IMD Workshop : కాలుష్యం తగ్గితేనే వాతావరణం మెరుగు
ABN, Publish Date - Dec 21 , 2024 | 05:15 AM
వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడకు ముప్పు పొంచి ఉందని, కాలుష్యం తగ్గితేనే వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ..
రెవెన్యూ, విపత్తులశాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా
అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడకు ముప్పు పొంచి ఉందని, కాలుష్యం తగ్గితేనే వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. శుక్రవారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ‘క్లైమేట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఏపీ’ పుస్తకాన్ని, ‘ఐఎండీ అమరావతి’ పేరుతో బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఐఎండీ డీజీ మహాపాత్ర, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. సిసోడియా ప్రసంగిస్తూ, ‘తుఫాన్లు వంటి విపత్తులను ముందుగానే గుర్తించి ఐఎండీ జారీ చేస్తున్న ముందస్తు హెచ్చరికలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిరోధించడానికి వీలవుతోంది. అయితే, మారిన వాతావరణ పరిస్థితులకు మానవ తప్పిదాలే కారణంగా కనిపిస్తోంది. వాతావరణం, పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించకపోతే.. మానవ మనుగడ తల్లకిందులవుతుంది. వ్యక్తిగతంగా త్యాగాలు చేయకపోతే.. సామూహికంగా నష్టపోవాల్సి వస్తుంది’ అని అన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర ప్రసంగిస్తూ, ‘వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా రంగాల మనుగడైనా ఎక్కువగా వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రాణ, ఆస్తుల నష్టం జరగకుండా వాతావరణ మార్పులను గమనించి, ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విశ్లేణాత్మకంగా, ఉత్తమ సమాచార సేవలు అందించడానికి ఐఎండీ కృషి చేస్తోంది’ అని తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ, చెన్నై ఆర్‌ఎంసీ సైంటిస్ట్ ఎస్. బాలచంద్రన్, ఐఎండీ అమరావతి సెంటర్ డైరెక్టర్ ఎస్ స్టెల్లా, ఇతర అధికారులు ప్రసంగించారు.
Updated Date - Dec 21 , 2024 | 05:15 AM