‘పుంగనూరు’లో పెద్దిరెడ్డి అరాచకాలు
ABN, Publish Date - Jul 20 , 2024 | 04:21 AM
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భారీ భూ అక్రమాల్లో ఇదొకటి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారు.
అడ్డగోలుగా రాగానిపల్లె భూముల సెటిల్‌మెంట్
అనర్హుల చేతికి 982 ఎకరాలు.. నాడు అక్రమార్కులకు జేసీ, కలెక్టర్ అండ
రఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు జేసీ.. ఆర్డర్ ఇవ్వకుండానే రికార్డుల మార్పిడి
అప్పీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు.. ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భారీ భూ అక్రమాల్లో ఇదొకటి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారు. ఎస్టేట్‌ల రద్దు చట్టం-1948 అమలులో ఇదో చీకటి అధ్యాయం. బహుశా దేశంలో మరెక్కడా జరిగి ఉండదు. మంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు కూడబలుక్కొని భూమిని అనర్హుల చేతిలో పెట్టారు. ఆ భూమిపై రైత్వారీ పట్టాలు జారీ చేస్తూ ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. కనీసం సెటిల్‌మెంట్ అధికారి వద్ద అప్పీల్ చేయలేదు. ప్రత్యేక విచారణ జరగలేదు. కేవలం ఓ రఫ్ పట్టాను మాత్రమే నిర్ధారించారు. ఆగమేఘాల మీద ఆ భూమి రికార్డులు మార్చారు. ఒకే రోజులో సర్వే చేశారు. భూమిని సబ్ డివిజన్ చేశారు. ఆ తర్వాత ఆ భూమి నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల చేతికి చిక్కింది. ఈ చీకటి చరిత్రలో నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ కీలక పాత్రధారులని తాజాగా వెలుగుచూసింది. రెవెన్యూ ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తేనే ఒంటికాలి మీద లేచే అఖిల భారత సర్వీసు అధికారులు... ఎలాంటి ఉత్తర్వులూ లేకుండానే 982 ఎకరాల భూమిని పరాధీనం చేశారు. మరి వారిని ఏం చేయాలి? రాగానిపల్లెలో 982 ఎకరాల విలువైన భూమి పరాధీనంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ భూమికి సంబంధించిన రఫ్ పట్టాను నాటి చిత్తూరు జాయింట్ కలెక్టర్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ హోదాలో నిర్ధారించారు. ఆ తర్వాత భూమి రికార్డులను ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చారు. ఈ మొత్తం ప్రక్రియ అడ్డగోలుగా జరిగిందని ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఈ కేసులో అసలేం జరిగిందో కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. అందులో నాటి చిత్తూరు జిల్లా కలెక్టర్ వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది.
ఉత్తర్వులు లేకుండా..
అసలు ఎలాంటి సెటిల్‌మెంట్ ఉత్తర్వు లేకుండానే భూమిని పరాధీనం చేశారని నిర్ధారణ అవుతోంది. నాటి ప్రభుత్వ పెద్దలతో అధికారులు కుమ్మక్కయ్యారని సంచలన అంశాలు బయటకొస్తున్నాయి. రాగానిపల్లె భూమి విషయంలో ఎస్టేట్ రద్దు చట్టం-1948 ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కొత్తగా విచారణ చేపట్టాలని, పుంగనూరు తహసిల్దార్‌కు కూడా నోటీసులు ఇచ్చి అభిప్రాయం తీసుకోవాలని 2022 ఏప్రిల్ 28న సెటిల్‌మెంట్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు ఎస్టేట్ కేసుల సెటిల్‌మెంట్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ ఈ ఆదేశాలను ఆచరించాలి. ఆరు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలి. అప్పుడు జేసీ దీనిపై స్పందించలేదు. అదే ఏడాది నవంబరులో సుమోటోగా విచారణ చేపట్టారు. ఆ భూమిపై హక్కులు కోరుతున్నవారు తమ వద్ద ఉన్న రఫ్ పట్టాను సెటిల్‌మెంట్ అధికారి ముందు ఉంచారు. 2022 నవంబరు 18, డిసెంబరు 2, 24, 2023 జనవరి 12 తేదీల్లో విచారణ పూర్తి చేసి మార్చి 25న రఫ్ పట్టాను ప్రామాణికంగా తీసుకోవాలని జేసీ ఉత్తర్వులు ఇచ్చారు. 74 ఏళ్లుగా వివాదంలో ఉన్న కేసును జేసీ చాలా సింపుల్‌గా నాలుగే నాలుగు సిట్టింగ్‌ల్లో తేల్చారు. నాటి జమిందారుకు సెటిల్‌మెంట్ అధికారి ఇచ్చిన రఫ్ పట్టా సరైనదే అని, దాన్ని ఈ భూమి విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నట్లుగా 2023 మార్చి 25న ఉత్తర్వులు ఇచ్చారు. రఫ్ పట్టా సరైనదే అని తేల్చిన 9 రోజుల తర్వాత జేసీని మార్చారు. మరో జేసీని తీసుకొచ్చారు.
