Andhra Pradesh :శ్రీశైలంలో సరిహద్దుల పోరు
ABN, Publish Date - Jun 02 , 2024 | 05:34 AM
శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల మధ్య సరిహద్దుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రోజుల నుంచి దేవస్థానం పరిధిలో సరిహద్దుల విషయంలో అటవీశాఖ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
దేవస్థానం, అటవీశాఖల మధ్య భూ వివాదం
తాజాగా పనులు చేపట్టిన అటవీశాఖ
అడ్డుకున్న ఆలయ అధికారులు
శ్రీశైలం, జూన్ 1: శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల మధ్య సరిహద్దుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రోజుల నుంచి దేవస్థానం పరిధిలో సరిహద్దుల విషయంలో అటవీశాఖ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. శనివారం క్షేత్రంలోని టోల్‌గేట్, పాతాళగంగ మార్గంలోని డార్మిటరీల వద్ద గుంతలు తీసి సరిహద్దు స్థూపాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రదేశాల్లో కూడా సరిహద్దు స్తూపాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.
సమాచారం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు టోల్‌గేట్ వద్దకు చేరుకుని అటవీశాఖ అధికారి రేంజర్ నరసింహులుతో మాట్లాడారు. కొన్నేళ్ల నుంచి దేవస్థానం అభివృద్ధి చేసిన రహదారులు, భక్తుల వసతి సముదాయాల వద్ద సరిహద్దు స్థూపాలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వెంటనే దేవస్థానం అధికారులు యంత్రాలతో గుంతలను పూడ్చివేయించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాదరావు... దేవస్థానం, అటవీశాఖ అధికారులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. ఇరువర్గాలు ప్రభుత్వ శాఖలు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
గత ఏడాది దేవస్థానం, అటవీశాఖ, రెవెన్యూ సర్వే డిపార్ట్‌మెంట్ కలిసి చేపట్టిన సర్వేలో దేవస్థానం, అటవీశాఖ భూముల సరిహద్దులను గుర్తించారు. మల్లన్న భూముల రీ సర్వే కోసం ముగ్గురు మంత్రులు కమిటీగా ఏర్పడి సర్వేను పూర్తి చేయించారు. అయితే సర్వే జరగక ముందే దేవస్థానం భక్తుల కోసం చేపట్టిన అభివృద్ధి నిర్మాణాలు ఇప్పుడు అటవీశాఖ పరిధిలోకి వెళ్లాయి. అక్కడ ఇప్పుడు సరిహద్దు స్థూపాలు ఏర్పాటు చేయడం దేవస్థానం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
Updated Date - Jun 02 , 2024 | 05:34 AM