Pawan Kalyan: పంచాయతీరాజ్ ప్రక్షాళన!
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:12 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఆ శాఖకు సంబంధించిన వ్యవస్థలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి గ్రామీణులకు విస్తృతంగా సేవలందించాలని నిర్ణయించారు.

వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు.. మొదటిసారిగా సంస్కరణల బాట
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ
ఉద్యోగ సంఘాలు, భాగస్వాములతో చర్చలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పంచాయతీరాజ్ శాఖ ప్రక్షాళనకు మొదటి అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఆ శాఖకు సంబంధించిన వ్యవస్థలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి గ్రామీణులకు విస్తృతంగా సేవలందించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ నిపుణులతో సంప్రదించిన ఉపముఖ్యమంత్రి.. అన్నిటినీ ఒక చోటకు తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 22న డివిజినల్ అభివృద్ధి అధికారులు (డీఎల్‌డీవోలు), మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు), ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారులు (డిప్యూటీ సీఈవోలు), డివిజినల్ పంచాయతీ అధికారులు (డీఎల్‌పీవోలు), విస్తరణ అధికారుల (పీఆర్-ఆర్‌డీ ఈవోలు) ఉద్యోగ సంఘా లు, పంచాయతీరాజ్ అసోషియేషన్ జేఏసీ నేతలతో తాడేపల్లి కార్యాలయంలో కమిషనర్ కృష్ణతేజ, ఉపముఖ్యమంత్రి ఓఎస్‌డీ వెంకటకృష్ణ సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టదలచిన సంస్కరణలను వారి ముందుంచారు. వీటిపై అన్ని కేడర్ల అధికారులు సంతృప్తి చెంది.. ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉపముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రక్షాళన దశలో మొదట ఉద్యోగుల కేడర్ విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈ శాఖలో పనిచేసే అధికారుల కేడర్ హోదాకు సంబంధించి ఉన్న అంతరాలను తొలగించే ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో మొదటి అడుగు విజయవంతమైంది.
కేడర్ పోస్టులకు ఒకే హోదా..
సంస్కరణల్లో మొదటగా ఎంపీడీవో, డీఎల్‌పీవోలను ఒకే కేడర్‌గా నిర్ధారించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్‌లో ఉన్న డీపీవోలకు డివిజినల్ అభివృద్ధి అధికారి (డిప్యూటీ డైరెక్టర్) హోదా కల్పించారు. ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ) ప్రిన్సిపాళ్లకు డిప్యూటీ కమిషనర్ (అదనపు డైరెక్టర్) హోదా ఇచ్చారు. డీడీవో, డిప్యూటీ సీఈవో, డీపీవోలను ఒకే కేడర్ కిందకు చేర్చారు. వారు పదోన్నతి పొంది జడ్పీ సీఈవోలవుతారు. అయితే ఎంపీడీవోలను దేశవ్యాప్తంగా బ్లాక్ డెవల్‌పమెంట్ ఆఫీసర్లు(బీడీవో)లుగా పిలుస్తున్నందున మన రాష్ట్రంలో కూడా బీడీవోలుగానే పరిగణించాలని పంచాయతీరాజ్ అధికారుల సంఘాలు గతంలో ప్రభుత్వాన్ని కోరాయి. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 50 శాతం జడ్పీ సీఈవో పోస్టులను ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఐఏఎ్‌సలు లేకపోతే ఆ ఖాళీలను పంచాయతీరాజ్ శాఖలోని ఫీడర్ కేటగిరీ నుంచి భర్తీ చేస్తారు. లేదంటే డిప్యుటేషన్‌పై నియమించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ఎంపీడీవోల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు చెక్..
తాజా సంస్కరణల్లో భాగంగా ఎంపీడీవోలను డైరక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించకుండా పదోన్నతులతో భర్తీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. పీఆర్-ఆర్‌డీ ఈవో కేడర్‌ను ఇక నుంచి డిప్యూటీ ఎంపీడీవోలుగా పరిగణిస్తారు. జడ్పీ సీఈవోలుగా ఇతర శాఖల అధికారులను డిప్యుటేషన్‌పై నియమించుకోవచ్చన్న నిర్ణయం కొందరు పంచాయతీరాజ్ అధికారులకు మింగుడు పడడంలేదు. 50 శాతం జడ్పీ సీఈవో పోస్టులను ఐఏఎస్ అధికారులకు కేటాయించడాన్ని వారు వ్యతిరేకించడం లేదు. కానీ ఫీడర్ కేడర్ లేకుంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై నియమించుకోవచ్చన్న నిర్ణయాన్ని రెవెన్యూ అధికారులు అవకాశంగా తీసుకుంటారని అనుమానిస్తున్నారు. శాఖలోకి ఇతర అధికారులు రాకుండా కట్టడి చేసే విధంగా సంస్కరణలు ఉండాలని, ఈ ఒక్క నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. పంచాయతీరాజ్ శాఖలో 300 మంది డీడీవోలు పనిచేస్తున్నారని.. అధికారుల కొరత లేదని.. కాబట్టి జడ్పీ సీఈవోలుగా ఇతర శాఖల అధికారులను డిప్యుటేషన్‌పై నియమించేందుకు ఇచ్చిన వెసులుబాటును తొలగిస్తూ సవరణచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏకతాటిపైకి పంచాయతీరాజ్ పాలన..
రాష్ట్రంలో అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్దది. లక్ష మందికి పైగా ఉద్యోగులున్న ఈ శాఖలో పాలన ఒక తాటి మీద లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి సజావుగా సాగడం లేదు. ఎన్నో ఏళ్లుగా పాలకులు, బ్యూరోక్రాట్లు సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ఉపముఖ్యమంత్రి జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలని నిర్ణయించారు. జడ్పీ సీఈవో, డీఎల్‌డీవో, డీపీవో, పీఆర్ ఇంజనీరింగ్ ఎస్‌ఈ కార్యాలయాలన్నింటినీ ఒకే కాంపౌండ్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని వల్ల పంచాయతీరాజ్ పాలన సజావుగా సాగించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పంచాయతీరాజ్ ఉద్యోగులకూ ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఒక వ్యవస్థతో మరో వ్యవస్థ పరస్పరం సహకరింకునేలా ఇలా ఏకీకృతం చేస్తున్నారు.
Read more :
Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
For AndhraPradesh News And Telugu News