ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కల్తీ నెయ్యిని ఎప్పుడు గుర్తించారు?

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:22 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు.

  • తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి శాంపిల్స్‌ తీసుకుంది ఎప్పుడు?

  • ఏ తేదీల్లో ల్యాబ్‌కు పంపారు?

  • తిరుపతిలో సిట్‌ బృందం ఆరా

  • టీటీడీ ఈవో, సీవీఎ్‌సవోతో భేటీ

  • కీలక ఫైళ్లు, రికార్డుల పరిశీలన..

  • మరో 2-3 రోజులు ఇక్కడే!

తిరుపతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించారు. మరో రెండ్రోజులు తిరుపతిలోనే ఉండి దర్యాప్తును వేగవంతం చేస్తారని సమాచారం. గత నెల 22వ తేదీన సిట్‌ బృందానికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 34 మంది అధికారులు, ఉద్యోగులు తిరుపతి చేరుకుని కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన ప్రదేశాలు సందర్శించి సమాచారాన్ని, రికార్డులను సేకరించారు. తాజాగా సిట్‌కు నాయకత్వం వహిస్తున్న సీబీఐ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.వీరేశ్‌ ప్రభు, సీబీఐ విశాఖ రేంజ్‌ ఎస్పీ మురళీ రాంబా, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, జాతీయ ఆహార కల్తీ నిరోధక విభాగం (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) అధికారి సత్యకుమార్‌ పాండా గురువారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన సిట్‌ కార్యాలయానికి వెళ్లి కింది స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు వివరాలను తెలుసుకున్నారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు నివేదించారు. మధ్యాహ్నం 1.05 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం చేరుకుని టీటీడీ ఈవో శ్యామలరావు, సీవీఎ్‌సవో శ్రీధర్‌ తదితరులతో సమావేశమయ్యారు.


45 నిమిషాలు జరిగిన భేటీలో అవసరమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. గుజరాత్‌ ల్యాబ్‌, చెన్నైలోని ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌లు నెయ్యి నాణ్యతపై జారీ చేసిన రిపోర్టు ప్రతులను తీసుకున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎప్పుడు గుర్తించారు.. ప్రస్తుత ఈవో గుర్తించారా? లేక గతంలో పనిచేసిన అధికారులు గుర్తించారా? ఏ ఆధారాలతో గుర్తించారు? మైసూరులో కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్‌ ల్యాబ్‌ ఉండగా గుజరాత్‌ ల్యాబ్‌కు ఎందుకు పంపించారు? ఏఆర్‌ డెయిరీ పంపిన ట్యాంకర్లలో నాలుగింటిని దేని ఆధారంగా తిరస్కరించారు? మరో నాలుగింటిని ఎలా అనుమతించారు? తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిల్స్‌ సేకరించి భద్రపరిచారా? శాంపిల్స్‌ సేకరించింది ఏయే తేదీల్లో? తిరుమలలో టీటీడీ ల్యాబ్‌ టెక్నీషియన్లు దేవస్థానం ఉద్యోగులా... లేక బయటివారా? తిరుమల ల్యాబ్‌లో నెయ్యి నాణ్యత నిర్ధారించేందుకు తగిన పరికరాలు లేవని, టెక్నీషియన్లకు కూడా తగిన సాంకేతిక అర్హతలు లేవన్నది నిజమేనా? భారీ పరిమాణంలో నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు ల్యాబ్‌లో తగిన పరికరాలు, అర్హత కలిగిన సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదు? ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీల నుంచి ఎప్పుడెప్పుడు నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి సరఫరా అయ్యాయి.. వంటి ప్రశ్నలు సంధించి సమాచారం తీసుకున్నారు. అలాగే అవసరమైన ఫైళ్లు, రికార్డులు కూడా సేకరించారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని సదరు సమాచారాన్ని క్రోడీకరించుకునే పనిలో నిమగ్నమయ్యారు. సిట్‌ బృందం 2-3 రోజులు తిరుపతిలోనే ఉంటుంది. అవసరమని భావిస్తే టీటీడీ గోదాములు, మార్కెటింగ్‌ కార్యాలయం, తిరుమలలో ల్యాబ్‌, పోటులతోపాటు ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీ, చెన్నైలోని ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌లను సందర్శించే అవకాశముంది. కాగా సిట్‌లో నియమించిన విశాఖ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి శుక్రవారం రాలేదు.

Updated Date - Dec 14 , 2024 | 05:23 AM