విచారణ ఏదీ?
రఫ్ పట్టా సరైనదేనని జేసీ ఉత్తర్వు ఇవ్వగానే సరిపోదు. ఆ తర్వాత ఆ భూమిపై హక్కులు కోరుతున్నవారు రఫ్ పట్టా ఆధారంగా తమకు 982 ఎకరాల భూమిపై రైత్వారీ పట్టాలు జారీ చేయాలని అదే సెటిల్‌మెంట్ అధికారి (జేసీ) కోర్టులో అప్పీల్ చేయాలి. ఇందులో ప్రభుత్వం తరఫున పుంగనూరు తహసీల్దార్, ఇతర అధికారులు పార్టీలుగా ఉంటారు. భూమిపై హక్కులు కోరుతున్నవారితో పాటు పుంగనూరు తహసీల్దార్‌కు కూడా నోటీసులు ఇచ్చి జేసీ సెటిల్‌మెంట్ కోర్టులో విచారణ చేయాలి. ఆ తర్వాత రైత్వారీ పట్టాలు జారీ చేస్తున్నట్లు గానో, లేదా పట్టా ఇవ్వడం లేదనో జేసీ స్పష్టమైన ఉత్తర్వు ఇవ్వాలి. ఈ కేసులో రైత్వారీ పట్టాలు కోరుతూ సెటిల్‌మెంట్ కోర్టులో అప్పీల్ చేయలేదు. అలాగని సెటిల్‌మెంట్ పట్టా జారీ చేస్తూ ఉత్తర్వు ఇవ్వలేదు.
రికార్డులు ఎలా మార్చారు?
ఆ భూమిపై రైత్వారీ పట్టాలు జారీ చేస్తున్నట్లుగా సెటిల్‌మెంట్ కమిషనర్ ప్రత్యేకంగా ఎలాంటి ఉత్తర్వు ఇవ్వలేదు. ఆ భూమికి సంబంధించి రఫ్ పట్టాను పరిగణనలోకి తీసుకుంటామని మాత్రమే ఉత్తర్వులో పేర్కొనలేదు. దాని ఆధారంగా అప్పీల్ జరగలేదు. కేసు విచారణ ముందుకు రాలేదు. అలాంటప్పుడు ఆర్‌ఎస్ నంబర్ 22లోని 982 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చడానికి వీల్లేదు. కానీ అధికారులు మార్చారు. ఉత్తర్వు ఇచ్చిన మరుసటి రోజే అంటే .. గత ఏడాది మార్చి 26న 15-20 మంది సర్వేయర్లను పెట్టి ఆగమేఘాల మీద ఆ భూమిపై సర్వేతో పాటు సబ్ డివిజన్ చేయించారు. ఆ మరుసటి రోజే ఆ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట మారుస్తూ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. ఆ భూమిని ఏ ఉత్తర్వు ఆధారంగా రికార్డులు మార్చారని చెప్పడానికి సమాధానం లేదు. నాటి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఇచ్చిన ఆదేశాల మేరకే సర్వే, సబ్ డివిజన్ చేసి భూమి రికార్డులు మార్చేశారు.
కలెక్టర్ వైఫల్యం..?
