Share News

ఆందోళనాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చిన జగన్‌రెడ్డి: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:08 AM

దుర్మార్గుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేస్తూ ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఆందోళనాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చిన జగన్‌రెడ్డి: అచ్చెన్నాయుడు

టెక్కలి, జనవరి 6: దుర్మార్గుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేస్తూ ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ (టీఎన్‌టీయూసీ) ఆధ్వర్యంలో చంద్రన్న కార్మిక చైతన్య యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే వారిపై జగన్‌రెడ్డి పిచ్చి తుగ్లక్‌లా ఎస్మా జీవో తెచ్చారు. అంగన్‌వాడీల న్యాయమైన పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, సర్వశిక్ష అభియాన్‌ సిబ్బంది, ఆశావర్కర్లు వంటి వారు ధర్నాలు చేస్తున్నా సీఎం చలించడం లేదు. ఎన్నికల ముందు అధికారుల బదిలీలు చూశాం కానీ సైకో జగన్‌రెడ్డి రాష్ట్రంలో 36 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను బదిలీలు చేశారు. జగన్‌రెడ్డికి దమ్ముంటే పెద్దిరెడ్డి, చెవిరెడ్డి స్థానాలను మార్చగలరా? అంబటి రాయుడు వైసీపీలో చేరిన ఐదు రోజులకే డకౌట్‌ అయ్యారు. వైసీపీ నుంచి హేమాహేమీలు నన్ను సంప్రదిస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు, సమయం కుదిరినప్పుడు వారి పేర్లు వెల్లడిస్తా’ అని అచ్చెన్న చెప్పారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అహంకారి పాలన పోవాలని, ఆత్మగౌరవం రావాలని పిలుపునిచ్చారు. 28 రోజుల పాటు సాగే ఈ చైతన్య యాత్రలో 92 నియోజకవర్గాల్లో కార్మికులతో సమావేశమై ఓ అజెండా తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి అంబూరి సింధూజ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 07:08 AM