మావోయిస్టుల దాడిలో ‘కడప’ జవాన్ మృతి
ABN, Publish Date - Oct 20 , 2024 | 04:28 AM
ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్‌మడ్ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి కడప జవాన్ సహా ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు) దళానికి చెందిన ఇద్దరు మరణించారు.
మహారాష్ట్రకు చెందిన మరో సైనికుడు కూడా..
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ ప్రాంతంలో ఐఈడీ పేలుడు
మరో ఇద్దరు పోలీసు సిబ్బందికి గాయాలు
బ్రహ్మంగారిమఠం, అక్టోబరు 19: ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్‌మడ్ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి కడప జవాన్ సహా ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు) దళానికి చెందిన ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఐటీబీపీ, బీఎ్‌సఎ్‌ఫ(సరిహద్దు భద్రతా దళం), డీఆర్‌జీ(జిల్లా రిజర్వు గార్డు) దళాలు ధుర్బెద ప్రాంతంలో సంయుక్తంగా మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ నిర్వహించి శనివారం మధ్యాహ్నం నారాయణపూర్‌కు తిరిగి వస్తుండగా కొడ్లియార్ గ్రామం వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది.
మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె పంచాయతీ, పాపిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొడవటికంటి రాజేశ్(36), మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన అమర్ పన్వర్(36)గా గుర్తించారు. వీరిద్దరూ ఐటీబీపీలోని 53వ బెటాలియన్‌కు చెందినవారు. గాయపడిన ఇద్దరు నారాయణపూర్ జిల్లా పోలీసు రిజర్వు గార్డ్ దళానికి చెందినవారు. వారికి చికిత్స కొనసాగుతోందని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 4న అబూజ్‌మడ్ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించి 38 మంది మావోయిస్టులను హతమార్చాయి. ఆ ఘటన జరిగిన రెండు వారాలకే మావోయిస్టులు తాజా ఐఈడీ దాడికి పాల్పడ్డారు.
రెండు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి..
కొడవటికంటి రాజేశ్ 2007 నుంచి ఐటీబీపీలో జవాన్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు జానయ్య, బాలమ్మ గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేసి కుమారుడిని చదివించారు. రాజేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పాపిరెడ్డిపల్లెలోనే ఉండి పిల్లలను చదివిస్తున్నారు.
Updated Date - Oct 20 , 2024 | 04:28 AM