భూముల విషయంలో జాయింట్ కలెక్టర్‌కు ఎన్ని అధికారాలున్నా, వాటిని కాపాడేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రాగానిపల్లెలోని 982 ఎకరాల భూమిపై రైత్వారీ పట్టాలు జారీ చేయడానికి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటి ఉత్తర్వులేవీ లేకుండా కేవలం రఫ్ పట్టాను నిర్ధారిస్తూ ఇచ్చిన ఆదేశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్. ఆ తర్వాత ఆగమేఘాల మీద రికార్డుల మార్పిడి జరిగిపోయేలా ఆయన పెద్దలకు సహకరించినట్లుగా పలు ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఒకవేళ కలెక్టర్ తప్పేమీ లేదనుకుంటే, సెటిల్‌మెంట్ అధికారి ఇచ్చిన ఆదేశాలపై 30 రోజుల్లోగా సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్ కోర్టులో అప్పీల్ చేయాలి. కలెక్టర్‌కు ఆ అధికారం ఉంది. కానీ కలెక్టర్ ఆ పని చేయలేదు. అప్పీల్ చేయకుండా శరవేగంగా రికార్డుల మార్పిడికి ఆదేశాలు ఇచ్చారని స్పష్టమవుతోంది. ఒకవేళ రైత్వారీ పట్టాల జారీకి సెటిల్‌మెంట్ అధికారి ఉత్తర్వులే ఇచ్చి ఉంటే, 30 రోజుల్లోగా పైకోర్టు అంటే సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని అందులో ప్రస్తావిస్తారు. ఆ అవకాశాన్ని కూడా కలెక్టర్ వాడుకోవచ్చు. కానీ అది జరగలేదు. అసలు సెటిల్‌మెంట్ ఆర్డరే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయన్నది మౌలిక ప్రశ్న. కేవలం రఫ్ పట్టాను నిర్ధారించిన వెంటనే శరవేగంగా సర్వేలు, సబ్ డివిజన్‌లు చేయించి భూమి రికార్డులు మార్చేశారు. నిజానికి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకే ఆ భూమి రికార్డుల్లో మార్పులు చేశారు. ఈ పరిణామంపై సీనియర్ ఐఏఎస్‌లే విస్తుపోతున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు కట్టబెట్టే క్రమంలో చట్టాలు, నియమ నిబంధనలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
రఫ్ పట్టా అంటే..
జమిందారీ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం 1948లో ఎస్టేట్ల రద్దుచట్టం తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ అమల్లో ఉన్నప్పుడు జమిందారుల నుంచి భూములు పొందినవారు లేదా కొన్నవారికి రఫ్ (చిత్తు) పట్టాలు ఇచ్చారు. ఇలా రఫ్ పట్టాలు ఉన్నవారు సెటిల్‌మెంట్ చట్టం ప్రకారం సెటిల్‌మెంట్ అధికారి వద్ద రైత్వారీ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి, నిజమైనవే అని తేలితే రైత్వారీ పట్టాలు ఇస్తూ సెటిల్‌మెంట్ అధికారి ఉత్తర్వులు ఇస్తారు. కాలక్రమంలో బోగస్ రఫ్ పట్టాలు పుట్టించి వాటి ఆధారంగా రైత్వారీ పట్టాలు కోరుతున్నారని ప్రభుత్వం గుర్తించి వాటిని సీరియస్‌గా తీసుకోవద్దని మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎల్లుండి విచారణ
చిత్తూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా రాగానిపల్లెలో భూముల పరాధీనం వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగు చూసింది. ఈ భూములకు చెందిన అసలైన రైతులు కొందరు చిత్తూరు కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ రివిజన్ పిటిషన్ వేయాలని పుంగనూరు తహసీల్దారును ఆదేశించారు. తాజాగా తహసీల్దారు... సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్ధార్థజైన్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. సోమవారం విచారణకు రానుంది. ఇరువైపుల వాదనల తర్వాత కమిషనర్ ఈ భూముల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. వివాదాస్పద భూములుగా తేల్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ 982 ఎకరాల్ని రిజిష్ట్రేషన్ చేయొద్దంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా 982 ఎకరాలకు చెందిన 29 మంది రైతుల్లో నలుగురు హైకోర్టును ఆశ్రయించడంతో వారి భూములపై స్టేటస్ కో విధించింది.
Updated Date - Jul 20 , 2024 | 09:16 AM