్లను చెల్లించనివారి వాహనాలను ఎందుకు సీజ్‌ చేయడం లేదని ప్రశ్నించింది. అలాగే చట్టంలోని సెక్షన్‌ 206 ప్రకారం వాహనదారుల లైసెన్స్‌లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీసింది. హెల్మెట్‌ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది చనిపోయారని, హెల్మెట్‌ను తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి ఉంటే అందులో కొన్ని ప్రాణాలైనా నిలబడేవని వ్యాఖ్యానించింది. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి స్కూలు పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంది.

అవగాహన కల్పించాలి

ఎన్జీవోలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సహకారంతో మోటార్‌ వెహికిల్‌ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పత్రికలు, టీవీలు, ఎఫ్‌ఎం రేడియోలు, సైన్‌ బోర్డులు, సినిమాహాళ్లలో ప్రకటనల ద్వారా చట్టనిబంధనలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని స్పష్టం చేసింది. వాహనదారులకు విధించిన చలాన్లు ఏవిధంగా వసూలు చేస్తారు? హెల్మెట్‌ వినియోగం, వాహన చట్టనిబంధనలు అమలు చేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు? రోడ్లపై వాహనాలు తనిఖీ చేసేందుకు జిల్లాల వారీగా ఎన్ని బృందాలను ఏర్పాటు చేస్తారు? తదితర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీ కార్యాలయంలోని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (లీగల్‌) ఆకె రవికృష్ణను ఆదేశించింది. తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని కూడా స్పష్టం చేసింది. విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.


మా ఆదేశాలు అమలు చేయడంలేదేం?

కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధించడంలేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కోర్టు ముందు హాజరుకావాలని ఐజీ(ట్రాఫిక్‌)ను ఇటీవల విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. బుధవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. డీజీపీ కార్యాలయంలో ఐజీ(లీగల్‌)గా వ్యవహరిస్తున్న ఆకె రవికృష్ణ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఐజీకి పలు ప్రశ్నలు సంధించింది. హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసింది. ఐజీ బదులిస్తూ ఇకపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. జరిమానాలు వసూలు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జరిమానాల వసూలులో పురోగతి ఉందని తెలిపారు.

Updated Date - Dec 19 , 2024 | 10:01 AM