Nara Lokesh: జగన్ అండ్ కో పంథా మార్చుకోవడం లేదు..
ABN, Publish Date - Aug 14 , 2024 | 08:00 AM
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారన్నారు.
అమరావతి: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేష్ తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా కూడా వైసీపీ నేతల దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏపీలో ఏదో ఒక మూలన దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పత్తికొండ మండలం హోసూరులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను దారుణ హత్య చేశారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్ళతో దుండగులు నరికి చంపేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ తేవడంతో వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోయారు. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యోదంతంపై స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లి శ్యాంబాబు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాసులు హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Aug 14 , 2024 | 08:52 AM