ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది

ABN, Publish Date - Nov 12 , 2024 | 05:38 AM

వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్‌కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో

జగన్‌కు ప్రతిపక్ష హోదా రాకపోయినా అంతే

సభకు రాని వాళ్లతో మనకెందుకు: స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్‌కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగానే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, గతంలో చాలా మంది సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లారని వ్యాఖ్యానించారు. కోర్టులు కూడా సంఖ్యా బలం ఆధారంగానే ప్రతిపక్ష హోదా లభిస్తుందని సృష్టంగా చెప్పాయని వివరించారు. ‘ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇదే నా సిద్ధం’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. బీఏసీ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన కాసేపు ముచ్చటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని మీడియా ప్రతినిధులు అడగగా, ఆయన స్పందించారు. రాని వాళ్లతో మనకెందుకు అంటూ వ్యాఖ్యానించారు. దేనికైనా చట్టం తన పని తాను చేసుకుంటుందని, వైఎస్‌ రాజశేఖర రెడ్డిని ఏ విషయం గురించి అడిగినా ఇదే మాట అనేవారని గుర్తుచేశారు. తమది కూడా అదే మాటని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న అడగాల్సిన ఎమ్మెల్యేలు సభకు వచ్చి వెంటనే వెళ్లిపోవాలన్న వైసీపీ నిర్ణయం గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ... వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే పూర్తి సమయం సభలో ఉండాలని, కాసేపు ఉండిపోయేదానికి రావడమెందుకని, దీనిని అసెంబ్లీని బహిష్కరించడమని అంటారా అని వ్యాఖ్యానించారు.

భోజనంపై స్పీకర్‌ సీరియస్‌

అసెంబ్లీలో భోజనం బాగా లేకపోవడంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా? అని అధికారులు, కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్యే అయినా భోజనం బాగుందన్నారా? సభ్యులకు ఒకలా, ఇతరులకు మరోలా భోజనం పెట్టారా? అని నిలదీశారు. అందరికీ ఒకేలా భోజనం పెట్టామని, కానీ అన్నం మాత్రమే మారిందని అధికారులు వివరణ ఇచ్చారు. ఒకేలా భోజనం పెడితే తానెందుకు నిలదీస్తానని స్పీకర్‌ అన్నారు. తనకు ఎందుకు ఫిర్యాదులు వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.


రేపు సెలవిస్తున్నా.. బడ్జెట్‌ చదువుకోండి

‘కొత్త సభ్యులకు బడ్జెట్‌ అర్థం అవ్వాలి. బడ్జెట్‌పై అవగాహన రావాలంటే స్టడీ చెయ్యాలి. రేపు సెలవు ఇస్తున్నా.. చదువుకుని రండి’ అని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శాసనసభ్యులకు సూచించారు. సభలో మంత్రులు బడ్జెట్‌ ప్రవేశపెట్టాక స్పీకర్‌ మాట్లాడారు. ‘మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు 84 మంది, రెండోసారి గెలిచినవారు 39 మంది ఉన్నారు. కొత్తగా వచ్చిన వారికి సాధారణ బడ్జెట్‌ అంటే ఏంటి? వ్యవసాయ బడ్జెట్‌ అంటే ఏంటి? అనేది అర్థమవ్వాలి. ఇది నా రిక్వెస్ట్‌.. రేపు జరగబోయే చర్చలో మీరు మాట్లాడాలి. సలహాలు కూడా ఇవ్వాలి. మీ అవగాహన కోసం రేపు అసెంబ్లీకి సెలవు ఇస్తున్నా. 13, 14న చర్చ ఉంటుంది. అందరూ బడ్జెట్‌పై చర్చలో పాల్గొనాలి’ అన్నారు. చదువుకోవడానికి సెలవు ఇస్తున్నారా అధ్యక్షా అని ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు అనడంతో.. ‘అవును తప్పేం లేదుగా’ అన్నారు. దీంతో సీఎం చంద్రబాబు సహా పలువురు నవ్వారు. సభ్యులతో పాటు బయటి వ్యక్తులు ఎక్కువగా లోపలికి వస్తున్నారని, అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇష్టానుసారం రానీయవద్దని ఎమ్మెల్యేలకు స్పీకర్‌ సూచించారు.

Updated Date - Nov 12 , 2024 | 05:38 AM