AP Politics: నాడు రూ. 140 కోట్ల దెబ్బకు సైలెంట్.. నేడు వైసీపీలోకి ఐఏఎస్!
ABN, Publish Date - Feb 29 , 2024 | 04:01 AM
సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ బుధవారం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) చేశారు. బుధవారం ఉదయం ఆయన వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేస్తూ ప్రభుత్వానికి
కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ?..
వీఆర్‌ఎస్ తీసుకున్న ఇంతియాజ్
ఉదయం దరఖాస్తు.. మధ్యాహ్నమే ఆమోదం.. సాయంత్రానికి ఉత్తర్వులు
చేరికపై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ (IAS Inthiyaz) బుధవారం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) చేశారు. బుధవారం ఉదయం ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. మధ్యాహ్నానికి ఆ లేఖను ప్రభుత్వం ఆమోదించింది. సాయంత్రానికి వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తున్నట్టు ఉత్తర్వులు (జీవో-477)ను జారీ చేసింది. వాస్తవానికి 2025, మే 31 వరకు ఇంతియాజ్‌కు సర్వీసు ఉంది. అయినా ఆకస్మికంగా వీఆర్‌ఎస్ తీసుకున్నారు. దీనికి కారణాలు ఏమిటో ఆయన తన దరఖాస్తులో ప్రస్తావించలేదని తెలిసింది. ప్రభుత్వం కూడా దరఖాస్తు అందిన రోజే ఆగమేఘాల మీద ఆమోదించింది. ఇంత వేగంగా వీఆర్‌ఎస్ తీసుకోవడానికి, ప్రభుత్వం శరవేగంగా ఆమోదించడానికి కారణం.. ఆయన వైసీపీలోకి (YSR Congress) చేరనుండడమేనని తెలిపింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీచేయబోతున్నారని సమాచారం.
ఈ వ్యవహారం గురించి ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ‘ఎన్నికల బరిలో ఇద్దరు ఐఏఎస్‌లు’ అని గతేడాది డిసెంబరు 30న వార్తను ప్రచురించింది. ఇంతియాజ్ ఎన్నికల బరిలో దిగబోతున్నారని సహచర ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే, ఆనాడు తనకు ఆ ఆలోచన లేదన్న ఆయన అనూహ్యంగా బుధవారం వీఆర్‌ఎస్ తీసుకున్నారు. డిపూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన ఇంతియాజ్ 2018కి ముందు నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో 2019, ఫిబ్రవరి 8న కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందారు. 2021, జూన్ వరకు ఆ పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించి అదే ఏడాది మైనారిటీ సంక్షేమశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియమించారు. ఇక, అప్పటి నుంచి ఆయనకు అన్ని కీలక పోస్టులు, పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు దక్కాయి. మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్, ఆ శాఖ స్పెషల్ సెక్రెటరీగా రెండు బాధ్యతల్లో ఉన్న ఇంతియాజ్‌కు వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి కూడా అప్పగించారు.
జగన్‌తో సాన్నిహిత్యం
సెర్ప్ సీఈవోతోపాటు మైనారిటీ సంక్షేమశాఖ కీలక బాధ్యతలు చూస్తున్న ఇంతియాజ్ వక్ఫ్‌బోర్డు విషయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరయ్యారు. తొలుత కర్నూలు లోక్‌సభ స్థానం నుంచే పోటీచేయాలన్న ఆసక్తి ఆయనలో ఉంది. తన సన్నిహిత ఐఏఎస్‌లు, ఇతర అధికారుల వద్ద పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చర్చించినట్లు తెలిసింది. అయితే, ఎంపీగా పోటీ చేసేవారు ఆ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు భరించాలన్నది జగన్ చెప్పిన మాట. దీనికోసం ముందుగానే రూ.140 కోట్లు కప్పం కట్టాల్సి ఉంటుందని ఆయన ఆశావహులకు తేల్చి చెప్పారు. సరిగ్గా ఇదే సమయంలో ఇంతియాజ్ అభ్యర్థిత్వంపై కూడా చర్చ జరిగింది. దీంతో తనకు ఎంపీ సీటుపై ఆశలేదని, ఇంకా తనకు సర్వీసు ఉందంటూ అసలు విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీ తన అభ్యర్థుల జాబితాను తుది దశకు తెస్తోంది. ఈ సమయంలో ఇంతియాజ్ వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేయడం, వెనువెంటనే సీఎం జగన్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఇదిలావుంటే, ఇంతియాజ్ వైసీపీ నుంచి కర్నూలు లోక్‌సభకు పోటీ చేస్తారా? అసెంబ్లీకా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన సన్నిహితులు మాత్రం కర్నూ లు అసెంబ్లీ స్థానానికే పోటీ చేస్తారని చెబుతున్నారు.
అధికార పార్టీ వైసీపీలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ చేరనున్నట్టు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఆయన కర్నూలు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఇంతియాజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో ఏడాదిపాటు సర్వీసు ఉండగానే ఆయన వీఆర్‌ఎస్ తీసుకోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
Updated Date - Feb 29 , 2024 | 08:34 AM